రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!

Posted By:

భారతీయ వంటకాల్లో బిర్యానీకి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకం. ఎక్కడికి వెళ్లినా, ఏ వేడుక జరిగినా అందులో బిర్యానీ ఉండాల్సిందే. అందులోనూ శాఖాహారులకు పనీర్ బిర్యానీ అంటే ఒక పండుగ లాంటిది. సాధారణంగా చేసే పనీర్ బిర్యానీకి భిన్నంగా, బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే పనీర్ ముక్కలతో చేసే పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ రుచి అమోఘంగా ఉంటుంది.

Sunday Special Restaurant Style Paneer Fry Piece Biryani Recipe at Home in Telugu

పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన రుచుల సమ్మేళనం. ఒక వైపు కరకరలాడే పనీర్ ముక్కలు, మరోవైపు మసాలాలతో ఊరిన మెత్తటి పనీర్, వీటికి తోడు సువాసనలు వెదజల్లే బాస్మతి బియ్యం..ఇవన్నీ కలిసి దీన్ని ఒక పరిపూర్ణమైన భోజనంగా మారుస్తాయి. రెస్టారెంట్లలో దొరికే ఈ అద్భుతమైన వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీకి కావాల్సినవి

-పనీర్ ముక్కలు
-పచ్చిమిరపకాయలు
-బాస్మతి బియ్యం
-లవంగాలు
-యాలకలు
-నల్ల యాలక
-జీలకర్ర
-మిరియాలు
-షాజీరా
-దాల్చిన చెక్క
-స్టార్ అనాస
-నెయ్యి
-నూనె
-ఉప్పు
-కారం
-ఉల్లిపాయలు
-బిర్యానీ ఆకులు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-కొత్తిమీర
-పసుపు
-జీడిపప్పు

Sunday Special Restaurant Style Paneer Fry Piece Biryani Recipe at Home in Telugu

పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం

-ముందుగా ఒకటిన్నర గ్లాసు బాస్మతి బియ్యం లేదా నార్మల్ బియ్యం 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి.

-బియ్యం నానేలోగా ఒక స్పెషల్ మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ షాజీరా, 1 స్టార్ అనాస, 8 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, 4 యాలకలు, 1 నల్ల యాలక వేసి దోరగా వేపుకోవాలి. 1-2 నిమిషాలు వేయిస్తే చాలు. వేపిన వాటిని పాన్ లో నుంచి బయటకు తీసి చల్లారిన తర్వాత వాటన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు బిర్యానీ రైస్ తయారుచేయడానికి స్టవ్ మీద కడయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 2 యాలకలు, 2 లవంగాలు, స్టార్ అనాస, రాతి పువ్వు, షాజీరా కొద్దిగా వేసి వీటిని లైట్ గా ఫ్రై చెయ్యాలి. తర్వాత ఇందులోనే పొడవుగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు వేసి, సన్నగా తరగిన 1 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి.

-ఉల్లిపాయలు కొంచెం వేగి మెత్తబడిన తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒకటిన్నర టీస్పూన్ వరకు వేసి కలుపుకున్నాక ఇందులోనే 3 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, కొత్తిమర తరుగు కొంచెం చల్లుకొని నీళ్లు మరిగేంతవరకు ఉడికించాలి.

-నీళ్లు బాగా మరగడం మొదలైనప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యం వేసి 10 నిమిషాలు మంటను మీడియం, హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి 10 నిమిషాలు ఉడకబెడితే అన్నం బాగా ఉడికి నీళ్లు దగ్గరపడతాయి. అప్పుడు అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని మూతపెట్టి తక్కువ మంట మీద 6-7 నిమిషాలు దయ్ చేస్తే బిర్యానీ రైస్ రెడీ. గరిటతో గుచ్చి చూస్తే తడి అస్సలు తగలకుండా ఉంటే బిర్యానీ రైస్ రెడీ అయినట్లే.

-ఇప్పుడు పనీర్ ఫ్రై చేసుకోండి.ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో 200 గ్రాముల పనీర్ ముక్కలు వేసి మీడియం మంట మీద కలుపుతూ 2 నిమిషాలు వేయించాలి. పనీర్ ముక్కలు కొంచెం రంగు మారినప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే మరికొంచెం ఆయిల్ వేసి అరకప్పు సన్నగా తరగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి 50 శాతం వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసిన 3 ఉల్లిపాయల చీలికలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టీస్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించేటప్పుడే ఇందులో పావు టీస్పూన్ పసుపు, ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ కారం, ముందుగా తయారుచేసుకున్న స్పెషల్ మసాలా పొడిని వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఈ దశలో పాన్ లో పావు కప్పు నీళ్లు పోసి మొత్తం మసాలాలను 2 నిమిషాలు ఉడికించండి.

-ఇప్పుడు పాన్ లో ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలను వేసి కలుపుతూ మరో 3 నిమిషాలు వేయించాలి. పనీర్ ముక్కలు గట్టిగా అవుతున్నట్లు అనిపించినా, లేదా మసాలాలు మాడుతున్నట్లు అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు ఒక బౌల్ లో పనీర్ ఫ్రై వేసుకొని దానిమీద బిర్యానీ రైస్ వేసుకొని ఒక నిమిషం ఆగి ఆ బౌల్ ని ప్లేట్ లోకి బోర్లించి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కొరుక్కొని ఆ బిర్యానీ తింటుంటే ఆహా ఓహో అని తీరాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Sunday, July 12, 2026, 9:14 [IST]
Desktop Bottom Promotion