For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ పండుగ విశిష్టత మరియు వత్రం చేయు విధానం

|

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

Significance of Varalakshmi Vratham

ప్రార్థన
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాధ
స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఈ వ్రతం ఎందుకు చేస్తారు?
అష్ట లక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

వ్రత విధి విధానం
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

తోరగ్రంథి పూజ
తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.
ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.
ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.
ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.

వరలక్ష్మి వ్రత కథ
ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం
శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్తదేవ వనితాం
లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః
బ్రహ్మేంద్ర గంగాధరాం|
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం
వందేముకుందప్రియాం||

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

English summary

Significance of Varalakshmi Vratham

Varalakshmi Vratham is the most celebrated Vratham in India during Shravan month. In 2022, Varalakshmi Pooja is on August 5th (Friday). It is observed just before the Shravan PoorNima. Shravan month is named after the Janma Nakshthram (Birth Star) of Lord Vishnu, Shravna Nakshatra. Shravanmasam is the most favorite month of Lord Vishnu. Maha Lakshmi, consort of Lord Vishnu, also worships Lord Vishnu during the month of Sawan.
Desktop Bottom Promotion