గల్లీలో పుట్టి.. నేడు రూ.75 వేల కోట్ల సామ్రాజ్యంగా..ఇది చిన్న యవ్వారం కాదుగా!

ఉదయం లేవగానే వేడి వేడి ఛాయ్‌లో పార్లే జి బిస్కెట్ ముంచుకుని తింటుంటే వచ్చే ఆ మజానే వేరు. తరతరాలుగా భారతీయులకు ఈ 5 రూపాయల పార్లే జి ప్యాకెట్ కేవలం ఒక చిరుతిండి మాత్రమే కాదు.. ఎన్నో మధురమైన బాల్యపు జ్ఞాపకాలకు నిలువెత్తు రూపం. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ఈ ప్రసిద్ధ బిస్కెట్ వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది.

Not Just a Biscuit It s an Emotion The Inspiring Success Story of Parle-G

ఒక చిన్న కుటుంబ వ్యాపారంగా ప్రారంభమై, నేడు భారతదేశంలోనే అత్యంత విలువైన FMCG (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) బ్రాండ్‌ లలో ఒకటిగా ఎదిగిన పార్లే ప్రొడక్ట్స్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ముంబైలోని విలే పార్లేలో దాదాపు ఒక శతాబ్దం క్రితం కేవలం 12 మంది కుటుంబ సభ్యులతో మొదలైన ఈ సంస్థ, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ఏకంగా 1 బిలియన్ డాలర్లు (సుమారు 9,530 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సుదీర్ఘ వ్యాపార ప్రయాణంలో ఈ ఐపీఓ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

స్వాతంత్ర్యానికి పూర్వమే పునాది
1929లో మోహన్‌లాల్ దయాల్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. మొదట్లో ముంబైలో హౌస్ ఆఫ్ పార్లే పేరుతో స్వీట్లు తయారు చేసేవారు. సరిగ్గా పదేళ్ల తర్వాత,1939లో ఈ సంస్థ బిస్కెట్ల తయారీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మార్కెట్లో దొరికే బిస్కెట్లన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. వాటి ధర చాలా ఎక్కువగా ఉండటంతో సామాన్యులు కొనే పరిస్థితి ఉండేది కాదు.

అప్పుడే మోహన్‌ లాల్ దయాల్ భారతీయ వినియోగదారులకు సరసమైన ధరలో, నాణ్యమైన ప్రత్యామ్నాయంగా పార్లే గ్లూకోను పరిచయం చేశారు. ఈ బిస్కెట్లు అతి తక్కువ కాలంలోనే విశేష ప్రజాదరణ పొందాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికులకు ఇవి ప్రధాన ఆహారంగా కూడా ఉపయోగపడ్డాయి.

సంక్షోభాలను ఎదుర్కొని..

1947లో దేశ విభజన సమయంలో సంస్థ ఒక పెద్ద సవాలును ఎదుర్కొంది. బిస్కెట్ల తయారీలో ముఖ్యమైన ముడిపదార్థమైన గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడటంతో, ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేయాల్సి వచ్చింది. అయినా ఆ కుటుంబం వెనక్కి తగ్గలేదు. పరిస్థితి చక్కబడే వరకు, గోధుమలకు బదులుగా బార్లీని ఉపయోగించి బిస్కెట్లను తయారు చేస్తూ వ్యాపారాన్ని నిలబెట్టుకున్నారు.

Not Just a Biscuit It s an Emotion The Inspiring Success Story of Parle-G

పేరు మార్పు - బ్రాండ్ సృష్టి

మొదట్లో ఈ బిస్కెట్‌ ను పార్లే గ్లూకో అని పిలిచేవారు. కానీ మార్కెట్లోకి చాలా కంపెనీలు గ్లూకోజ్ బిస్కెట్లను తీసుకురావడంతో వినియోగదారుల్లో గందరగోళం మొదలైంది. దీంతో 1982లో దీని పేరును కుదించి పార్లే-జి (Parle-G)గా మార్చారు. ఇక్కడ జి అంటే గ్లూకోజ్ అయినప్పటికీ.. కంపెనీ తన వినూత్న మార్కెటింగ్ వ్యూహంతో జి ఫర్ జీనియస్(G for Genius) అనే క్యాప్షన్‌ తో ప్రచారం చేసి పిల్లలకు దీనిని ఎంతో దగ్గర చేసింది.

నేటి వ్యాపార సామ్రాజ్యం

నాడు ఒక చిన్న గదిలో మొదలైన పార్లే ప్రొడక్ట్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా 21కి పైగా దేశాలకు విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా 125కు పైగా ఫ్యాక్టరీలతో కార్యకలాపాలు సాగిస్తోంది. పార్లే-జి మాత్రమే కాకుండా మొనాకో, క్రాక్‌ జాక్, హైడ్ అండ్ సీక్ వంటి బిస్కెట్లు.. మెలోడీ, కిస్మి, మ్యాంగో బైట్ వంటి చాక్లెట్లు, కేకులు, రస్క్‌ లతో తమ పోర్ట్‌ ఫోలియోను విస్తరించింది.

ఆర్థికంగా కూడా కంపెనీ అగ్రస్థానంలో ఉంది. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 జాబితా ప్రకారం ఈ కంపెనీ విలువ ఏకంగా రూ. 75,420 కోట్లుగా ఉంది. తద్వారా దేశంలో ఏడవ అత్యంత విలువైన కంపెనీగా గుర్తింపు పొందింది.

Story first published: Sunday, July 12, 2026, 21:38 [IST]
Desktop Bottom Promotion