చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్‌ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చలికాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఈ కాలంలో చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చ్యవన్‌ ప్రాష్ తీసుకుంటారు. మార్కెట్లో అనేక రకాల చ్యవన్‌ ప్రాష్‌ లు లభిస్తున్నప్పటికీ, కొద్దిపాటి శ్రమతో కల్తీ లేని స్వచ్ఛమైన చ్యవన్‌ ప్రాష్‌ ను ఇంట్లోనే చేసుకోవచ్చు.

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరికాయతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలను అందించే ఎండు ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో రోజూ ఒక చెంచా ఈ స్వచ్ఛమైన చ్యవన్‌ ప్రాష్ తీసుకుంటే మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యానికి తిరుగుండదు. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూడండి.

Chemical Free Homemade Amla Chyawanprash Winter Immunity Booster Recipe in Telugu

కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు: 1 కిలో
బెల్లం: 500-700 గ్రాములు
నెయ్యి: 100 గ్రాములు
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, మఖానా: 50 గ్రాముల చొప్పున
పిస్తా పప్పులు: 25 గ్రాములు
ఖర్జూరాలు: 100 గ్రాములు
యాలకులు: 10-12
దాల్చినచెక్క: 1 చిన్న ముక్క
నల్ల మిరియాల పొడి: అర టీస్పూన్
ఎండు అల్లం పొడి: 1 టీస్పూన్
తేనె: 2 టేబుల్ స్పూన్లు

చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన నువ్వుల పట్టీ..ఇంట్లోనే ఇలా చేసుకోండి!

ఆమ్లా చ్యవన్‌ప్రాష్ తయారీ విధానం

-ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్‌ లో కొద్దిగా నీళ్లు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉసిరికాయలు చల్లారిన తర్వాత గింజలను తొలగించి, మిక్సర్‌ లో వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-మరోవైపు బాదం, జీడిపప్పు, పిస్తా, మఖానా విడివిడిగా దోరగా వేయించి, చల్లారాక చిన్న ముక్కలుగా తరగాలి. ఖర్జూరాల నుండి గింజలు తీసేసి, వాటిని కూడా మిక్సర్‌ లో మెత్తగా గ్రైండ్ చేయాలి.

-ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న బాండీలో నెయ్యి వేడి చేసి, ఉసిరి గుజ్జును వేయాలి. తక్కువ మంట మీద అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉడికించాలి. అదనపు నీరు ఆవిరై, మిశ్రమం కాస్త చిక్కబడినప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక ప్రత్యేక పాత్రలో బెల్లం, కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి.

-బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దానిని వడకట్టి, ఉసిరి మిశ్రమంలో కలపాలి. తర్వాత గ్రైండ్ చేసిన ఖర్జూరాలు, తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, మఖానా వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు అందులో యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, నల్ల మిరియాల పొడి, ఎండు అల్లం పొడి వేయాలి. అన్నింటినీ బాగా కలిపి, పాత్ర అడుగున అంటుకోకుండా తక్కువ మంటపై మిశ్రమం చిక్కబడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించాలి.

-మిశ్రమం చక్కగా ఉడికిన తర్వాత మంట ఆపేసి చల్లారనివ్వాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత తేనె కలిపితే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన హోమ్ మేడ్ ఆమ్లా చ్యవన్‌ ప్రాష్ రెడీ.

-తయారుచేసిన చ్యవన్‌ ప్రాష్‌ ను తడి లేని శుభ్రమైన, పొడి గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌ లో భద్రపరచాలి.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 17, 2026, 14:43 [IST]
Desktop Bottom Promotion