ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు!

Posted By:

మన తెలుగువారి భోజనం ఊరగాయ లేకుండా అస్సలు పూర్తి కాదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, కమ్మటి పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. అయితే ఎప్పుడూ ఆవకాయ, టమాటా, నిమ్మకాయ పచ్చళ్లే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగకాయ ఊరగాయ ఓ సారి ట్రై చేయండి.

మునగకాయలలో ఉండే పోషకాలు ఈ పచ్చడి ద్వారా మనకు అందుతాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. నోరూరించే మునగకాయ ఊరగాయను పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Munagakaya Pachadi Recipe in Telugu How to Make Drumstick Pickle Not Spoil Whole Year

కావలసిన పదార్థాలు

లేత మునగకాయలు - 500 గ్రాములు
ఆవ నూనె- 1 కప్పు (సుమారు 200 మి.లీ)
ఆవాలు- 3 టీస్పూన్లు
సోంపు - 2 టీస్పూన్లు
మెంతుల పొడి - 1 టీస్పూన్
కలోంజి (నల్ల జీలకర్ర) - 1 టీస్పూన్
పసుపు - ఒకటిన్నర టీస్పూన్లు
కారం పొడి (పచ్చళ్ల కారం) - 2 టీస్పూన్లు
ఆమ్ చూర్ పౌడర్ లేదా వెనిగర్ - 3 టీస్పూన్లు
ఇంగువ - అర టీస్పూన్
ఉప్పు - రెండున్నర టీస్పూన్లు

బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే!

తయారీ విధానం

-ముందుగా తాజాగా ఉన్న మునగకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటిని 1.5 నుండి 2 అంగుళాల పొడవున్న ముక్కలుగా కట్ చేసుకుని, పైన ఉన్న గట్టి తొక్కను (పీచును) తేలికగా తీసేయాలి.

-ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకుని మరిగించాలి. ఆ గిన్నెపై ఒక చిల్లుల జల్లెడ ఉంచి, అందులో మునగకాయ ముక్కలను వేయండి. మూతపెట్టి కేవలం 4-5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ముక్క మరీ మెత్తబడకూడదు, కొద్దిగా మృదువుగా మారితే చాలు.

-ఆవిరి మీద ఉడికిన మునగకాయ ముక్కలను ఒక పొడి కాటన్ వస్త్రంపై పరచి, 2-3 గంటల పాటు ఎండలో లేదా ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ముక్కల్లో తడి అస్సలు ఉండకూడదు.

-ఒక మందపాటి కడాయిలో ఆవ నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె నుండి పొగలు రావడం మొదలవ్వగానే స్టవ్ ఆపేయండి. ఇలా చేస్తే ఆవనూనె పచ్చి వాసన పోతుంది. నూనె గోరువెచ్చగా అయ్యాక అందులో కొద్దిగా ఇంగువ వేసి కలపండి.

-ఇప్పుడు ఒక పెద్ద పొడి గిన్నె తీసుకుని అందులో ఆరబెట్టిన మునగకాయ ముక్కలను వేయండి. అందులోనే దంచిన ఆవాలు, సోంపు, మెంతి పొడి, కలోంజి, పసుపు, కారం, ఆమ్ చూర్ పౌడర్, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి.

-చివరగా, సిద్ధం చేసుకున్న గోరువెచ్చని నూనెను ఈ మునగకాయల మిశ్రమంపై పోసి గరిటెతో అడుగునుండి నెమ్మదిగా కలపండి. ప్రతి ముక్కకు మసాలా, నూనె బాగా పట్టాలి.

-అంతే ఎంతో రుచికరమైన మునగకాయ ఊరగాయ సిద్ధం. దీన్ని ఒక పొడి గాజు సీసాలో భద్రపరచుకుని, ఒక వారం రోజుల పాటు రోజూ కాసేపు ఎండలో ఉంచితే ముక్క ఊరి మసాలాలన్నీ పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, October 8, 2026, 17:27 [IST]
Desktop Bottom Promotion