ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా

Posted By:

బంగాళాదుంప (ఆలూ) అంటే ఇష్టపడని భోజనప్రియులు ఎవరుంటారు చెప్పండి? అందులోనూ కరకరలాడే ఆలూ ఫ్రై ఉంటే చాలు, అన్నం మొత్తం దాంతోనే లాగించేయొచ్చు. సాధారణంగా మనం రకరకాల మసాలాలతో ఫ్రైలు చేస్తుంటాం.

కానీ ఒక్కసారి కేరళ స్టైల్ పొటాటో ఫ్రై రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, కరివేపాకు సువాసనలతో నోరూరించే ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Kerala Style Aloo Fry How to Make Kerala Potatao Fry Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు - 4
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకు - కొద్దిగా
కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
తాజా కొత్తిమీర - కొద్దిగా

జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు!

తయారీ విధానం

-ముందుగా బంగాళాదుంపల పై పొట్టు (చెక్కు) తీసేయండి. వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా..పొడవుగా, కొంచెం మందంగా ఉండే ఫింగర్స్ లాగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను ఒక గిన్నెలో నీళ్లు పోసి సుమారు 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉన్న ఎక్స్‌ట్రా స్టార్చ్ పోయి ఫ్రై కరకరలాడుతూ వస్తుంది. ఆ తర్వాత నీళ్లన్నీ పూర్తిగా వంపేసి ముక్కలను ఆరనివ్వండి.

-తర్వాత స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వేయించే కొబ్బరి నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించండి. వెల్లుల్లి, కొబ్బరి నూనె కలిపి వేగుతుంటే వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుంది.

-తాలింపు వేగిన వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప ముక్కలను కడాయిలో వేసి నూనె అంతా పట్టేలా బాగా కలపాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇందులో చుక్క నీళ్లు కూడా పోయకూడదు. కేవలం ఆ నూనెలో, పాన్ పైన మూత పెట్టినప్పుడు వచ్చే ఆవిరితోనే దుంపలు సాఫ్ట్ గా ఉడికేలా మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

-బంగాళాదుంపలు చక్కగా ఉడికిన తర్వాత.. అందులో కాశ్మీరీ కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం తాజా కరివేపాకు కూడా ఇప్పుడే వేయండి. మసాలాలు పచ్చివాసన పోయేలా సన్నని మంట మీద మరో 6 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.

-ముక్కలు ఎర్రగా, క్రిస్పీగా వేగిన తర్వాత చివరగా చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, పక్కన సాంబార్ లేదా రసం ఉంచుకుని ఈ పొటాటో ఫ్రైను నంజుకుని తింటే.. ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

[ of 5 - Users]
Story first published: Friday, October 9, 2026, 11:33 [IST]
Desktop Bottom Promotion