కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్!

Posted By:

సాయంత్రం వేళ చల్లని గాలికి వేడివేడిగా, కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తోందా? రొటీన్ స్నాక్స్‌ కి భిన్నంగా కాస్త స్పైసీగా, అదిరిపోయే రుచితో ఏదైనా ట్రై చేయాలనుకుంటే చెట్టినాడ్ చికెన్ పాప్‌ కార్న్ మీకు బెస్ట్ ఛాయిస్.

మామూలు చికెన్ పాప్‌ కార్న్ మనం ఎప్పుడూ తినేదే.. కానీ దక్షిణ భారతానికే తలమానికంగా నిలిచే చెట్టినాడ్ మసాలాల ఘుమఘుమలు, కరకరలాడే చికెన్ ముక్కలు కలిస్తే ఆ రుచే వేరు. చెట్టినాడ్ స్టైల్ చికెన్ పాప్‌ కార్న్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spice Up Your Evening Quick Crispy Chettinad Chicken Popcorn Recipe in Telugu

చెట్టినాడ్ స్టైల్ చికెన్ పాప్ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బోన్‌ లెస్ చికెన్ - 300 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చెట్టినాడ్ మసాలా పొడి (తాజాగా వేయించి పొడి చేసినది)

చెట్టినాడ్ మసాలా తయారీకి
ఎండుమిర్చి - 4-5
ధనియాలు - ఒకటిన్నర టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 3
అనాస పువ్వు (స్టార్ అనీస్) - సగం
జాపత్రి - 1 చిన్న ముక్క
జాజికాయ - పావు వంతు

కోటింగ్ కోసం
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
గుడ్డు - 1
కరివేపాకు - సన్నగా తరిగినది కొద్దిగా
నీళ్లు - తగినన్ని
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!

చెట్టినాడ్ స్టైల్ చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం

-ముందుగా అసలైన రుచినిచ్చే చెట్టినాడ్ మసాలాను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఎండుమిర్చి, ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ వేసి సన్నని మంటపై దోరగా వేయించండి. మసాలా దినుసుల నుంచి కమ్మటి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బోన్‌ లెస్ చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, తగినంత ఉప్పు, మనం తాజాగా దంచి పెట్టుకున్న చెట్టినాడ్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి.

-అరగంట తర్వాత చికెన్‌ ముక్కలలో బియ్యం పిండి, కార్న్‌ ఫ్లోర్, ఒక గుడ్డు, కరివేపాకు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపండి. గుడ్డు వేయడం వల్ల చికెన్ మరింత కరకరలాడుతూ, మంచి రంగులో వస్తుంది. పిండి మరీ పొడిగా అనిపిస్తే ఒక చెంచా నీళ్లు చల్లుకోవచ్చు.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక, మంటను మీడియంలో పెట్టి మసాలా పట్టించిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయండి. ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకుంటూ, మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. కరకరలాడే శబ్దం వస్తూ మంచి రంగులోకి రాగానే వాటిని తీసి ఆయిల్ పీల్చేసే టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి.

-అంతే ఘుమఘుమలాడే చెట్టినాడ్ చికెన్ పాప్‌ కార్న్ రెడీ. పైనుంచి కొద్దిగా వేయించిన కరివేపాకు చల్లి, టొమాటో కెచప్ లేదా మయోనైస్‌తో వేడివేడిగా ఆస్వాదించండి.

[ of 5 - Users]
Story first published: Tuesday, August 18, 2026, 6:29 [IST]
Desktop Bottom Promotion