శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు!

చలికాలం వచ్చిందంటే చాలు.. పిక్నిక్‌ లు, పెళ్లిళ్లు, పార్టీలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆత్మీయులతో కలిసి వేడివేడి బిర్యానీలు, నోరూరించే మాంసాహార వంటకాలు, రకరకాల స్వీట్లతో విందులను ఆస్వాదిస్తుంటాం. వీటికి తోడు వేడుకల్లో చాలా మందికి మందు తాగే అలవాటు కూడా ఉంటుంది. అయితే సంతోషం పేరుతో అతిగా తిన్నా, తాగినా మొదటికే మోసం రావచ్చు.

సాధారణంగా కొంచెం ఎక్కువ తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట లేదా అజీర్ణం రావడం సహజం. కానీ అతిగా మద్యం తాగే అలవాటు ఉండి, ఇతర శారీరక సమస్యలు కూడా తోడైతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. అటువంటి సందర్భాల్లో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్(క్లోమంలో ఆకస్మిక వాపు) సంభవించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సకాలంలో ట్రీట్మెంట్ అందకపోతే ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.

Acute Pancreatitis in Winter How Heavy Drinking and Feasts Trigger Severe Risk

అసలు ఏమిటీ తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్?

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో క్లోమం (Pancreas) ఒకటి. జీర్ణాశయం లోపలి భాగంలో ఉండే ఈ అవయవం ఆహారాన్ని అరిగించే జీర్ణ ఎంజైమ్‌ లను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ వంటి ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా క్లోమం ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ లు చిన్న ప్రేగులోకి వెళ్లి, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడతాయి. కానీ ఏదో ఒక కారణంతో ఈ ఎంజైమ్‌ లు క్లోమం లోపలే క్రియాశీలమైతే అసలు ప్రమాదం మొదలవుతుంది. అప్పుడు అవి ఆ అవయవంలోని సొంత కణాలను, కణజాలాన్ని దెబ్బతీయడం ప్రారంభిస్తాయి. ఫలితంగా క్లోమం అకస్మాత్తుగా వాపుకు గురవుతుంది. ఈ తీవ్రమైన పరిస్థితినే వైద్య పరిభాషలో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ అని అంటారు.

ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?

తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ రావడానికి పిత్తాశయ రాళ్లు, ఎక్కువగా మందు తాగడం ప్రధాన కారణాలు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లేదా ఒకేసారి భారీగా తాగేవారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుంది. అయితే, ఈ వ్యాధి అందరిలోనూ ఒకే విధంగా సంభవించదు. ఇక నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, కడుపు నిండుగా ఉన్నట్లు అసౌకర్యం కలగవచ్చే కానీ కేవలం అతిగా తినడం మాత్రమే దీనికి ప్రత్యక్ష కారణం కాదు.

ఈ అలవాటుకు తోడు మద్యం సేవించడం, ముందు నుంచీ ఉన్న కొన్ని శారీరక సమస్యలు జతకలిసినప్పుడు ప్రమాదం పెరుగుతుంది. అలాగే రక్తంలో అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, కొన్ని మందుల దుష్ప్రభావాలు, ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సమస్యలు, జన్యుపరమైన కారకాలు కూడా ఈ వ్యాధికి దారితీస్తాయి. గతంలో ప్యాంక్రియాటైటిస్ వచ్చినవారు, పిత్తాశయ రాళ్లు ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి.

చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా?చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా?

లక్షణాలను ఎలా గుర్తించాలి?

కింది సంకేతాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకండి.

పై పొట్టలో నిరంతరంగా తీవ్రమైన నొప్పి వచ్చి, అది వీపు భాగానికి కూడా వ్యాపించడం.

ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పి మరింత పెరగడం.

మందులు తీసుకున్న తర్వాత కూడా అజీర్ణం తగ్గకపోవడం.

తరచుగా వాంతులు, వికారం మరియు జ్వరం రావడం.

కడుపు మెత్తగా మారడం (తాకితే నొప్పిగా ఉండటం).

హార్ట్ బీట్ రేటు వేగంగా పెరగడం.

ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

నివారణ మన చేతుల్లోనే

ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ముందుగా బ్యాలెన్స్డ్ తీసుకోవాలి. క్రమం తప్పకుండా నూనె, కొవ్వు పదార్థాలు అధికంగా తినే అలవాటును మానుకోవాలి. మద్యం పరిమాణాన్ని తగ్గించుకుని, ఒకేసారి ఎక్కువగా తాగే అలవాటుకు స్వస్తి పలకాలి. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ముఖ్యంగా పిత్తాశయ రాళ్లు ఉన్నవారు లేదా గతంలో ప్యాంక్రియాటైటిస్ వచ్చినవారు డాక్టర్ల సలహా మేరకు అవసరమైన పరీక్షలు, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఒకసారి వస్తే భవిష్యత్తులో మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, November 17, 2026, 12:37 [IST]
Desktop Bottom Promotion