చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి!

Posted By:

చల్లని శీతాకాలపు సాయంత్రాల్లో వేడివేడిగా, మనసుకు హాయినిచ్చేలా ఏదైనా తాగాలనిపిస్తోందా? అయితే మహారాష్ట్ర వంటకాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన టమాటా సూప్ (టమాటా సార్) బెస్ట్ ఆప్షన్. తాజా టమాటాలు, కమ్మని కొబ్బరి పాలతో తయారయ్యే ఈ సూప్ రుచిలో అమోఘంగా ఉండటమే కాకుండా, తయారు చేయడం కూడా చాలా సులభం.

పులుపు, తీపి, కొబ్బరి కమ్మదనం కలగలిసిన ఈ వంటకం ప్రతి గుటకలోనూ ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ఈ చలిలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఈ రుచికరమైన సూప్‌ ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Authentic Maharashtrian Tomato Saar Recipe in Telugu Warm Comforting Winter Soup

కావలసిన పదార్థాలు

-ఐదు పండిన టమాటాలు
-సగం బీట్‌ రూట్
-సగం పచ్చి కొబ్బరికాయ
-అంగుళం అల్లం ముక్క
-రెండు పచ్చిమిర్చి
-ఐదు కప్పుల నీరు
-రుచికి సరిపడా ఉప్పు
-అర కప్పు చక్కెర
-ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి
-ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
-అర టీస్పూన్ మినపప్పు
-అర టీస్పూన్ జీలకర్ర
-ఐదు కరివేపాకు ఆకులు
-గుప్పెడు కొత్తిమీర
-అవసరమైనంత నీరు

తయారీ విధానం

-ముందుగా టమాటాలపై క్రాస్ గుర్తు పెట్టి, వాటిని బీట్‌ రూట్‌ తో పాటు 5 నుండి 6 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత వాటిని చల్లటి నీటిలో ముంచి, సులభంగా తొక్క తీసేయండి. ఇప్పుడు ఉడికిన టమాటాలు, బీట్‌ రూట్‌ ను గ్రైండర్‌ లో వేసి మెత్తగా రుబ్బుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టి ఒక పెద్ద గిన్నెలో పోసుకోండి.

-మిక్సీ జార్‌ లో తురిమిన పచ్చి కొబ్బరి, అల్లం ముక్క, పచ్చిమిర్చి, తగినంత నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన పల్చటి నూలు గుడ్డను ఉపయోగించి, ఈ కొబ్బరి మిశ్రమాన్ని బాగా పిండి చిక్కటి పాలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మీ తాజా కొబ్బరి పాలు రెడీ అవుతాయి.

-ఇప్పుడు ముందుగా వడకట్టిన టమాటా ప్యూరీలో ఈ కొబ్బరి పాలను కలిపి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమం ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, చక్కెర వేసి కలపండి. అలాగే బియ్యప్పిండిని కొద్దిగా నీటిలో ఉండలు లేకుండా కలిపి ఆ ద్రావణాన్ని కూడా సూప్‌ లో పోసి బాగా కలుపుకోండి. దీనివల్ల సూప్‌ కు చక్కటి చిక్కదనం వస్తుంది.

-మిశ్రమం మరగడం ప్రారంభమైన తర్వాత మంటను తగ్గించి, సన్నని సెగపై కాసేపు ఉడికించండి.

-చివరగా సూప్‌ కు కమ్మని రుచినిచ్చే తాలింపు కోసం.. ఒక చిన్న తాలింపు గరిటెలో నెయ్యి వేడి చేసి, మినపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక, ఈ తాలింపును మరుగుతున్న సూప్‌ లో వేసి బాగా కలపండి.

-అంతే చివరగా తాజా కొత్తిమీర ఆకులను పైన చల్లితే ఘుమఘుమలాడే వేడివేడి మహారాష్ట్ర టమాటా సూప్ సర్వ్ చేయడానికి రెడీ. దీనిని సూప్‌ లా నేరుగా తాగవచ్చు లేదా వేడివేడి అన్నంలోకి కూడా వడ్డించుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 24, 2026, 21:10 [IST]
Desktop Bottom Promotion