కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు!

Posted By:

బెండకాయ అంటే చాలా ఇళ్లలో ఇష్టంగా తినే కూరగాయ. కానీ రోజూ ఒకేలాంటి బెండకాయ కూర, ఇగురు లేదా వేపుడు తింటే ఎవరికైనా విసుగు రావడం సహజం. మీ నోటికి కాస్త రుచిగా, కరకరలాడుతూ ఏదైనా కొత్తగా తినాలనిపిస్తే..క్రిస్పీ బెండకాయ పకోడీ లేదా భుజియా బెస్ట్ ఆప్షన్.

పప్పు అన్నం, రొట్టెల్లోకి సైడ్ డిష్‌ గానే కాకుండా, సాయంత్రం పూట వేడివేడి టీతో పాటు స్నాక్‌ లా కూడా దీన్ని లాగించేయొచ్చు. బెండకాయ జిగురుగా ఉంటుందని తినని పిల్లలు సైతం దీన్ని వదలకుండా తింటారు. ఇంట్లో ఉండే సాధారణ మసాలాలతోనే దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Best Side Dish for Dal Rice Quick and Crispy Bendakaya Bhujia Recipe in Telugu

బెండకాయ భుజియా తయారీకి కావలసిన పదార్థాలు

బెండకాయలు - 500 గ్రాములు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
బియ్యపు పిండి - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఆమ్చూర్ పొడి - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వాము - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే..

బెండకాయ భుజియా తయారీ విధానం

-ఈ రెసిపీ క్రిస్పీగా రావాలంటే బెండకాయలకు తడి అస్సలు ఉండకూడదు. ముందుగా వాటిని కడిగి, పొడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరబెట్టండి. తడి ఉంటే ముక్కలు జిగురుగా మారిపోతాయి.

-బెండకాయల అంచులు కత్తిరించి, పొడవుగా, సన్నని పట్టీలుగా (ముక్కలుగా) చీల్చుకోవాలి. మరీ పొడవుగా ఉంటే మధ్యకు కట్ చేసుకోండి.

-ఒక పెద్ద గిన్నెలో తరిగిన బెండకాయ ముక్కలు వేయండి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, జీలకర్ర, వాము, తగినంత ఉప్పు వేసి చేత్తో ముక్కలకు పట్టేలా బాగా కలపండి. ఈ మిశ్రమంలో చుక్క నీరు కూడా పోయకూడదు.. బెండకాయలో ఉండే సహజమైన తేమతోనే మసాలాలన్నీ ముక్కలకు పట్టుకుంటాయి. ఒకవేళ పొడిగా అనిపిస్తే ఒక 2-3 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది.

-స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి మీడియం మంటపై వేడి చేయండి. నూనె మరీ పొగలు వచ్చేలా కాగకూడదు, అలా అయితే ముక్కలు మాడిపోతాయి. ఇప్పుడు మసాలా పట్టించిన బెండకాయలను విడతలుగా నూనెలో వేయండి. ఒకేసారి వేస్తే ముక్కలు అంటుకుపోతాయి.

-ముక్కలను మధ్యమధ్యలో కలుపుతూ, లేత బంగారు రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించి పక్కకు తీసుకోండి.

-నూనెలోంచి తీసిన వెంటనే, వేడివేడిగా ఉన్నప్పుడే ఈ క్రిస్పీ బెండకాయపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. కారం ఇష్టపడేవారు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

-వేడి వేడి అన్నం, పప్పు లేదా పరాటాలతో ఈ క్రిస్పీ భిండి భుజియాను ఆస్వాదించండి.

[ of 5 - Users]
Story first published: Friday, October 2, 2026, 19:01 [IST]
Desktop Bottom Promotion