ఘుమఘమలాడే ఆలూ మష్రూమ్ గ్రేవీ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి.

Posted By:

భారతీయ వంటకాలలో, సాధారణంగా మనం వివిధ రకాల కూరగాయల కలయికతో చాలా కూరలు వండుతాము. ఉర్లగడ్డ వంకాయ, ఉర్లగడ్డ కాలీఫ్లవర్, ఉర్లగడ్డ పచ్చిబఠానీలు ..బంగాళదుంపలను ఉపయోగించే తయారుచేసుకునే వంటల్లో ఇలాంటివి చాలా ఇష్టమైన కాంబినేషన్ వంటలు. అలాంటిదే మరొకటి బంగాళదుంప పుట్టగొడుగుల కర్రీ. దీన్ని తయారుచేయడం సులభం.మష్రుం అంటే చాలా మందికి ఇష్టం అలాగే బంగాళదుంపలంటే ప్రాణం. అలాంటి వారికోసం ఈ రోజు ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక రిసిపిని పరిచయం చేస్తున్నాం. బంగాళాదుంపలు మరియు పుట్టగొడుగులతో తయారు చేసుకునేటటువంటి ఘుమఘుమలాడే వంటకం. ఇది నోరూరించే కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో కర్రీ అద్భుగంగా ఉంటుంది. బేబీ బంగాళాదుంపలు మరియు చిట్టి పుట్టగొడుగుల మిశ్రమంతో శాకాహారులు మరియు మాంసాహార ప్రియుల కోసం సంతృప్తికరమైన వంటకాన్ని పరిచయం చేస్తున్నాం.

ముఖ్యంగా ఈ గ్రేవీని కొన్ని మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమోటాలు మరియు కొబ్బరి పాలు మిశ్రమంతో తయారు చేస్తారు, ఇది క్రీమీ స్ట్రక్చర్ తో చక్కటి ఆకారాన్ని కూడా ఇస్తుంది. భోజన ప్రియుల కోసం ఈ కూరను అన్నం లేదా నాన్, చపాతీలకు పర్పెక్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలూ మష్రూమ్ గ్రేవీ పులావ్, బగారా రైస్ లేదా బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది.

కూరకు కొంత క్రీము ఆకృతిని జోడించడానికి ఇందులో జీడిపప్పును పేస్ట్ ను కలుపుకోవచ్చు. అలాగే బాదం కూడా పొడి చేసి వేయచ్చు. ఇంకా అదనపు టేస్ట్ కోరుకునే వారు చిక్కటి కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు. ఇంకా ఆరోగ్యం మీద శ్రద్ద ఉన్నవారు పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరలు చిన్న ముక్కలుగా కోసి గ్రేవీలో మిక్స్ చేసుకోవచ్చు. ఈ వంటకం కేవలం రెండింటి కాంబినేషన్ మాత్రమే కాకుండా ఈ వంటకు క్యాప్షియం, ఆకుకూరలు కూడా జోడించుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

* బంగాళాదుంపలు 4 మీడియం సైజువి
* వైట్ బటన్ పుట్టగొడుగులు 200 గ్రాములు
* నూనె 3 టేబుల్ స్పూన్లు
* బే ఆకులు 1 చిన్నది
* జీలకర్ర 1 టీస్పూన్
* ఉల్లిపాయలు 1 కప్పు (చాలా సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి 4 ముక్కలు (సన్నగా తరిగినవి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ 3స్పూన్లు
* టమోటాలు 1 కప్పు చిన్న ముక్కలుగా తరిగినవి
* కారం : 1 టీస్పూన్
* పసుపు 1/4 టీస్పూన్
* ఉప్పు రుచికి సరిపడా
* జీడిపప్పులు 10
* కసూరి మేతి ¾ టీస్పూన్
* గరం మసాలా 1 స్పూన్
* కొబ్బరి పాలు
* కొత్తిమీర ఆకులు గుప్పెడు (సన్నగా తరిగినవి)
* నీరు సరిపడా

తయారుచేయు విధానం

మొదటగా జీడిపప్పుతో పాటు టొమాటో ముక్కలను జార్ లో వేసి మొత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఉల్లిపాయలను పొట్టు తీసి , పచ్చిమిర్చి రెండు బాగా కడిగి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి
అలాగే పుట్టగొడుగులను కడిగి కావలసిన సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడి అయ్యాక అందులో పుట్ట గొడుగులు వేసి బ్రౌన్ కలర్లో వేగే వరకు వేగించండి. అందుకు 5 నిముషాల సమయం పుడుతుంది. తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత అదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేగించాలి. ఇవి వేగుతున్నప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు టమోటో ముక్కలు కూడా వేగించాలి.

ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. అంతలోపు బంగాళ దుంపలను తీసుకుని వాటి శుభ్రంగా కడిగి, పొట్టు తీసి లేదా తీయకుండా కూడా వేసుకోవచ్చు. పొట్టు తీసిన బంగాళదుంపలను మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోండి.

ఇప్పడు ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారినప్పుడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత అందులోనే టొమాటో పేస్ట్ వేసి తేమ పూర్తిగా తగ్గే వరకు ఉడికించాలి.

తర్వాత ఇందులోనే కారం, పసుపు, ఉప్పు మరియు గరం మసాలా జోడించండి. వీటన్నింటినీ మిక్స్ చేసి 2 నుండి 3 నిమిషాలు వేగించుకోవాలి.

అవి 5 నిముషాల పాటు వేగిన తర్వాత అందులో బంగాళదుంపలను వేసి మరో ఐదు నిముషాలు వేగించుకోవాలి. వేగిన తర్వాత, గ్రేవీ తయారవ్వడానికి కావల్సినన్ని నీరు పోసి, మొత్తం మిశ్రం బాగా కలుపుతూ మూత పెట్టి ఉడికించాలి.

బంగాళదుంప ఉడికే సమయంలో అవసరం అయితే కస్తూరీ మేతిని, కొబ్బరి పాలు జోడించండి. తర్వాత బంగాళ దుంపలు మెత్తగా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి మొత్తం మిశ్రమం కలపాలి.

ఉప్పు కారం రుచి చూసి మీకు సరిపోయే విధంగా సర్థుబాటు చేసుకోండి. గ్రేవీ చిక్కగా ఉంటే రుచి అద్భుతంగా ఉంటుంది.

చివరగా కొత్తిమీర తరుగును గార్ణిషింగ్ చేసి మూత పెట్టి మరో రెండు నిముషాలు అలా ఉంచాలి. అంతే ఆలూ మష్రూమ్ కర్రీ రెడీ. దీన్ని అన్నం లేదా రోటీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, July 12, 2024, 13:38 [IST]
Desktop Bottom Promotion