మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా?

మన శరీరంలో ప్రవహించే రక్తం చూడటానికి ఎర్రగా ఒకేలా ఉన్నా, అందులో వేర్వేరు రకాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజెన్‌ ల ఆధారంగా A, B, AB, O అనే నాలుగు ప్రధాన వర్గాలు, Rh కారకంతో పాజిటివ్ (+), నెగటివ్ (-) రకాలు ఏర్పడతాయి. కేవలం రక్తదానానికి మాత్రమే కాదు, మన ఆరోగ్య భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా ఇవి కీలకం. మీ బ్లడ్ గ్రూప్‌ కు, కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫ్రాంటియర్స్ జర్నల్‌ లో కొద్ది నెలల క్రితం ప్రచురితమైన ఒక అధ్యయనం.. రక్త వర్గాలకు, కాలేయ వ్యాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టింది. ABO బ్లడ్ గ్రూప్స్, ఆటోఇమ్యూన్ లివర్ డిసీజ్ (AILD)కి మధ్య సంబంధాన్ని పరిశోధించడానికి 114 మంది రోగులను పరీక్షించారు.

Blood Type Liver Health Why Type A Faces Higher Autoimmune Liver Disease Risk

వీరిలో 44 మందికి ఆటోఇమ్యూన్ హెపటైటిస్ (AIH), 70 మందికి ప్రైమరీ బిలియరీ కోలాంజైటిస్ (PBC) ఉన్నట్లు నిర్ధారణ అయింది. నియంత్రణ సమూహంతో పోలిస్తే, AILD, PBC బాధితుల్లో A బ్లడ్ గ్రూప్ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మరోవైపు లివర్ డ్యామేజీకి దారితీసే PBC ముప్పు B గ్రూప్ వారికి తక్కువని గుర్తించారు. అయితే O, AB బ్లడ్ గ్రూప్స్ లో చెప్పుకోదగ్గ తేడా లేదు.

ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధి (AILD) అంటే ఏమిటి?

మందు తాగడం లేదా లైఫ్ స్టైయిల్ కారణాల వల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ కంటే ఇది పూర్తిగా భిన్నమైనది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పి, పొరపాటున సొంత కాలేయ కణాలపైనే దాడి చేయడం వల్ల ఈ దీర్ఘకాలిక సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా PBC లో రోగనిరోధక శక్తి పైత్యరస నాళాలను దెబ్బతీసి, పైత్యరసం నిలిచిపోయేలా చేస్తుంది. దీనివల్ల లివర్ పై మచ్చలు ఏర్పడి, చివరికి సిర్రోసిస్ లేదా లివర్ డ్యామేజ్ కి దారితీసే ప్రమాదం ఉంది.

వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే!వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే!

జాగ్రత్తపడాల్సిన లక్షణాలు ఇవే

ఈ వ్యాధి లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. కొందరిలో ప్రారంభంలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు, మరికొందరిలో అకస్మాత్తుగా బయటపడవచ్చు. తీవ్రమైన అలసట, కడుపులో అసౌకర్యం, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, కాలేయం వాపు, చర్మంపై సాలీడు గూడులాంటి క్రమరహిత రక్తనాళాలు, చర్మం దురద, కీళ్ల నొప్పి, ఆడవాళ్లకి పీరియడ్స్ ఆగిపోవడం వంటివి దీని ప్రధాన సంకేతాలు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, November 24, 2026, 14:10 [IST]
Desktop Bottom Promotion