స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చికెన్ తో రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. చికెన్ పకోడీ, చికెన్ 65, చిల్లీ చికెన్.. ఇలా ఎప్పుడూ ఒకేరకమైన వంటకాలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, కరకరలాడుతూ, నోటికి ఎంతో రుచిగా తగిలే చికెన్ మిక్చర్ ట్రై చేసి చూడండి. సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు.. ఈ చికెన్ మిక్చర్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. పల్లీల కరకరలు, వెల్లుల్లి ఘాటు, మసాలా దట్టించిన చికెన్ ముక్కల కలయికతో ఈ మిక్చర్ మీ నాలుకకు పండుగ చేస్తుంది.

Spicy Crunchy Chicken Mixture Recipe in Telugu Your Taste Buds Will Thank You

చికెన్ మిక్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బోన్‌ లెస్ చికెన్ - (చిన్న ముక్కలు)
ఉల్లిపాయలు - 2 పెద్దవి
నీళ్లు, చక్కెర, ఉప్పు (ఉల్లిపాయలు నానబెట్టడానికి)
పసుపు - కొద్దిగా
గరం మసాలా - 1 టీస్పూన్
నూనె - వేయించడానికి
వెల్లుల్లి రెబ్బలు - 8
ఎండుమిర్చి -4
కరివేపాకు - రెండు రెమ్మలు
పల్లీలు- అర కప్పు
శనగపప్పు (పుట్నాలు) - పావు కప్పు

క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ!

చికెన్ మిక్చర్ తయారీ విధానం

-ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలలో సగం తీసుకుని ఒక గిన్నెలో వేయండి. అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు చక్కెర వేసి, అవి మునిగేలా కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లోని ఘాటు తగ్గిపోయి, తీపి-ఉప్పు కలగలిసిన అద్భుతమైన రుచి వస్తుంది. మిక్చర్ తినేటప్పుడు పంటి కింద ఈ ఉల్లిపాయలు తగులుతుంటే భలే మజాగా ఉంటుంది.

-శుభ్రం చేసుకున్న బోన్‌ లెస్ చికెన్‌ ను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ చికెన్ ముక్కలు వేసి, అందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత, నీటిని వంపేయాలి. ఇప్పుడు ఈ ఉడికించిన చికెన్ ముక్కలకు కొద్దిగా ఉప్పు, గరం మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కగానే.. దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పల్లీలు, పుట్నాలు వేసి కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సగం ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.

-పోపు, పల్లీలు బాగా వేగి సువాసన వస్తున్నప్పుడు.. ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న ఉడికించిన చికెన్ ముక్కలను కడాయిలో వేయాలి. మంటను మీడియంలో ఉంచి, చికెన్ ముక్కలు కాస్త క్రిస్పీగా, రోస్ట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్‌కు పట్టి అద్భుతమైన రుచి వస్తుంది.

-చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి, దాన్ని ఒక సర్వింగ్ బౌల్‌ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉప్పు, చక్కెర నీళ్లలో నానబెట్టుకున్న ఉల్లిపాయలను నీళ్లు పూర్తిగా పిండేసి వేడివేడి చికెన్ మిక్చర్ పైన చల్లుకుని బాగా కలుపుకోవాలి.

-అంతే నోరూరించే స్పైసీ అండ్ క్రంచీ చికెన్ మిక్చర్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, July 25, 2026, 15:07 [IST]
Desktop Bottom Promotion