హార్మోన్ల సమతుల్యత నుండి ఎముకల బలం వరకు.. ప్రతి మహిళ తినాల్సిన 5 ఆరోగ్యకరమైన ఆహారాలు!

ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆఫీసు ఒత్తిళ్లు.. ఇలా నిత్యం పరుగుల జీవితంలో పడి మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. శక్తి తగ్గిపోవడం, నీరసం, జుట్టు రాలడం, ఎముకల నొప్పులు, నెలసరి అవకతవకలు, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి వంటి సమస్యలు వస్తుంటాయి.

చాలామంది వీటిని వయస్సుతో వచ్చే సహజ మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే మహిళలు నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఐదు అద్భుత ఆహారాలను ప్రముఖ నిపుణుడు డాక్టర్ శుభం వాత్స్య ఇటీవల ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

5 Superfoods Every Woman Must Eat for Energy and Hormone Balance

మహిళలు తప్పనిసరిగా తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే

ఉసిరికాయ

శతాబ్దాలుగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్-సి కి ఇది ఒక అద్భుతమైన సహజ మూలం. ఉసిరిలోని పోషకాలు చర్మంలో కొల్లాజెన్‌ ను నిర్మించి, ముఖాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా కాపాడుతుంది. దీనిని పచ్చిగా లేదా పచ్చడి రూపంలో మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

నువ్వులు, గుమ్మడి గింజలు

మహిళల ఎముకల ఆరోగ్యానికి, అండాశయాలకు తెలుపు లేదా నలుపు నువ్వులు, గుమ్మడి గింజలు చాలా అవసరం. నువ్వుల్లోని కాల్షియం ఎముకలను బలపరిస్తే, గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మెరుగుపరిచి, హార్మోన్లను నియంత్రిస్తాయి. రుతుక్రమం ముందు వచ్చే నొప్పుల నుండి ఇవి ఉపశమనం ఇస్తాయి. వీటిని వేయించి, పొడిగా నూరి లేదా లడ్డూలుగా చేసుకుని ఆహారంలో చేర్చుకోవచ్చు.

హలీమ్ విత్తనాలు

మీకు తరచుగా అలసటగా అనిపిస్తున్నా, జుట్టు విపరీతంగా రాలిపోతున్నా హలీమ్ విత్తనాలు మీకో వరంలా పనిచేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతిరోజూ కేవలం అర టీస్పూన్ హలీమ్ గింజలను తీసుకుంటే సరిపోతుంది. లేదా వీటితో రుచికరమైన లడ్డూలు తయారు చేసుకుని కూడా హాయిగా తినవచ్చు.

మాత్రలు వేసుకున్నా విటమిన్ D లోపం తగ్గడం లేదా? డాక్టర్ సలహా ఇదే!మాత్రలు వేసుకున్నా విటమిన్ D లోపం తగ్గడం లేదా? డాక్టర్ సలహా ఇదే!

డార్క్ చాక్లెట్

ప్రతిరోజూ కనీసం 70 శాతం ఉన్న డార్క్ చాక్లెట్‌ ను ఒక చిన్న ముక్క తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మీ మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.

అవిసె గింజలు

చాలామంది మహిళలకు పీరియడ్స్ టైంలో ఎదురయ్యే మూడ్ స్వింగ్స్,PMS వంటి సమస్యలకు అవిసె గింజలు చక్కటి పరిష్కారం. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను దోరగా వేయించి సలాడ్లు, కూరల్లో కలుపుకొని తింటే ఎంతో మేలు జరుగుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, November 27, 2026, 19:04 [IST]
Desktop Bottom Promotion