40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి!

పురుషులకు 40 ఏళ్లు దాటగానే వారి భుజాలపై బాధ్యతల పర్వతమే ఉంటుంది. పిల్లల ఉన్నత చదువులు, ఆఫీసులో వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఇంటి ఈఎంఐలు.. ఇలా ప్రతి అడుగులోనూ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే క్రమంలో వారు తమ కుటుంబం పాలిట సూపర్‌ మెన్ లా మారిపోతారు. ఈ క్రమంలో చాలామంది సొంత ఆరోగ్యాన్ని మాత్రం గాలికొదిలేస్తారు. నాకేం రోగం? నేను సంపూర్ణ ఆరోగ్యంతో, చాలా ఫిట్‌ గానే ఉన్నాను అనే అతివిశ్వాసంతో, ఆరోగ్యం పట్ల చూపే నిర్లక్ష్యం భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది.

Turning 40 Here Are the Must-Do Health Checkups for Every Man

40 ఏళ్లు దాటగానే మన శరీరంలో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు లాంటివి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే నిశ్శబ్దంగా పాతుకుపోవడం ప్రారంభిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి.. మీరే అనారోగ్యానికి గురై మంచాన పడితే, మీపై ఆధారపడిన మీ కుటుంబ పరిస్థితి ఏమిటి? అందుకే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ ప్రియమైన వారి కోసం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను ముందుగానే పసిగట్టే హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా చేయించుకోవడం ప్రారంభించాలి. ముందస్తు రోగ నిర్ధారణ వల్ల ట్రీట్మెంట్ ఎంతో సులభం అవుతుంది. 40 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి పురుషుడు తప్పక చేయించుకోవాల్సిన ఆ ముఖ్యమైన పరీక్షలేమిటో ఇక్కడ చూడండి.

గుండెను పదిలంగా ఉంచే బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు

వయసు పెరుగుతున్న కొద్దీ మన రక్తనాళాలు గట్టిపడటం ప్రారంభమవుతాయి. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. అధిక రక్తపోటు (బీపీ)ని వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పైకి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకుండానే లోపల గుండె, కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి 40 దాటాక తరచుగా బీపీ చెక్ చేసుకోవాలి. అలాగే శరీరంలోని మంచి, చెడు కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ అనే సులభమైన రక్తపరీక్ష చేయించుకోవడం ముఖ్యం. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

షుగర్ లెవల్స్ పై ఓ కన్నేసి ఉంచండి

గంటల తరబడి కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేని నిశ్చల జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. 40 ఏళ్ల తర్వాత మన శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే జీవక్రియల వేగం తగ్గుతుంది. అందుకే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షతో పాటు, HbA1c టెస్ట్ ను తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ HbA1c టెస్ట్ అత్యుత్తమమైనది. ఎందుకంటే ఇది కేవలం ఒక్క రోజుది కాకుండా, గత మూడు నెలల్లో మీ రక్తంలో యావరేజ్ షుగర్ లెవల్స్ కచ్చితంగా చెబుతుంది. కుటుంబంలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉంటే ఈ పరీక్ష ప్రతి ఏడాదీ చేయించుకోవాలి.

Turning 40 Here Are the Must-Do Health Checkups for Every Man

ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యం.. క్యాన్సర్‌ కు చెక్

పురుషులలో మాత్రమే ఉండే ఒక చిన్న గ్రంథి ప్రోస్టేట్. 40 లేదా 50 ఏళ్ల వయస్సు తర్వాత దీని పరిమాణం క్రమంగా పెరుగుతుంది. సాధారణంగా ఇది ప్రమాదం కాకపోయినా, కొన్నిసార్లు ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారితీసే ముప్పు ఉంది. మూత్ర విసర్జనలో ఇబ్బంది, రాత్రిపూట పదే పదే మూత్రానికి లేవాల్సి రావడం, లేదా మూత్ర ప్రవాహం బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. వ్యాధిని ముందే గుర్తించడానికి PSA(ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) అనే సులభమైన రక్తపరీక్ష చేస్తారు.

ఎముకల పటుత్వం, అంతర్గత అవయవాల సంరక్షణ

వయసు పైబడే కొద్దీ ఎముకలు గుల్లబారిపోవడం అనేది కేవలం మహిళలకే పరిమితమైన సమస్య కాదు. 40 ఏళ్ల తర్వాత పురుషుల్లో కూడా ఎముకలు బలహీనపడి కీళ్ల నొప్పులు, ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే విటమిన్-డి, కాల్షియం లెవల్స్ ను పరీక్షించుకోవాలి (విటమిన్-డి లేకుండా మన శరీరం కాల్షియంను గ్రహించలేదు). అదనంగా మన శరీరంలోని ముఖ్య అవయవాలైన లివర్, కిడ్నీల పనితీరు కోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC), LFT (కాలేయ పరీక్ష), KFT (మూత్రపిండాల పరీక్ష) చేయించుకోవాలి. సి.బి.సి ద్వారా రక్తహీనత, ఇన్ఫెక్షన్లను గుర్తించవచ్చు. ముఖ్యంగా వేయించిన ఆహారాలు ఎక్కువగా తినేవారు, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారికి ఈ పరీక్షలు ఎంతో కీలకం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, July 12, 2026, 16:30 [IST]
Desktop Bottom Promotion