ఐరన్, కాల్షియంల గని..మాస్టర్ చెఫ్ స్టైల్ మునగకాయ నిల్వ పచ్చడి..అమృతం టేస్ట్ అందే ఇదేనేమో!

Posted By:

తెలుగు వారికీ, ఊరగాయలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఇంట్లో అమ్మో, అమ్మమ్మో పెట్టిన పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. మామిడి, నిమ్మ, టమాటా, ఉసిరి, క్యారెట్, ముల్లంగి, పనస.. ఇలా ఎన్నో రకాల ఊరగాయలను మనం రుచి చూసే ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా మునగకాయ ఊరగాయ గురించి విన్నారా?

మునగకాయతో కేవలం సాంబారు, ఇగురు మాత్రమే కాదు, అదిరిపోయే ఊరగాయ కూడా పెట్టొచ్చని ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ ఊరగాయ కేవలం రుచికరమైనదే కాదు, పోషకాల గని కూడా. మునగ చెట్టులోని ఆకులు, పూలు, కాయలు.. ఇలా ప్రతి భాగం ఆరోగ్యానికి మేలు చేసేదే.

Nutritional Powerhouse Master Chef Pankaj Bhadouria Drumstick Pickle Recipe in Telugu

మునగలో.. పాలలో కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండు కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, పాలకూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటాయి. అంతేకాదు, మన శరీరానికి అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇన్ని లాభాలున్న మునగకాయను ఇలా కారపు పచ్చడిలా చేసుకుని తింటే, ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచిని కూడా ఆస్వాదించవచ్చు.

మనగకాయ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

లేత మునగకాయలు - 500 గ్రాములు
ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1 టేబుల్ స్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు
వెనిగర్ - పావు కప్పు
ఆవ నూనె- 1 కప్పు
ఆమ్ చూర్ పొడి - కొద్దిగా
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - పావు కప్పు
నల్ల జీలకర్ర (కలోంజి) - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - పావు కప్పు

మనగకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం

-ముందుగా మునగకాయలను శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొక్కను (నారను) కాస్త తీసేసి, 2 అంగుళాల సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో ఈ ముక్కలను వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి.

-పొయ్యి మీద పాన్ పెట్టి జీలకర్ర, సోంపు, ధనియాలు, నల్ల జీలకర్ర, ఆవాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టి, మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడి చేసుకోవాలి.

-ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగకాయ ముక్కలను వేయాలి. దీనికి ముందుగా పట్టుకున్న మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం, ఆమ్ చూర్ పొడి కలపాలి. ప్రతి మునగకాయ ముక్కకూ ఈ మసాలా బాగా పట్టేలా చేత్తో సున్నితంగా కలుపుకోవాలి.

-ఒక చిన్న బాండీలో ఆవ నూనె తీసుకుని, పొగలు వచ్చేంత వరకు బాగా వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి, నూనెను గోరువెచ్చగా అయ్యేలా కాస్త చల్లారనివ్వాలి. ఈ వేడి నూనెను, వెనిగర్‌ను పచ్చడి గిన్నెలో పోసి బాగా కలుపుకోవాలి.

-అంతే ఎంతో ఘుమఘుమలాడే, రుచికరమైన మునగకాయ ఊరగాయ'రెడీ. వేడి వేడి అన్నం, పప్పు, లేదా రోటీల్లోకి ఈ పచ్చడిని నంచుకుని తింటే ఆ రుచి అమృతంలా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, April 13, 2026, 7:11 [IST]
Desktop Bottom Promotion