ముల్లంగి ఆకులతో ఇలా పకోడీ చేసి చూడండి..లొట్టలేసుకుంటూ తింటారు!

Posted By:

చలికాలం రాగానే మార్కెట్లో తాజా ముల్లంగి విరివిగా లభిస్తుంది. మనం సాధారణంగా ముల్లంగిని సలాడ్లు, పరాటాలు లేదా కూరల్లో వాడుకుని, వాటి ఆకులను మాత్రం పారేస్తుంటాం. కానీ ఆ ముల్లంగి ఆకులతో నోరూరించే అద్భుతమైన వంటకాలు చేయవచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా చలికాలపు సాయంత్రం వేళ, వేడివేడి టీతో పాటు కారంగా, కరకరలాడుతూ ఉండే చిరుతిండి తినాలనిపిస్తే ముల్లంగి ఆకు పకోడీ అద్భుతంగా ఉంటుంది.

ఎప్పుడూ తినే సాధారణ పకోడీకి భిన్నంగా ఇవి సరికొత్త రుచిని అందిస్తాయి. తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే వీటిని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునే ముల్లంగి ఆకు పకోడీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Crispy Radish Leaf Pakora Recipe in Telugu Easy Health Winter Snack

కావాల్సిన పదార్థాలు

-1 కప్పు సన్నగా తరిగిన ముల్లంగి ఆకులు
-1 కప్పు శనగపిండి
-2 టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి
-1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
-1-2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు
-1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
-అర టీస్పూన్ ఎర్ర కారం పొడి
-అర టీస్పూన్ పసుపు
-అర టీస్పూన్ ధనియాల పొడి
-అర టీస్పూన్ వాము
-రుచికి తగినంత ఉప్పు
-అవసరమైనంత నీరు
-వేయించడానికి నూనె

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి

ముల్లంగి ఆకు పకోడీ తయారీ విధానం

-ముందుగా ముల్లంగి ఆకులను నీటితో శుభ్రంగా కడిగండి. ఆకులలో అదనపు నీరు లేకుండా వడకట్టి వాటిని వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ధనియాల పొడి, వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.

-ఆ తర్వాత ఈ పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగి పెట్టుకున్న ముల్లంగి ఆకులను వేసి అన్నింటినీ చక్కగా కలపండి. వాము, మసాలాల కలయికతో పిండికి చక్కని సువాసన వస్తుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ చిక్కటి పిండి ముద్దలా కలపండి. పిండి మరీ పల్చగా కాకుండా చూసుకోండి

-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాక, ఒక చెంచాతో లేదా చేతులతో పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న భాగాలుగా నూనెలో వేయండి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కడాయిలో సరిపడా వేసుకుంటే పకోడీలు సమానంగా వేగుతాయి. వీటిని మీడియం మంట మీద, మధ్యమధ్యలో తిప్పుతూ బంగారు రంగులోకి మారి కరకరలాడేంత వరకు వేయించండి. పకోడీలు బాగా ఉడికిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి.

-అంతే నోరూరించే వేడివేడి ముల్లంగి ఆకు పకోడీలు రెడీ. వీటిని పచ్చ చట్నీ, టమాటా సాస్ లేదా వేడివేడి టీతో తింటుంటే ఆ మజానే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, November 21, 2026, 19:36 [IST]
Desktop Bottom Promotion