చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!

Posted By:

మన చేతులతో ఇంట్లోనే ప్రేమగా తయారుచేసుకునే స్వీట్ల రుచికి సాటి ఏదీ రాదు. అందుకే ఈసారి సంప్రదాయ రుచిని, ఆధునిక ఫ్లేవర్‌ను కలిపి డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీని ప్రయత్నించి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ దాని రుచితో ఇట్టే కట్టిపడేస్తుంది. డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

మెత్తని వెన్న (సాఫ్ట్ బటర్) - 4 టేబుల్ స్పూన్లు
పాలు - ముప్పావు కప్పు,అదనంగా 1 టేబుల్ స్పూన్
మిల్క్ పౌడర్ - ఒకటిన్నర కప్పులు
చక్కెర - ముప్పావు కప్పు
కోకో పౌడర్ - 1 టేబుల్ స్పూన్
కేవ్రా వాటర్ - కొన్ని చుక్కలు
యాలకుల పొడి - రుచికి తగినంత
వెనీలా ఎసెన్స్ - కొన్ని చుక్కలు
నెయ్యి - గ్రీజింగ్ కోసం

How to Make Sweet Shop Style Double Layer Chocolate Burfi Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా ఒక ట్రేలో పార్చ్‌ మెంట్ పేపర్ వేసి, దానిపై కొద్దిగా నెయ్యి రాసి పక్కన ఉంచండి.

-స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న, ముప్పావు కప్పు పాలు వేసి బాగా కలిపి మరిగించండి. తర్వాత అందులో మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా మృదువుగా కలిసేలా తిప్పండి. తర్వాత చక్కెర వేసి, అడుగంటకుండా కలుపుతూ సుమారు 8 నిమిషాల పాటు ఉడికించండి. మిశ్రమం పాన్‌ కు అంటుకోకుండా ముద్దలా దగ్గరపడే వరకు ఉడికించాలి.

-కొద్దిగా మిశ్రమాన్ని తీసి కాస్త చల్లారనిచ్చి, నెయ్యి రాసిన వేళ్ల మధ్య తిప్పితే మెత్తని ఉండలా రావాలి. బర్ఫీ గట్టిగా కావాలనుకుంటే మరికొద్దిసేపు ఉడికించండి.

-స్టవ్ ఆపేసి పాన్‌ ను పక్కకు దించండి. ఇందులో సగం మిశ్రమాన్ని ఒక బౌల్‌ లోకి తీసుకోండి. బౌల్‌ లోని మిశ్రమంలో కేవ్రా వాటర్, యాలకుల పొడి కలిపి, సిద్ధం చేసిన ట్రేలో మొదటి పొరలా సమానంగా పరచండి.

బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి..

-పాన్‌ లో మిగిలిన మిశ్రమంలో కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ పాలు, వెనీలా ఎసెన్స్ వేయండి. తక్కువ మంటపై కలుపుతూ, మిశ్రమం తిరిగి పాన్‌ కు అంటుకోని ముద్దలా వచ్చేవరకు ఉడికించండి. చల్లారిన కొద్దిపాటి మిశ్రమాన్ని వేళ్లతో చూస్తే మెత్తని ఉండలా రావాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ చాక్లెట్ మిశ్రమాన్ని మొదటి లేయర్ పైన వేసి సున్నితంగా సమానం చేయండి.

-దీనిని గది ఉష్ణోగ్రత దగ్గర గంటసేపు చల్లారనిచ్చి, ఆ తర్వాత పూర్తిగా సెట్ అయ్యే వరకు ఫ్రిజ్‌ లో ఉంచండి.

-చివరగా కత్తికి నెయ్యి రాసి, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి.

-అంతే నోట్లో వేసుకోగానే కరిగిపోయే, కంటికి ఇంపుగా కనిపించే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, November 14, 2026, 22:18 [IST]
Desktop Bottom Promotion