కన్నడిగుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే..ఒకసారి తింటే మళ్ళీ కావాలంటారు, ఎలా చేసుకోవాలంటే

Posted By:

బెంగళూరు లేదా కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పోద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి బిసిబెళ బాత్ చేస్తుంటారు. హోటల్స్ లో అయినా, ఇళ్లల్లో అయినా పొద్దున్నే కన్నడిగులు చలామంది ఈ వంటకాన్ని బ్రేక్ ఫాస్ట్ కోసం చేసుకుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపి ఇది. కర్ణాటక స్పెషల్ అయిన ఈ బిసిబెళ బాత్ ను తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

బిసిబెళ బాత్ తయారీకి కావలసిన పదార్థాలు
-కందిపప్పు
-బియ్యం
-ఉప్పు
-టమాటో
-ఉల్లిపాయ
-క్యాప్సికం
-ధనియాలు
-జీలకర్ర
-మినపప్పు
-దాల్చిన చెక్క
-పచ్చి శెనగపప్పు
-మెంతులు
-లవంగాలు
-యాలకలు
-నెయ్యి
-కరివేపాకు
-ఎండు కొబ్బరి తురుము
-మిరియాలు
-క్యారెట్
-చింతపండు
-బంగాళదుంప
-బీన్స్
-కొత్తిమీర
-పచ్చి బఠాణీ
-జీడిపప్పు
-బెల్లం

బిసిబెళ బాత్ తయారీ విధానం

-ముందుగా ఓ గిన్నెలో ముప్పావు కప్పు బియ్యం, ముప్పావు కప్పు కందిపప్పు వేసి నీళ్లు పోసి 1 గంటసేపు నానబెట్టాలి.

-ఇప్పుడు నానిన పప్పు,బియ్యంని శుభ్రంగా కడిగాక కుక్కర్ లో వేసి అందులో 5-6 కప్పుల నీళ్లు పోసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూతపెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పు, బియ్యం మెత్తగా ఉడకాక దించి పక్కనపెట్టి అందులోని ప్రెజర్ పూర్తిగా పోనివ్వాలి.

-ఇప్పుడు బిసిబెళ బాత్ కి కావల్సిన మసాలా తయారీ కోసం.. స్టవ్ మీద ఓ కడాయి పెట్టి అందులో 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు,1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ మిరియాలు, పావు టీస్పూన్ మెంతులు, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, రెండు యాలకలు వేసి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. కొంచెం వేగాక అందులోనే 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. దించేముందు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తరుము వేసి జస్ట్ ఒకసారి కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత దీనిని మొత్తం మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీ..టేస్ట్ లో తిరుగుండదు అంతే..ఎలా చేసుకోవాలంటే..

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు పలుకులు, కొద్దిగా ఇంగువ కూడా వేసి దోరగా వేయించి ఈ తాళింపులో 1 ఉల్లిపాయ పెద్ద ముక్కలు,కొద్దిగా కరివేపాకు, కొన్ని క్యారెట్ ముక్కలు, పొట్టు తీసి మీడియం సైజులో కట్ చేసిన అర కప్పు బంగాళదుంప ముక్కలు,పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, పావు కప్పు క్యాప్సికం ముక్కలు, 1 టమాటో ముక్కలు, పావు కప్పు పచ్చి బఠాణీలు వేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు,పసుపు వేసి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి. దీనికి 5-10 నిమిషాల సమయం పడుతుంది.

-తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్ పొడిని కూడా వేసి కలపాలి. తర్వాత అందులో 10 నిమిషాలు నానబెట్టిన చింతపండు రసం, 1 టీస్పూన్ బెల్లం పొడి వేసి కలిపి మూతపెట్టి 5-10 నిమిషాలు ఉడికించాలి.

-ఈ ఉడికిన పులుసుని కుక్కర్ లో ఉన్న ఉడికిన బియ్యం,పప్పు మిశ్రమంలోకలిపి ఆ కుక్కర్ ని మళ్లీ స్టవ్ మీద పెట్టి మూతపెట్టేసి 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి అందులో కొత్తిమీర తరుగు చల్లుకుంటే బిసిబెళ బాత్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, April 27, 2025, 13:00 [IST]
Desktop Bottom Promotion