ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

పావ్ భాజీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా ఇట్టే నోరూరిపోవాల్సిందే. ముంబై స్ట్రీట్ ఫుడ్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఇదే. వేడి వేడి పెనం మీద వెన్న కరుగుతుంటే వచ్చే సువాసన, ఆ మసాలా ఘాటు భోజనప్రియులను ఇట్టే కట్టిపడేస్తాయి.

అయితే పావ్ భాజీ అనగానే అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి కచ్చితంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ పండుగ రోజుల్లో లేదా ఉల్లి, వెల్లుల్లి తినని వారు ఈ అద్భుతమైన రుచికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ నో ఆనియన్, నో గార్లిక్ చీజ్ పావ్ భాజీ. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అచ్చం ముంబై వీధుల్లో దొరికే రుచితో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చీజ్‌ తో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

No Onion No Garlic Mumbai Street Style Cheese Pav Bhaji Recipe in Telugu

కావలసిన పదార్థాలు

బంగాళదుంపలు - 3
క్యాలీఫ్లవర్ ముక్కలు - 2 కప్పులు
పచ్చి బఠానీలు - అర కప్పు
టమాటాలు - 4
నూనె - 4 టేబుల్ స్పూన్లు
వెన్న - 30 గ్రాములు
కాశ్మీరీ ఎర్ర కారం - 1 టేబుల్ స్పూన్
పావ్ భాజీ మసాలా (ఉల్లి, వెల్లుల్లి లేనిది) - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - 2 టీస్పూన్లు
వేడి నీళ్లు - 1 గ్లాసు
ఉప్పు - రుచికి సరిపడా
పావ్ బన్స్ - తగినన్ని
తురిమిన చీజ్ - అలంకరణకు
కొత్తిమీర, నిమ్మకాయ - గార్నిష్ కోసం

పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్‌ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్ ముక్కలను శుభ్రంగా కడిగి ఓ గిన్నెలో లేదా కుక్కర్‌ లో వేయండి. తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత నీటిని వంపేసి, ఓ మ్యాషర్ సహాయంతో కూరగాయలన్నీ మెత్తటి పేస్ట్‌ లా అయ్యేలా బాగా మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-అలాగే నాలుగు టమాటాలను మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీలా రుబ్బి ఉంచుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో నూనె, వెన్న వేసి వేడి చేయండి. వెన్న కరుగుతున్నప్పుడే కాశ్మీరీ కారం పొడి, కసూరి మేతి, పావ్ భాజీ మసాలా వేసి సన్నని మంటపై వేయించాలి. కాశ్మీరీ కారం వల్ల భాజీకి స్ట్రీట్ స్టైల్ ఎరుపు రంగు వస్తుంది. మసాలాలు వేగిన సువాసన రాగానే, టమాటా ప్యూరీని వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.

-టమాటా ప్యూరీ బాగా ఉడికాక, ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. మసాలా అంతా కూరగాయలకు పట్టేలా కలిపాక, ఒక గ్లాసు వేడి నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు చూసుకుని మూతపెట్టాలి. సన్నని మంటపై భాజీ కాస్త చిక్కబడేవరకు ఉడకనివ్వాలి. భాజీ సరైన కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆపేయాలి.

-ఇప్పుడు వేరొక పెనం తీసుకుని స్టవ్ పై వేడి చేయండి. పావ్ బన్స్‌ ను మధ్యలోకి కట్ చేసి, పెనంపై కొద్దిగా వెన్న వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి.

-ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో వేడి వేడి భాజీని వేయండి. దాని పైన కొద్దిగా నిమ్మరసం పిండి, తురిమిన చీజ్, సన్నగా తరిగిన కొత్తిమీర, చిన్న వెన్న ముక్క వేసి అలంకరించండి.

-అంతే.. ఘుమఘుమలాడే చీజ్ పావ్ భాజీ రెడీ. దీన్ని వెన్నతో కాల్చిన బన్స్‌ తో తింటుంటే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Monday, October 5, 2026, 19:05 [IST]
Desktop Bottom Promotion