చట్నీ కూడా అవసరం లేని అద్భుతమైన టిఫిన్.. పోషకాలు నిండిన ముల్లంగి అటుకుల దోసె ఇంట్లోనే ఇలా చేయండి!

Posted By:

ఉదయాన్నే ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీ, దోసెలు తిని తిని విసుగు వచ్చిందా? అయితే ఈసారి బ్రేక్‌ ఫాస్ట్‌ లోకి కాస్త కొత్తగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే ఒక అద్భుతమైన వంటకాన్ని ప్రయత్నించండి. మీ వంటింట్లో సులభంగా దొరికే ముల్లంగి, బియ్యప్పిండితో కమ్మని ముల్లంగి అటుకుల దోసె తయారు చేసుకోవచ్చు.

ఉదయాన్నే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పోషకభరితమైన టిఫిన్‌ కు ప్రత్యేకంగా ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీల కలయికతో తింటే ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. ముల్లంగి అటుకుల దోసె ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Instant Radish Poha Dosa Make Nutritious Breakfast Mullangi Atukulu Dosa in Minutes

కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పులు
ముల్లంగి - 1
పెద్ద ఉల్లిపాయలు - 2
తురిమిన కొబ్బరి - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
అటుకులు - 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి తురుము (చిల్లీ ఫ్లేక్స్) - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వేడినీళ్లు - తగినన్ని
నూనె - కాల్చడానికి అవసరమైనంత

తయారీ విధానం

-ముందుగా ముల్లంగి తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. అలాగే అటుకులను శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

-ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల బియ్యప్పిండిని తీసుకుని, అందులో తురిమిన ముల్లంగి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత తురిమిన కొబ్బరి, కొత్తిమీర, నానబెట్టిన అటుకులను నీళ్లు పిండేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి తురుము,రుచికి సరిపడా ఉప్పు వేసి పదార్థాలన్నీ పిండిలో బాగా కలిసేలా చేతితో కలపాలి.

-ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా వేడినీళ్లు పోస్తూ మరీ గట్టిగా కాకుండా, అలాగని జారుగా కాకుండా మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి.

-తర్వాత ఒక అరటి ఆకుకు కొద్దిగా నూనె రాసి, కొంత పిండి ముద్దను తీసుకుని ఆకుపై గుండ్రంగా, చదునుగా దోసెలా తట్టుకోవాలి.

-చివరగా పొయ్యిపై దోసె పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత తట్టిన పిండిని అరటి ఆకుతో సహా పెనంపై తిప్పి వేసి, నెమ్మదిగా ఆకును తీసివేయాలి.

-చుట్టూ కొద్దిగా నూనె పోసి, మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం మంటపై కాల్చాలి. ఆ తర్వాత మూత తీసి, దోసెని రెండో వైపుకు తిప్పి, మళ్లీ మూత పెట్టి మరో 1 నిమిషం పాటు బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చుకోవాలి.

అంతే కరకరలాడుతూ నోరూరించే వేడివేడి ముల్లంగి అటుకుల దోసె రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, November 27, 2026, 7:13 [IST]
Desktop Bottom Promotion