రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్.. ఇప్పుడు మీ ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!

Posted By:

వర్షాకాలం వచ్చేసింది. బయట సన్నగా చిరుజల్లులు పడుతూ చల్లటి గాలి వీస్తుంటే, ఇంట్లో కూర్చుని ఏదైనా కమ్మగా, వేడివేడిగా తాగాలనిపిస్తుంటది. ఆ సమయంలో మన శరీరానికి వెచ్చదనాన్నిస్తూ, మనసుకు హాయినిచ్చే ఒక అద్భుతమైన రెసిపీ స్వీట్ కార్న్ సూప్. రెస్టారెంట్‌ కు వెళ్లే పనిలేకుండా, చాలా సింపుల్‌గా, అంతే టేస్టీగా దీన్ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

How to Make Restaurant Style Sweet Corn Soup at Home Recipe in Telugu

స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన స్వీట్ కార్న్ ప్యూరీ - 1 కప్పు
ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు - పావు కప్పు
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4
ఉల్లికాడలు లేదా స్ప్రింగ్ ఆనియన్స్ - 2
వెన్న- 1 టేబుల్ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
మ్యాగీ వెజ్ క్యూబ్- 1
ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా
క్యారెట్ - సగం
ఫ్రెంచ్ బీన్స్ - 10 నుండి 12
నీళ్లు - 1 కప్పు
కార్న్ స్టార్చ్ (కార్న్ ఫ్లోర్) - 2 టీస్పూన్లు
నీళ్లు - పావు కప్పు
వెనిగర్ - అర టీస్పూన్
సోయా సాస్, చిల్లీ ఆయిల్ - గార్నిష్ కోసం

స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం

-ముందుగా స్వీట్ కార్న్ కండెను తీసుకుని రెండు భాగాలుగా విరిచి, ప్రెషర్ కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.

-ఉడికిన కార్న్ నుండి గింజలను వలిచి పెట్టుకోండి. అందులో నుండి 1 కప్పు గింజలను తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తని ప్యూరీలా రుబ్బుకోండి. మరో పావు కప్పు ఉడికించిన గింజలను పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక సాస్ పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టుకుని, అందులో నూనె మరియు వెన్న లేదా బటర్ వేసి వేడి చేయండి.

-వెన్న కరిగాక.. సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన అల్లం వేసి మంటను హై ఫ్లేమ్‌ లో ఉంచి ఒక్క నిమిషం పాటు వేయించండి. ఇది సూప్‌ కి మంచి ఘుమఘుమలాడే సువాసనను ఇస్తుంది.

-ఇప్పుడు అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న స్వీట్ కార్న్ ప్యూరీతో పాటు, వెజ్ స్టాక్ క్యూబ్‌ ను వేసి బాగా కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలను అందులో వేయండి.

-సూప్ మరీ చిక్కగా కాకుండా, కరెక్ట్ కన్సిస్టెన్సీ కోసం ఒక కప్పు నీళ్లను పోయండి. అందులో మీ రుచికి సరిపడా ఉప్పు, వైట్ పెప్పర్ లేదా మిరియాల పొడి వేసి బాగా కలపండి. మంటను సిమ్‌ లో పెట్టి, గిన్నెపై మూత ఉంచి 5-6 నిమిషాల పాటు కూరగాయలు మెత్తబడేలా ఉడికించండి.

-ఆ తర్వాత పావు కప్పు నీళ్లలో 2 టీస్పూన్ల కార్న్ స్టార్చ్ (కార్న్ ఫ్లోర్) వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని సూప్‌ లో పోయండి. దాంతో పాటే మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు, అర టీస్పూన్ వెనిగర్, కొద్దిగా నల్ల మిరియాల పొడి, గుప్పెడు ఉల్లికాడల ఆకులు వేసి బాగా కలపండి.

-కార్న్ స్టార్చ్ ఉడికి, సూప్ కాస్త చిక్కబడే వరకు మరో 3-4 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో కమ్మని వేడి వేడి స్వీట్ కార్న్ సూప్ రెడీ. ఈ సూప్‌ ను బౌల్స్‌ లోకి తీసుకుని, పైన కొద్దిగా సోయా సాస్, చిల్లీ ఆయిల్, మరికొన్ని ఉల్లికాడలు చల్లి గార్నిష్ చేయండి. వర్షాకాలపు చలిలో మీ కుటుంబ సభ్యులకు దీనిని సర్వ్ చేసి చూడండి, అందరూ దీని రుచికి కచ్చితంగా ఫిదా అయిపోతారు.

[ of 5 - Users]
Story first published: Thursday, July 9, 2026, 15:14 [IST]
Desktop Bottom Promotion