నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో!

Posted By:

కోడిగుడ్లతో ఎప్పుడూ అదే కర్రీ, ఫ్రై, పులుసు, ఆమ్లెట్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఆమ్లెట్ పులుసు ట్రై చేసి చూడండి. రుచి అదరహో అనేలా ఉంటుంది. ఆమ్లెట్ ముక్కలు పులుసులోని మసాలాలు, చింతపండు రసాన్ని పీల్చుకుని ఎంతో మృదువుగా, రుచిగా తయారవుతాయి.

వేడి అన్నంలో దీన్ని కలుపుకుని తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ పులుసు మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Bored of Regular Egg Curry Try This Tangy Spicy Omelette Pulusu Recipe in Telugu

ఆమ్లెట్ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఆమ్లెట్స్
-టమాటో
-ఉప్పు
-కారం
-పసుపు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-చింతపండు రసం
-ధనియాల పొడి
-గరం మసాలా
-కొత్తిమీర

రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే..

ఆమ్లెట్ పులుసు తయారీ విధానం

-ముందుగా ఆమ్లెట్ లు వేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి దానిమీద కోడిగుడ్డు పగులకొట్టి వేసి దాని పైన కాస్త ఉప్పు, కారం చల్లుకొని, ఆయిల్ చల్లి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.ఇలా మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలో వేసుకోండి. ఆమ్లెట్ వేసేటప్పుడు చాలా పల్చగా వేయకండి. మందంగా ఉన్న ఆమ్లెట్ పులుసులో వేసినప్పుడు విరిగిపోకుండా, పులుసును బాగా పీల్చుకుని రుచిగా ఉంటుంది

-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేగాక అందులో ఉల్లిపాయ సన్న ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించాలి.

-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా కలుపుకున్నాక అందులో టమాటో సన్నని ముక్కలు, ఉప్పు, కారం,పసుపు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.

-టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం, సరిపడా నీళ్లు పోసి పులుసుని బాగా మరగనివ్వాలి.

-పులుసు బాగా మరుగుతున్నప్పుడు అందులో రెడీ చేసుకున్న ఆమ్లెట్లను వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.

-తర్వాత మూత తీసి అందులో ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేయాలి.

-అంతే ఆమ్లెట్ పులుసు రెడీ. ఆమ్లెట్ పులుసును వెంటనే తినడం కంటే, చేసిన 2-3 గంటల తర్వాత తింటే మసాలాలన్నీ ఆమ్లెట్‌ కి పట్టి మరింత రుచిగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, October 16, 2026, 10:16 [IST]
Desktop Bottom Promotion