డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే!

దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. ఆ వెంటనే మనకు గుర్తొచ్చేది టపాసులు. దీపావళి రోజు ఉదయం నుంచే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని కాల్చేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఆకాశంలో అందంగా పేలే ఆ టపాసుల వెనుక మన కంటికి కనిపించని పెద్ద ప్రమాదం దాగి ఉందని మీకు తెలుసా? ముఖ్యంగా మనం చాలా సేఫ్ అనుకునే మూడు రకాల టపాసులు వందల సిగరెట్లు తాగితే వచ్చే పొగ కంటే ఎక్కువ విషాన్ని వెలువరిస్తాయని నెల్లూరుకి చెందిన డాక్టర్ శ్రీధర్ ముండ్లపూడి ఒక వీడియోలో చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.

పాము బిల్లలు

దీపావళి షాపింగ్ కోసం షాపుకి వెళ్తే అందరూ తప్పనిసరిగా ముఖ్యంగా చిన్నపిల్లలకు మనం ముందుగా కొనిచ్చేవి ఇవే. ఇవి ఎలాంటి శబ్దం చేయకుండా సైలెంట్ గా కాలుతాయి కదా అని తల్లిదండ్రులు కూడా ధీమాగా పిల్లల చేతికి ఇచ్చేస్తుంటారు. కానీ చిన్న సైజులో ఉండే ఈ బిల్లలు వెలిగించినప్పుడు వచ్చే పొగ అత్యంత ప్రమాదకరమైనది. ఒకే ఒక్క పాము బిల్ల కాలిస్తే.. అది వందల సిగరెట్ల నుంచి వచ్చే హానికరమైన పొగతో సమానం అని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆ విషతుల్యమైన పొగను పిల్లలు దగ్గరగా ఉండి పీల్చడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది.

dangerous diwali firecrackers worse than cigarettes dr sridhar health alert

పెన్సిల్స్

చూడటానికి రంగురంగులుగా ఉంటూ పిల్లలను ఎంతగానో ఆకర్షించే టపాసుల్లో ఇవి ఒకటి. చేత్తో పట్టుకుని తిప్పుతూ ఆడుకునే ఈ పెన్సిళ్లు పేలవు కాబట్టి సురక్షితం అనే భ్రమలో ఉంటాం. కానీ ఇవి కాలుతున్నప్పుడు వెలువడే దట్టమైన పొగ నేరుగా పిల్లల ముఖానికి తగులుతుంది. ఇందులో ఉండే రసాయనాల ఘాటు ఊపిరితిత్తులకు, కళ్ళకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా..Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా..

తాడులు

కాకరొత్తులు లేదా ఇతర టపాసులను సులభంగా వెలిగించడానికి ఎక్కువ శాతం ఈ మందు తాడులను ఉపయోగిస్తుంటారు. ఇది చాలా నెమ్మదిగా కాలుతూ మనకు సహాయపడుతుంది. కానీ ఇది కాలుతున్నంత సేపు విపరీతమైన పొగను వెలువరిస్తూనే ఉంటుంది. దీన్ని పట్టుకుని టపాసులు వెలిగించే సమయంలో ఆ పొగను మనం నేరుగా పీల్చేస్తుంటాం. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం

అయితే కేవలం ఈ మూడు టపాసుల నుంచే పొగ వస్తుందని కాదు. మనం కాల్చే ప్రతి టపాసులోనూ రసాయనాలు ఉంటాయి, పొగ వస్తుంది. అయితే పై మూడు రకాల టపాసులు పెద్దగా శబ్దం చేయవు కదా అని చిన్న పిల్లలకు ఇస్తుంటాం, పైగా వీటితో ముఖానికి దగ్గరగా ఉండి ఆడుకుంటారు కాబట్టే ఇవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని డాక్టర్ శ్రీధర్ చెప్పారు.

కాబట్టి టపాసుల వాడకాన్ని వీలైనంత వరకు లిమిట్ గా ఉంచాలని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహించండి. వీలైతే ఎలాంటి కాలుష్యం లేని, ఆరోగ్యానికి హాని చేయని పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రయత్నించండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, November 8, 2026, 9:00 [IST]
Desktop Bottom Promotion