కొబ్బరి,టమాటా పచ్చడిని మర్చిపోండి..చిటికెలో వెల్లుల్లి పెరుగు పచ్చడి..ఇడ్లీ,దోశ, చపాతీ దేనితో తిన్నా అమోఘం

Posted By:

పొద్దున్నే టిఫిన్ లోకి ఎప్పుడూ చేసే కొబ్బరి చట్నీ, టమాటా పచ్చడి తిని విసుగొచ్చిందా? ఏదైనా కొత్తగా, కాస్త భిన్నంగా, కానీ చిటికెలో అయిపోయే సైడ్ డిష్ కోసం చూస్తున్నారా?అయితే మీ వంటింట్లోని వెల్లుల్లి, పెరుగుతో ఓ కొత్త రెసిపి ట్రై చేయండి. కేవలం పది నిమిషాల్లో తయారయ్యే ఈ వెల్లుల్లి పెరుగు పచ్చడి మీ టిఫిన్ సమయాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది. దీని రుచి ఒక్కసారి చూశారంటే, మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరం.

ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, బీపీ సమస్యలతో బాధపడేవారు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పచ్చడి ఇడ్లీ, దోసలతోనే కాదు వేడివేడి చపాతీలు, పుల్కాలతో తిన్నా అమోఘంగా ఉంటుంది. నోరూరించే వెల్లుల్లి పెరుగు పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Tired of the usual Chutneys Try this 10 Minute Vellulli Perugu Pachadi

వెల్లుల్లి పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి రెబ్బలు - ఒక గుప్పెడు
-గడ్డ పెరుగు - అర కప్పు
-నూనె - 2 టీస్పూన్లు
-ఆవాలు - అర టీస్పూన్
-మినపప్పు - అర టీస్పూన్
-ధనియాల పొడి - 1 టీస్పూన్
-కారం - ఒకటిన్నర టీస్పూన్లు
-ఉప్పు -సరిపడా
-నీళ్లు - అర కప్పు

తయారీ విధానం

-వెల్లుల్లి పెరుగు పచ్చడి తయారీకోసం ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను మిక్సీ గిన్నెలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక గిన్నెలో చిక్కని,పుల్లగా లేని పెరుగును తీసుకుని ఉండలు లేకుండా నునుపుగా అయ్యేవరకు బాగా గిలకొట్టాలి.

-తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. మినపప్పు దోరగా వేగిన తర్వాత, రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేయాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు చిన్న మంట మీద రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.

-ఇప్పుడు ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి, మసాలాలు మాడిపోకుండా నూనెలో బాగా కలిసేలా ఒక నిమిషం పాటు వేయించాలి.

-తర్వాత పొయ్యి మంటను పూర్తిగా తగ్గించి గిలకొట్టిన పెరుగును వేసి వెంటనే కలపాలి. ఆ తర్వాత అర కప్పు నీళ్లు పోసి అంతా కలిసేలా తిప్పాలి. బాండీపై మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు సుమారు 3-4 నిమిషాల పాటు ఉడికించి, పొయ్యి ఆపాలి. అంతే రుచికరమైన, ఘుమఘుమలాడే వెల్లుల్లి పెరుగు పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 27, 2025, 8:10 [IST]
Desktop Bottom Promotion