మాధవీలత దుర్గా స్తుతి..ముస్లింల తీవ్ర ఆగ్రహం..భగవద్గీత శ్లోకంతో ట్రోలర్స్‌ కి మాధవీలత చెక్!

బీజేపీ ఫైర్‌ బ్రాండ్ నాయకురాలు కొంపెల్ల మాధవీలత ఏది చేసినా, ఏది మాట్లాడినా అది క్షణాల్లో హాట్ టాపిక్‌ గా మారిపోతుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వేదికగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా, వివాదంగా మారింది.

అసలేం జరిగిందంటే?
పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన మాధవీలత..ఎయిర్ పోర్ట్ లోని ప్రేయర్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ ఓ సైడ్ కూర్చొని గట్టిగా దుర్గా స్తుతి పఠించారు. అయితే అదే సమయంలో ఆ గదిలో కొందరు ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించి రంజాన్ ప్రార్థనలు (నమాజ్) చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడిది రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా వార్‌ కు దారితీసింది.

Durga Stuti Amidst Namaz BJP Madhavi Latha Hits Back at Critics with Gita Quotes

ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్న ముస్లిం మహిళలను కించపరిచేలా, వారిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే మాధవీలత కావాలనే పెద్ద వాయిస్‌ తో పూజలు చేశారంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

మాధవీలత వివరణ ఏంటి?
తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోని మాధవీలత.. తాను పూజలు చేసిన వీడియోను తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో సగర్వంగా పంచుకున్నారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇదొక ప్రశాంత క్షణం.. భారతీయ హృదయంలో కొలువై ఉన్న దైవత్వానికి నా ప్రణామం అంటూ దానికి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చారు.

లోక కల్యాణం సాధనలో భాగంగా మొదట అంతర్మాత సమతౌల్యాన్ని సాధించాలని మాధవీల తన ఎక్స్ పోస్ట్ లో తెలిపారు. లోక కల్యాణం, ప్రపంచ శాంతి కోసమే తాను దుర్గామాతను ప్రార్థించానని ఆమె స్పష్టం చేశారు. విమానాశ్రయాల్లోని ప్రార్థనా మందిరాలను ప్రతి ఒక్కరూ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లా భావించాలని, ఇవి గాఢమైన నిశ్శబ్దానికి, ఆధ్యాత్మిక అనుబంధానికి నిలయాలని ఆమె పిలుపునిచ్చారు.

మద్దతుగా నిలుస్తున్న మరో వర్గం..
మాధవీలతకు మద్దతుగా నెటిజన్లు భారీ సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఆమె ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. కేవలం తన ప్రార్థన తాను చేసుకున్నారు. దీనిపై ముస్లింలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? హిందువులంటే అంత ద్వేషం ఎందుకు? మాధవీలతపై అసభ్యకరమైన కామెంట్లు చేయడం దారుణం అంటూ డిఫెండ్ చేస్తున్నారు.

వాస్తవానికి, ఎయిర్‌పోర్టుల్లో ఉండే ప్రేయర్ రూమ్స్ ఏ ఒక్క మతానికో చెందినవి కావు. ప్రయాణ బడలికను మర్చిపోయి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు.. ఇలా ఎవరైనా నిశ్శబ్దంగా మెడిటేషన్ ద్వారా రిలాక్స్ అయ్యేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు.

మరో పోస్ట్ పెట్టిన మాధవీలత

తనపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి మాధవీలత తన ఎక్స్ అకౌంట్ లో పెట్టిన మరో పోస్ట్ లో..హిందూ ధర్మం మనకు సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయాలలో, సంధ్యా మాసంలో, ఆ తర్వాత కూడా దైవాన్ని స్మరించాలని బోధిస్తుంది. భక్తి అనేది ఒక క్షణికమైనది కాదు, అది ఒక జీవన విధానం. వైదిక ధర్మం నుండి పంచ మహాయజ్ఞాల స్ఫూర్తి వరకు ప్రతి కర్మ ఒక అర్పణగా మారుతుంది.

భగవద్గీత (8.7) మనకు ఇలా గుర్తుచేస్తుంది.. అన్ని వేళలా నన్ను స్మరించండి. జపం, స్తోత్రం లేదా మౌన ప్రార్థన ద్వారా ఈ నిరంతర స్మరణ మనల్ని ధర్మంతో అనుసంధానం చేస్తుంది. మన సంప్రదాయంలో, ప్రార్థన అంటే దైవంతో మాట్లాడటం, ధ్యానం అంటే వినడం.. ఈ రెండూ అత్యవసరం. అటువంటి భక్తిని ప్రశ్నించడం అంటే సనాతన ధర్మం సార్వత్రిక, విస్తృత స్వభావాన్ని అపార్థం చేసుకోవడమే అని మాధవీలత తన పోస్ట్ లో తెలిపారు,

వివాదాలు ఆమెకు కొత్తేమీ కాదు..
మాధవీలత వివాదాల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసిన ఆమె.. ప్రచార సమయంలో మసీదు వైపు రామబాణం సంధిస్తున్నట్లు చేసిన సంజ్ఞలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఇటీవల బంజారాహిల్స్‌ లో ఎంఐఎం నేతలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఫ్లెక్సీలను ఆమె చించివేయడం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఏసీ గదుల్లో ధనవంతులకు ఇఫ్తార్ విందులు ఇవ్వడం రంజాన్ స్ఫూర్తి కాదని, పేదలకు అండగా నిలవడమే అసలైన పవిత్రత అని అప్పట్లో ఆమె చురకలు అంటించారు.

Desktop Bottom Promotion