కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఈ సంవత్సరం సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు కృష్ణ భక్తులు. ఈ పండుగ సందర్భంగా హిందువుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కన్నయ్యకు ఇష్టమైన రకరకాల పిండివంటలు, స్వీట్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ఈసారి ఆ నైవేద్యాల లిస్ట్ లో కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అటుకులు, నువ్వులతో చేసే ఒక అద్భుతమైన స్వీట్‌ ను చేర్చండి. అదే అటుకులు నువ్వుల లడ్డూ. ఎంతో మృదువుగా, కమ్మగా ఉండే ఈ స్వీట్‌ ను కేవలం 10 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

Quick Easy and Healthy How to Make Atukulu Nuvvula Laddu Recipe at Home for Krishnashtami

అటుకులు నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు

బ్రౌన్ షుగర్ (లేదా బెల్లం తురుము) - 3/4 కప్పు
నీళ్లు - 1 కప్పు
నెయ్యి - ఒకటింబావు టేబుల్ స్పూన్లు + 1 టేబుల్ స్పూన్ (విడిగా)
కొబ్బరి తురుము - 3/4 కప్పు
తెల్ల నువ్వులు - పావు కప్పు
అటుకులు - 1 కప్పు
వేయించిన పల్లీల పొడి (వేరుశెనగ పొడి) - పావు కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్

కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా

అటుకులు నువ్వుల లడ్డు తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో 3/4 కప్పు బ్రౌన్ షుగర్ లేదా బెల్లం తీసుకుని, దానికి 1 కప్పు నీళ్లు జతచేసి స్టవ్ మీద పెట్టండి. తీపి పూర్తిగా కరిగి నీళ్లలో కలిసేవరకు మరిగించి, ఆ ద్రావణాన్ని పక్కన పెట్టుకోండి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, అందులో ఒకటింబావు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక కొబ్బరి తురుము వేసి, మంచి సువాసన వస్తూ బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.

-అదే పాన్‌ లో పావు కప్పు తెల్ల నువ్వులు కూడా వేసి దోరగా వేయించండి. నువ్వులు చిటపటలాడి రంగు మారాక, ఆ కొబ్బరి-నువ్వుల మిశ్రమాన్ని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత అదే పాన్‌లో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. అందులో 1 కప్పు అటుకులు వేసి, అవి బాగా క్రిస్పీగా అయ్యేవరకు సన్నని మంటపై వేయించండి.

-ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న తీపి నీటిని వడకట్టి, వేగుతున్న అటుకుల్లో పోసి బాగా కలపండి. మూతపెట్టి, అటుకులు ఆ నీటిని పూర్తిగా పీల్చుకుని మెత్తబడే వరకు ఉడికించండి.

-నీరంతా ఇగిరిపోయిన తర్వాత మూత తీసి, ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి.

-చివరగా అందులో పల్లీల పొడి, యాలకుల పొడి వేసి అన్ని పదార్థాలు కలిసేలా తిప్పండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి.

-చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, గోరువెచ్చగా ఉన్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా లడ్డూల్లా చుట్టుకోండి.

-అంతే అటుకులు నువ్వుల లడ్డు రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, September 3, 2026, 21:45 [IST]
Desktop Bottom Promotion