నాన్ వెజ్ కి పోటీగా వెజ్ లివర్ ఫ్రై..పప్పుచారు,సాంబార్‌తో నంచుకుంటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఐటమ్ చికెన్,మటన్ లివర్ ఫ్రై . లివర్ ఫ్రైతో చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని చెబుతూ నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. అయితే నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ కోసం అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ను వెజ్ లివర్ ఫ్రై అందిస్తుంది. పప్పు చారు,సాంబారు, మజ్జిగ చారు వంటి వాటితో నంచుకోడానికే కాకుండా అన్నంతో కలుపుకొని తినడానికి కూడా వెజ్ లివర్ ఫ్రై బాగుంటుంది. ఐరన్ ఎక్కువగా ఉండి, రక్తం పట్టడానికి ఉపయోగపడే వెజ్ లివర్ ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

వెజ్ లివర్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు

-టమాటో
-పచ్చిమిర్చి
-ఉప్పు
-కారం
-గరం మసాలా
-ధనియాల పొడి
-తోటకూర
-ఉల్లిపాయ
-వంట సోడా
-శెనగ పిండి
-ఆయిల్
-జీలకర్ర పొడి
-కొత్తిమీర
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-నిమ్మరసం
-మంచినీళ్లు

వెజ్ లివర్ ఫ్రై తయారీ విధానం

-ముందుగా 1 కట్ట తోటకూరును శుభ్రంగా కడిగి కాడాలతో సహా ఓ గిన్నెలో వేసి,ఇందులో నే 2 పచ్చి మిర్చి, అరకప్పు నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించుకోవాలి.

-5-6 నిమిషాలు తక్కువమంట మీద ఉడికించుకున్నాక దాన్ని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారాక దీన్ని మిక్సీ గిన్నెలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

-ఇప్పుడు ఆ తోటకూర మిశ్రమంలోనే ఉప్పు, వంట సోడి, కొద్దిగా గరం మసాలా, అరకప్పు శెనగపిండి వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి.

కన్నడిగుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే..ఒకసారి తింటే మళ్ళీ కావాలంటారు, ఎలా చేసుకోవాలంటే

-తర్వాత ఓ ప్లేట్ లో ఆయిల్ రాసి తోటకూర పిండి మిశ్రమాన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 కప్పుల నీళ్లు పోసి స్టాండ్ పెట్టి దానిమీద తోటకూర పిండి ఉన్న ప్లేట్ ని పెట్టి మూత పెట్టేసి 10-15 నిమిషాలు మీడియం ప్లేమ్ మీద ఉడికించుకోవాలి

-ఉడికిన తర్వాత ఆ ప్లేట్ ను బయటకు తీసి పూర్తిగా చల్లారనిచ్చి చాకుతో నచ్చిన షేపులో ఉడికిన తోటకూర పిండి మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో ఈ ముక్కలను వేసి వీటిలో పచ్చిదనం పోయే దాకా 4-5 నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ వేయించి పక్కనపెట్టుకోవాలి.

-తర్వాత అదే కడాయిలో మరో 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో సన్నగా తరగిన 2 ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాక అందులో 1స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపాక అందులో సన్నగా కట్ చేసిన 2 టమాటో ముక్కలు, 3 పచ్చిమిర్చిల ముక్కలు వేసి మూతపెట్టి వీటిని మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి.

-మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి, రుచికి సరిపడా కారం, పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపాక అందులో పావు కప్పు నీళ్లు పోసి మసాలాలన్నీ మగ్గేదాకా 2 నిమిషాల పాటు వేయించాలి.

-తర్వాత అందులో వేయించిన తోటకూర ముక్కలను, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. మసాలా అంటూ ముక్కలకు పట్టేలా కలిపాక కొద్దిగా నిమ్మరసం పిండుకొని దించేసుకోవడమే. అంతే వెజ్ లివర్ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, April 28, 2025, 8:10 [IST]
Desktop Bottom Promotion