నిద్రలేమితో బాధపడుతున్నారా? శ్రీ శ్రీ రవిశంకర్ సూచించిన 5 అద్భుత చిట్కాలు

ఇప్పుడందరి జీవితాలు బిజీగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సాయంత్రం అవగానే పనులన్నీ ముగించుకుని హాయిగా నిద్రపోయేవాళ్లు.. కానీ నేటి పరిస్థితి పూర్తి భిన్నం. అర్ధరాత్రి దాటినా చేతిలో మొబైల్, మెదడులో ఆఫీసు పని ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళనలు ఇలా కళ్ళలో నిద్ర మాయమై మనసు ఆలోచనల అలజడిలో చిక్కుకుపోతోంది. ఈ నిద్రలేమి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, శారీరక సామర్థ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఈ తీవ్రమైన సమస్యను అధిగమించడానికి ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ కొన్ని అత్యంత సులభమైన, శక్తివంతమైన నివారణలను సూచించారు. వీటిని మన దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ఎవరైనా గాఢ నిద్రను తిరిగి పొందవచ్చు.

నిద్రను దూరం చేసే ప్రధాన శత్రువులు

ఆలోచనల సుడిగుండం
ఆఫీసు టార్గెట్లు, కుటుంబ బాధ్యతలు, సంబంధాలలో సమస్యలు, రేపటి గురించిన భయాలు ఇలాంటి అంతులేని ఆలోచనలు మన మనసును ఒక యుద్ధరంగంలా మారుస్తాయి. మనసు నిరంతరం చలిస్తూ ఉంటే శరీరం విశ్రాంతి తీసుకోలేదు. ఫలితంగా నిద్ర పట్టదు.

Sri Sri Ravi Shankar Tips for Deep Sleep

అర్ధరాత్రి భోజనం
నిద్రపోయే ముందు కడుపునిండా తినడం. ముఖ్యంగా వేపుళ్లు, మసాలా పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం రాత్రంతా పనిచేయాల్సి వస్తుంది. దీంతో శరీరానికి విశ్రాంతి లభించక నిద్రకు ఆటంకం కలుగుతుంది.

చింతలు
కొందరు పడుకున్న తర్వాత గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మరికొందరు జరగబోయే దాని గురించి ఊహించుకుంటూ కంగారుపడతారు. ఈ గతం, భవిష్యత్తుల మధ్య నలిగిపోతూ వర్తమానంలోని విశ్రాంతిని కోల్పోతారు.

గాఢ నిద్ర మీ సొంతం కావడానికి 5 సులభమైన మార్గాలు

శ్వాసపై ధ్యాస (ప్రాణాయామం)
పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చుని కొన్ని నిమిషాల పాటు లోతుగా శ్వాస తీసుకోండి. గాలిని నెమ్మదిగా పీల్చుకుని అంతకంటే నెమ్మదిగా వదలండి. ఈ ప్రక్రియ మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, శరీరంలోని ఒత్తిడిని తొలగించి, మనసును వర్తమానంలోకి తీసుకువస్తుంది.

మనసుకు స్నానం (ధ్యానం)

ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాల ధ్యానం చేయడం వల్ల రోజంతా పేరుకుపోయిన మానసిక మలినాలు తొలగిపోతాయి. ధ్యానం మెదడుకు ఒక రకమైన రీఛార్జ్ లాంటిది. ఇది మనసును నిశ్చలం చేసి, గాఢ నిద్రలోకి జారుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.

అద్భుతమైన యోగ నిద్ర
ఇది శవాసనంలో పడుకుని చేసే ఒక శక్తివంతమైన యోగ ప్రక్రియ. ఇందులో శరీరంలోని ప్రతి భాగాన్ని, మనసును సంపూర్ణంగా రిలాక్స్ చేస్తారు. కేవలం 20 నిమిషాల యోగ నిద్ర.. కొన్ని గంటల గాఢ నిద్రతో సమానమైన విశ్రాంతిని ఇస్తుందని నిపుణులు చెబుతారు.

సంగీతం
నిద్రపోయే ముందు కర్ణ కఠోరమైన శబ్దాలకు బదులుగా వీణ లేదా ఫ్లూట్ వంటి వాయిద్యాలతో కూడిన మృదువైన, శాస్త్రీయ సంగీతాన్ని లేదా ప్రశాంతమైన శ్లోకాలను వినండి. ఈ సంగీత తరంగాలు మీ మనసులోని అలజడిని తగ్గించి, ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయి.

తరతరాల నాటి చిట్కా (గోరువెచ్చని పాలు)
పడుకోవడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం ఎంతో మేలు చేస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం, శరీరంలో మెలటోనిన్ అనే నిద్రను ప్రేరేపించే హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion