రోజుకు 2 స్పూన్లు చాలు..చలికాలంలో ఉక్కులాంటి బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్,సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చలికాలం వచ్చేసిందంటే చాలు, మన శరీరాన్ని వెచ్చగా ఉంచి, శక్తినిచ్చే పోషకాహారం ఎంతో అవసరం. అందుకే చలికాలంలో బాదం, జీడిపప్పు వంటి నట్స్‌ తో పాటు అవిసె, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, నువ్వులు వంటి ఆరోగ్యకరమైన విత్తనాలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

అయితే రోజూ ఇన్ని రకాలను విడివిడిగా తినడం చాలా మందికి కష్టంగా అనిపించవచ్చు. దీనికి సులభమైన, రుచికరమైన పరిష్కారమే హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ సీడ్స్ పౌడర్. బలాన్నిచ్చే ఈ పొడిని తయారు చేయడం చాలా సులభం, ఒక నెల పాటు నిల్వ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ సీడ్స్ పౌడర్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Homemade Nutrient Rich Dry Fruits Seeds Powder Recipe in Telugu Winter Energy Immunity Booster

కావలసిన పదార్థాలు

బాదం- 100 గ్రాములు
జీడిపప్పు- 100 గ్రాములు
వాల్‌ నట్‌- 100 గ్రాములు
మఖానా- 100 గ్రాములు
గుమ్మడి గింజలు- 100 గ్రాములు
పొద్దుతిరుగుడు గింజలు- 100 గ్రాములు
అవిసె గింజలు- 100 గ్రాములు
తెల్ల నువ్వులు- 100 గ్రాములు

తయారీ విధానం

-ముందుగా ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసి, మఖానాలను మీడియం మంటపై కరకరలాడేంత వరకు వేయించాలి. అవి మాడిపోకుండా కలుపుతూ ఉండండి.

-ఆ తర్వాత అదే బాండీలో ఎలాంటి నూనె లేదా నెయ్యి వేయకుండా గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత నువ్వులు, అవిసె గింజలను కూడా నూనె లేకుండా తేలికగా వేయించాలి.

-ఇప్పుడు బాదం, జీడిపప్పు, వాల్‌ నట్‌ లను విడివిడిగా పొడిగా వేయించండి. వీటిలో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి కాబట్టి వేయించడానికి అదనపు నూనె అవసరం లేదు.

-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కలపండి. ఆ తర్వాత మిక్సర్ జార్‌ లో కొద్దికొద్దిగా వేస్తూ, ముందుగా ముతక పొడిగా చేసి, ఆ తర్వాత పూర్తిగా మెత్తబడే వరకు మధ్యమధ్యలో స్పూన్‌ తో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి.

-తయారైన ఈ పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరిస్తే ఒక నెల వరకు పాడవకుండా ఉంటుంది.

-ప్రతిరోజూ ఉదయం 2 నుండి 3 టీస్పూన్ల ఈ డ్రై ఫ్రూట్ సీడ్స్ పౌడర్‌ ను తీసుకుని, అరకప్పు పాలలో వేసి కాసేపు నాననివ్వండి. రుచి కోసం తగినంత తేనె, బెల్లం లేదా చక్కెర కలుపుకుని సేవించవచ్చు. క్రమం తప్పకుండా రోజూ రెండు టీస్పూన్ల ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పుష్కలమైన శక్తి అందడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

[ of 5 - Users]
Story first published: Monday, November 23, 2026, 10:34 [IST]
Desktop Bottom Promotion