For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sravana masam 2022: లక్ష్మీప్రదమైన మాసం శ్రావణం : విశిష్టతలు

|

Sravana masam 2022: శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో ఐదో నెల. జులై, ఆగస్టు నెలలో వస్తుంది శ్రావణం. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు. మరి కొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలు కానుంది. శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుంది. నెల పాటు ఉదయం, సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షాలు పడుతుంటాయి. వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణాన్ని చాలా పవిత్రమైన మాసంగా చెబుతారు. లక్ష్మీ దేవికి ప్రీతి పాత్రమైనదని పండితులు అంటారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును శ్రావణం దూరం చేస్తుంది. శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణం పేరుతో ఉన్న ఈ మాసంలో శ్రీ మహా విష్ణువుకు చేసే పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ నెలను లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనదని కూడా అంటారు.

అలాగే శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నెలలో శివయ్యను పూజిస్తారు. ఈ మాసంలో చేసే పూజలకు, దైవ కార్యాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని అంటారు. పరమ శివుడికి ప్రతీ పాత్రమైన సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి కేశవునికి రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే పాపాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన నెల. మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉంటాయి. దీని వల్ల శ్రావణ మాసాన్ని వ్రతాల మాసం అని కూడా అంటారు. అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొంటారు.

శ్రావణ మాసంలో ప్రతి రోజుకూ ఒక విశిష్టత ఉందని పండితులు అంటుంటారు. శుక్ల పక్షంలో వచ్చే 15 రోజులు ఎంతో వైశిష్ట్యం కలిగినవని ప్రతీతి. ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో ఉంది.

శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు:
1. మంగళగౌరీ వ్రతం
2. వరలక్ష్మీ వ్రతం
3. నాగ చతుర్థి
4. పుత్రదా ఏకాదశి
5. రాఖీ పూర్ణిమ
6. హయగ్రీవ జయంతి
7. రాఘవేంద్ర జయంతి
8. శ్రీ కృష్ణాష్టమి
9. ఏకాదశి
10. పొలాల అమావాస్య

వరలక్ష్మీ వ్రతం(Varalaxmi vratam):

వరలక్ష్మీ వ్రతం(Varalaxmi vratam):

శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన వ్రతం వర లక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున వర లక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అని నమ్మకం. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, శాంతి, సంతోషం, ప్రేమ, శక్తి, కీర్తి వంటివి లభిస్తాయి.

మంగళ గౌరీ వ్రతం(Mangalagowri vratam):

మంగళ గౌరీ వ్రతం(Mangalagowri vratam):

శ్రావణ మాసంలో ఆచరించాల్సిన, ఎంతో విశిష్టత కలిగిన వ్రతం మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసంలో మొత్తం నాలుగు మంగళ వారాలు వస్తాయి. ఈ వారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కొత్తగా పెళ్లి అయిన వారు, ముత్తైదువులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంతో మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల్లో ఉంది.

శుక్ల చవితి నాగచతుర్ధి:

శుక్ల చవితి నాగచతుర్ధి:

నాగుల చవితిని సంవత్సరంలో రెండు సార్లు జరుపుకుంటారు. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి ఒకటి కాగా.. మరొకటి శ్రావణ మాసంలో వస్తుంది. అయితే.. శ్రావణ మాసంలో వచ్చే చవితిని కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారు మాత్రమే జరుపుకుంటారు. పాము పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. నాగుల చవితి నాడు రోజంతా ఉపవాసం ఉంటారు.

పుత్రదా ఏకాదశి:

పుత్రదా ఏకాదశి:

శ్రావణ శుద్ధ ఏకాదశినే పుత్రదా ఏకాదశి లేదా లలితా ఏకాదశి అని కూడా పిలుస్తారు. పుత్రదా ఏకాదశి రోజున గొడుగు దానం ఇవ్వాలని చెబుతుంటారు. ఇలా దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటుంటారు. పిల్లలు కలగక బాధ పడే వారు, సంతానం కోసం ఎదురు చూసే వారు ఈరోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

రాఖీ పూర్ణిమ(Rakhi pournami):

రాఖీ పూర్ణిమ(Rakhi pournami):

రాఖీ పండగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాఖీ పౌర్ణిమ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్న, తమ్ముళ్ల శ్రేయస్సు కోరుతూ అక్కాచెల్లెళ్లు చేతికి రాఖీ కడతారు. సోదరుని చేతికి రాఖీ కట్టి, బొట్టు పెట్టి, మిఠాయిలు తినిపిస్తారు. ఎప్పుడూ క్షేమంగా ఉండూ అని కోరుతూ కట్టేది రాఖీ. అలాగే సోదరులు.. తమకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లను ఆశీర్వదించి బహుమతి ఇస్తారు.

కృష్ణాష్టమి(sri krishnashtami 2022):

కృష్ణాష్టమి(sri krishnashtami 2022):

శ్రీకృష్ణుడు జన్మించిన రోజే శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా అంటారు. ఈ రోజున ఆ మహా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించి పాలు, వెన్న నైవేద్యంగా పెడతారు. సాయంత్రం వేళ చీకటి పడే సమయంలో ఉట్టిని కొట్టడం ఆచారంగా వస్తోంది.

పొలాల అమావాస్య(polala amavasya):

పొలాల అమావాస్య(polala amavasya):

పొలాల అమావాస్య పర్వదినాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఈ రోజు వ్యవసాయం ఉండి ఎద్దులు ఉన్న వారు వాటిని అందంగా అలంకరిస్తారు. ప్రత్యేకంగా పూజ చేస్తారు. లేని వారు మట్టితో చేసిన ఎద్దు బొమ్మలను ఆరాధిస్తారు. పొలాల అమావాస్య రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో ఉంటుంది. జీవన ఆధారానికి తోడ్పడే దేవతలను, పెద్దలను, పశువులను పొలాల అమావాస్య రోజుల పూజిస్తారు. గ్రామ దేవతను పూజించి వ్యవసాయానికి సహకరించాలని కోరుతారు. పొలాల అమావాస్యను ఎక్కువగా గ్రామాల్లో చేసుకుంటారు. అక్కడ పొలాలు ఉండటం, ఎద్దులను పెంచుకోవడం ఉండటంతో అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.

English summary

Shravan Masam 2022 Start & End Dates, Muhurta, Puja Vidhi, Importance, & Rituals in Telugu

Shravan Masam 2022 Start & End Dates, Muhurta, Puja Vidhi, Importance, & Rituals in Telugu. Have a look..
Desktop Bottom Promotion