రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ.. ఇడ్లీ, దోశ, చపాతీలకు బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రోజూ ఉదయాన్నే ఇడ్లీ, దోశల్లోకి అవే సాంబార్, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ తిని తిని బోర్ కొట్టిందా? మీ బ్రేక్ ఫాస్ట్ కి కాస్త కొత్తదనాన్ని, అదిరిపోయే ఘాటును జోడించాలని చూస్తున్నారా? అయితే మీ వంటగదిలో సులభంగా దొరికే ఎండుమిర్చి, వెల్లుల్లి, పెరుగుతో రాజస్థాన్‌ లో ఎంతో ప్రసిద్ధి చెందిన పెరుగు వెల్లుల్లి మిరపకాయ చట్నీ ట్రై చేసి తీరాల్సిందే.

చూడటానికి సాధారణ ఎర్ర కారం చట్నీలా కనిపించినా, దీని రుచి మాత్రం చాలా భిన్నంగా, నోరూరించేలా ఉంటుంది. వెల్లుల్లి ఘాటు, మసాలాల సువాసన, పెరుగు కమ్మదనం అన్నీ కలిసి ఇడ్లీ, దోశ, చపాతీలకు అద్భుతమైన జోడీగా నిలుస్తాయి. తయారు చేయడం కూడా ఎంతో సులభం. రాజస్థాన్ స్పెషల్ పెరుగు వెల్లుల్లి చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Rajasthani Curd Garlic Chilli Chutney Recipe in Telugu The Best Side Dish for Idli Dosa Chapati

కావలసిన పదార్థాలు

మసాలా పేస్ట్ కోసం:

10 ఎండు మిరపకాయలు
నానబెట్టడానికి వేడినీళ్లు
అర కప్పు వెల్లుల్లి రెబ్బలు
2 అంగుళాల తరిగిన అల్లం
2 టేబుల్ స్పూన్ల ధనియాలు
1 టేబుల్ స్పూన్ జీలకర్ర
అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి
1 టేబుల్ స్పూన్ నూనె

తాలింపు కోసం:

3 టేబుల్ స్పూన్ల నూనె
1 టేబుల్ స్పూన్ ఆవాలు
1 టేబుల్ స్పూన్ జీలకర్ర
చిటికెడు పసుపు
కొన్ని కరివేపాకు ఆకులు
3 చితకగొట్టిన వెల్లుల్లి రెబ్బలు
1 కప్పు పెరుగు
రుచికి సరిపడా ఉప్పు

ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్‌ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి!

తయారీ విధానం

-ముందుగా 10 ఎండు మిరపకాయలను వేడి నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచండి.

-తర్వాత ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, అర కప్పు వెల్లుల్లి వేయండి. వీటిని మీడియం మంటపై బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత రెండు అంగుళాల తరిగిన అల్లం వేసి బాగా వేయించండి. అనంతరం నానబెట్టిన ఎండు మిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

-1 నిమిషం తర్వాత అందులో 2 చెంచాల ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, అర చెంచా మిరియాల పొడి కలపండి. మసాలాలన్నీ మంచి సువాసన వచ్చేవరకు వేయించి, స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి.

-ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లోకి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత ఒక పెద్ద బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, కొన్ని కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టండి. దీనికి చితకగొట్టిన మూడు వెల్లుల్లి రెబ్బలు జోడించి, రంగు మారేంతవరకు వేయించాలి.

-తర్వాత అందులో సిద్ధం చేసుకున్న వెల్లుల్లి మిరపకాయల పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించండి.

-ఇప్పుడు స్టవ్ మంటను తగ్గించి, ఒక కప్పు పెరుగు వేసి నిరంతరం కలుపుతూ ఉండండి. పెరుగులో వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఒక టీస్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కలపండి. చివరగా మూత పెట్టి సుమారు 10 నిమిషాల పాటు లేదా నూనె పైకి తేలేవరకు ఉడికించండి.

-అంతే, ఘుమఘుమలాడే రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ రెడీ. వేడివేడి ఇడ్లీ, కరకరలాడే దోశ లేదా మెత్తని చపాతీలతో దీనిని వడ్డిస్తే ఇంట్లో వారందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

[ of 5 - Users]
Story first published: Monday, November 16, 2026, 20:00 [IST]
Desktop Bottom Promotion