ఎలక్ట్రిక్ కెటిల్‌ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ..

Posted By:

స్టవ్ మీద కంటే, ఎలక్ట్రిక్ కెటిల్‌ లో టీ లేదా పాలు వేడి చేసుకోవడం చాలా సులభంగా, తొందరగా అయిపోయే పని అనిపిస్తుంది. అయితే పదే పదే ఇందులో పాలు, నీళ్లు మరిగించడం వల్ల కెటిల్ అడుగు భాగంలో, అంచులకు మొండి మరకలు ఏర్పడతాయి. ఈ మరకల వల్ల కెటిల్ అందం చెడిపోవడమే కాకుండా, అందులోంచి ఒక రకమైన వింత దుర్వాసన రావడం మొదలవుతుంది.

అయితే ఇది ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కావడంతో, సాధారణ గిన్నెల్లాగా దీన్ని నీళ్లలో ముంచి కడగలేము. అలాగని ఇనుప పీచు పెట్టి రుద్దితే లోపలి భాగం పాడవుతుంది. ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులతో దాన్ని తిరిగి కొత్తదానిలా ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ చూడండి.

How to Clean Stained Electric Kettle Quick Tips to Make Your Electric Kettle Shine Again

క్లీనింగ్ కోసం కావలసినవి

తెల్ల వెనిగర్ - 1 కప్పు (లేదా 2 నిమ్మకాయల రసం)
బేకింగ్ సోడా - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - 2 కప్పులు
డిష్‌ వాషింగ్ లిక్విడ్ - కొద్దిగా
ఒక మెత్తటి స్పాంజ్, కాటన్ క్లాత్

Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే..

శుభ్రం చేసే విధానం

-ముందుగా మీ ఎలక్ట్రిక్ కెటిల్‌ లో ఒక కప్పు తెల్ల వెనిగర్ లేదా నిమ్మరసం, రెండు కప్పుల నీళ్లు పోయండి. లోపల మొండి మరకలు ఉన్న భాగం పూర్తిగా ఈ నీటిలో మునిగేలా చూసుకోండి.

-ఇప్పుడు కెటిల్ ప్లగ్ పెట్టి, స్విచ్ ఆన్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించండి. నీళ్లు పూర్తిగా మరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి, ఆ వేడి ద్రావణాన్ని కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు కెటిల్‌ లోనే అలాగే వదిలేయండి. వెనిగర్‌ లేదా నిమ్మరసంలో ఉండే ఆమ్లగుణం (యాసిడ్) వల్ల ఎంతటి కఠినమైన పసుపు లేదా మాడిన మరకలైనా సరే మెత్తబడి వదులుగా మారతాయి.

-20 నిమిషాల తర్వాత కెటిల్‌ లోని నీటిని సింక్‌ లో పారబోయండి. ఇప్పుడు కెటిల్ లోపలి అడుగు భాగంలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను సమానంగా చల్లండి. ఒక మెత్తటి స్పాంజ్‌ తీసుకుని, దానికి కొద్దిగా డిష్‌ వాషింగ్ లిక్విడ్ రాసి, కెటిల్ లోపల మృదువుగా రుద్దండి. అప్పటికే మెత్తబడిన మరకలు బేకింగ్ సోడా ప్రభావానికి పూర్తిగా మాయమైపోతాయి.

-ఈ దశలో మీరు ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ కెటిల్ కింది భాగానికి (ఎలక్ట్రిక్ బేస్) ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తగలకూడదు. అందువల్ల కేవలం లోపల మాత్రమే మంచి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి. బయటి భాగాన్ని శుభ్రం చేయడానికి ఒక తడి కాటన్ గుడ్డతో తుడిచి, తర్వాత పొడి టవల్ తో అద్దినట్లుగా తుడిచేయండి. దాన్ని కాసేపు గాలికి ఆరనిస్తే సరిపోతుంది.

-ఇంతే ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఎలక్ట్రిక్ కెటిల్ మళ్లీ కొత్తదానిలా తళతళా మెరుస్తుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, October 8, 2026, 6:47 [IST]
Desktop Bottom Promotion