మీ టిఫిన్‌ ను మరో లెవెల్‌ కు తీసుకెళ్లే కర్ణాటక ఫేమస్ తుమకూరు చట్నీ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

పొద్దున్నే మన ఇళ్లలో వినిపించే ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏంటి? దానికి సమాధానంగా వేడివేడి ఇడ్లీలో, కరకరలాడే దోసెలో సిద్ధమవుతాయి. కానీ అసలైన సవాలు వాటితో పాటు ఏ చట్నీ చేయాలో నిర్ణయించుకోవడమే. రోజూ అదే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ తిని విసుగెత్తిపోయారా?

అయితే కర్ణాటక ఫేమస్ తుమకూరు చట్నీ ట్రై చేయాల్సిందే. చూడటానికి పచ్చని రంగులో మెరిసిపోతూ, పుదీనా చట్నీలా అనిపించినా దీని రుచి మాత్రం మాటల్లో వర్ణించలేనిది. ఒక్కసారి మీరు దీనిని రుచి చూశారంటే, మీ ఇంట్లో ఇది కచ్చితంగా ఫేవరెట్ చట్నీల జాబితాలో చేరిపోతుంది. తుమకూరు చట్నీ మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె - 1 టీస్పూన్
మినప్పప్పు - 3 టేబుల్ స్పూన్లు
సాంబార్ ఉల్లిపాయలు- 15
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - 1 చిన్న ముక్క
ఎండుమిర్చి - 1
పచ్చిమిర్చి - 3
పుదీనా ఆకులు - ఒక గుప్పెడు
కొత్తిమీర - ఒక గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము - అర చిప్ప
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - రుబ్బుకోవడానికి సరిపడా
తాళింపు కోసం:
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేసి వేడిచేయండి. నూనె కాస్త వేడెక్కాక అందులో మినపప్పు వేసి చిన్న మంట మీద బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకోండి. తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే పాన్‌ లో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించాలి.

-తర్వాత అందులో శుభ్రంగా కడిగిన పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి, ఆకులు వాడిపోయే వరకు ఒక్క నిమిషం పాటు వేయించండి.

-చివరగా పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి, ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో చల్లారిన మిశ్రమం, ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

-రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-ఇక తాళింపు కోసం ఒక చిన్న పాన్‌ లో నూనె వేడి చేసి, ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేసి ఆ ఘుమఘుమలాడే తాళింపును చట్నీపై వేసి కలపండి. అంతే నోరూరించే, రుచిలో అమోఘమైన కర్ణాటక ప్రసిద్ధ తుమకూరు చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 11, 2025, 12:00 [IST]
Desktop Bottom Promotion