Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
కలర్ ఫుల్ హోళీ యొక్క ఆచారాలు మరియు ప్రాముఖ్యత...
కలర్ ఫుల్ హోళీ యొక్క ఆచారాలు మరియు ప్రాముఖ్యత...
మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగలలో హోళీ ఒకటి . ఈ పండుగ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. చంద్రమానం ప్రకారం మాస నిర్ణయం రెండు పద్దతులుగా చేస్తారు. మొదటి పధ్ధతి ప్రకారం పౌర్ణమితో నెల పూర్తయి, మరుసటి రోజునుంచీ కొత్త మాసం మొదలవుతుంది. దీన్ని'పూర్ణి మంత' విధానం అంటారు.ఈ ప్రకారం ఫాల్గుణ పున్నమితో సంవత్సరం ముగిసి మరుసటి రోజునుంచి వసంత ఋతువు ప్రవేశంతో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. వసంతాగమనాన్నీ, కొత్త సంవత్సరాన్నీ ఆహ్వానిస్తూ చేసుకునే పండుగ కనుక ఈ పండుగని వసంతోత్సవం అని కూడా అంటారు.

ఈ పండుగ గురించి రక రకాలైన కథలు ప్రాచుర్యంలో వున్నాయి. వాటిల్లో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడూ, అతని తండ్రి హిరణ్య కశిపుల గురించిన కథ ముఖ్యమైనది. హిరణ్య కశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హరి భక్తి నుంచి దూరం చేయలేక, కుపితుడై అతడిని చంపదలచి చితిపై తన సోదరి హోళిక వొడిలో కూర్చోనమని కుమారుని ఆదేశిస్తాడు. మంటల్లో ప్రవేశించినా దహనం కాని విధంగా వరం పొందిన హోళిక నూ, ఆమె ఒడిలోని ప్రహ్లాదుడినీ అగ్ని ముట్టడిస్తుంది. ప్రహ్లాదుని నిర్మల భక్తికి మెచ్చిన నారాయణుడు అతడిని కాపాడగా, వరాన్ని పొందిన హోళిక ఒంటరిగా కాకుండా మరొక వ్యక్తితో కలిసి అగ్నిలో ప్రవేశించినందున అగ్ని దేవుని ఆగ్రహానికి గురై దహనమై పోతుంది. ఆనాటినుంచి నలుగురూ గుమిగూడే ఆవరణలో పెద్ద భోగిమంటను వెలిగించి హోళికను దగ్ధం చేస్తూ చెడుపై మంచి సాధించే గెలుపునీ , భగవంతుని పట్ల భక్తునికి గల అవిరళ భక్తి పొందే విజయాన్నీ పండుగగా జరుపుకోవడం మొదలైనదని చెప్పుకుంటారు. హోళి రోజున 'హోళికా దహనం' పేర పనికిరాని పాత సామానులనీ కాగితాలనీ మంటల్లో వేసి కొత్త భావాలకూ, మంచి మార్పులకూ స్వాగతం పలుకుతారు.
హోళీ గురించి మరొక కథ ఉంది.చిన్నపిల్లల్ని వేధించే దుండి రాక్షసిని పిల్లలంతా కలిసి హోళీ పండుగ నాడు తరిమికొట్టారనీ ,ఆ రోజునుంచీ ఈ పండుగ పిల్లల విజయోత్సవంగా జరుపుకోవడంకూడా మొదలైందనీ చెప్పుకుంటారు.అందుకే ఈ హోళికా దహనం వేళ పెద్దలు పిల్లల అల్లరికి అడ్డు చెప్పకపోవడం పరిపాటి.
పసిబాలుడైన చిన్ని కృష్ణుడి ప్రాణాలు హరించమని కంసుడు పూతన అనే రాక్షసిని పంపించగా ,కృష్ణుడు పాలతోపాటుగా పూతన ప్రాణాలనుకూడా హరించిన భాగవత కథ మనకు తెలిసినదే. శీతాకాలాన్ని పూతనగా, చలికాలం అంతమై వాతావరణం వెచ్చబడదాన్ని పూతన సంహారంగా భావించడం ఈ పండుగకున్న మరో కోణం.
దక్షిణాదిన కామదేవుని పూజించే సాంప్రదాయముంది. సర్వమూ పరిత్యజించి తీవ్రమైన తపస్సులో మునిగిపోయిన శివుడిపై శక్తివంతమైన ప్రేమబాణాన్ని సంధించి, జనహితం కోసం తన ప్రాణాలకు తెగించి , శంకరునిలో పార్వతీ దేవి పై ప్రేమ మొలకెత్తేలా చేస్తాడు మన్మధుడు. తపోభంగమైన శివుడు ఆగ్రహోదగ్రుడై మూడోకన్ను తెరుస్తాడు.కామదేవుడు దగ్ధమై పోతాడు.తరువాత రతీదేవి ప్రార్ధననాలకించి శివుడు ఆమెకు మాత్రమే మనోరూపుడై కనిపించే విధంగా మన్మధుడికి ప్రాణ భిక్షనందిస్తాడు, మానసికమూ అలౌకికమూ అయిన ప్రేమ భౌతిక లాలసకు సంబంధించినది కాదనే సూచన ఈ పురాణ కథలో ఇమిడి ఉందంటారు. జగత్ కల్యాణం కోసం కామదేవుని త్యాగాన్ని శ్లాఘిస్తూ జరుపుకునే ఈ పండుగని కామోత్సవం అని కూడా అంటారు.
బెంగాల్ లో ఊయలోత్సవంగా, డోలోత్సవంగా పిలవబడే ఈ పండుగ నాడు విద్యార్ధులు కేసర వర్ణం లేదా తెల్లని రంగు బట్టలు ధరించి ఏకతార, వీణ వంటి సంగీత వాద్యాలకనుగునంగా నర్తిస్తారు. నగర వీధుల్లో రాధా కృష్ణుల విగ్రహాలను పల్లకీ లో ఊరేగిస్తూ ఊయలూపుతూ భక్తి గీతాలను ఆలపిస్తారు. పురుషులు ఆబీర్ చల్లుతూ రంగు నీరు చిమ్ముతూ వెంట నడుస్తారు.ఇంటి పెద్ద ఉపవాసముండి , శ్రీ కృష్ణుడినీ , అగ్ని దేవుడినీ పూజించి కృష్ణ ప్రతిమకు గులాల్ పులిమి పిండివంటలు స్వామికి నైవేద్యం గా సమర్పిస్తారు. కృష్ణ భక్తులు ఎక్కువగా వుండే మధుర, బృందావన్ , నందగాంవ్ ప్రాంతాలు ఈ పండుగ సమయానికి యాత్రా స్థలాలుగా రూపు దిద్దుకుంటాయి. ఇక్కడ హోళీ ని పదహారు రోజుల పండుగ గా జరుపుతారు.
ఒరిస్సా లో కూడా హోళీ దాదాపు ఇదేవిధంగా జరిగినా రాదా కృష్ణుల స్థానంలో వీరు జగన్నాధుని పూజిస్తారు.గోవా లోనూ , కర్నాటక ,మహారాష్ట్ర ,కేరళ లోనూ కొంకణులు హోళీని శిశిరోత్సవంలో భాగంగా జరుపుకుంటారు. హోళీ మిలన్ పేర పరిచయస్తుల ఇళ్ళకు వెళ్లి హోళీ పాటలు పాడి , ఆత్మీయంగా రంగులు పులిమి స్నేహాన్నీ. సోదర ప్రేమనూ పంచుకుంటారు. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల హోళీ నాటి సాయంత్రమే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పంచాంగ శ్రవణం చేస్తారు.
గుజరాత్ లో ఈ పండుగ నాడు భోగిమంటలు వెలిగించి నృత్య గానాలతో సందడి చేస్తారు.వీధిలోనే ఎత్తుగా ఉట్టి కట్టి పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు ఎక్కుతూ ఉట్టి కొట్టాలని ప్రయత్నిస్తారు.వెన్నదొంగని ఆపే ప్రయత్నంలో భాగంగా ఆడపిల్లలు గోపిక వేష ధారులై ఉట్టి కొట్ట నివ్వకుండా రంగునీల్లు చల్లుతూ అడ్డుపడతారు. మహారాష్ట్ర లో ఇది ఐదురోజుల పండుగ.పండుగకు వారంరోజుల ముందే యువకులంతా కలిసి చందాలు పోగుచేస్తారు. ప్రతి కుటుంబం నైవేద్యానికి భోజన పదార్ధాలనూ, పిండివంటలనూ అందించి సంబరంలో పాలుపంచుకుంటుంది.. పాత శత్రుత్వాలేవున్నా మరచి పోయి సుహృద్భావాలను పెంపొందించుకోవాలని ఈ పండుగ సమయంలో పెద్దలు చెపుతారు. మణిపురి వాసులు ఇదే పండుగను ఆరు రోజుల పాటు చేసుకుంటారు.గడ్డి కప్పిన పూరి పాకను దహనం చేయడంతో ఇక్కడ పండుగ సంబరాలు మొదలవుతాయి.'తాబల్ చొంగ్బ ' అనే బృంద నాట్యం ఈ పండుగ సంబరాలలో మణిపురి వాసుల ప్రత్యేకత .
ఆంద్ర ప్రదేశ్ ,కర్నాటక లలో హోళీ పండుగ నాడు బడికి సెలవు . తెలంగాణా ప్రాంతంలో,హైదరాబాదులో హోళీ సంరంభం మిన్నంటే ఉత్సాహంతో ఒక రోజు ముందు నుంచే మొదలవుతుంది . కర్నాటక గ్రామ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి వంటచెరకు పోగు చేసి ' కామ దహనా'నికి వాడడం,చందాలు వసూలు చేసి ఉత్సవానికి ఖర్చు చేయడం పరిపాటి.
ఈ రంగుల పండుగ ముఖ్యంగా హిందువులదే అయినా ఈ పండుగ జరుపుకోవడం లో మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాల వారూ ఉత్సాహంతో పాల్గొంటారు. హోళీ సంబరాలు జరుపుకునే వేళ వయసు, స్త్రీ పురుష వ్యత్యాసం,హోదా ,కుల మత భేదాలకు సంబంధించిన సామాజిక కట్టు బాట్లలో సడలింపు కనిపిస్తుంది. ధనిక ,పేద వర్గ విభేదాలు మరచి హిందువులంతా కలసి మెలసి ఈ పండుగ జరుపుకుంటారు. పాత చీపుర్లూ, తట్ట బుట్టలూ, పనికిరాని చెక్క వస్తువులూ , కాగితాలూ , రాలిన ఎండుటాకులూ కుప్పగా పేర్చి దహనం చేస్తారు. హోళీ మంట తర్వాత మిగిలిన భస్మాన్ని బొట్టుగా ధరించి శరీరానికి పులుముకుంటారు. కొత్త చిగుళ్లకూ నవ చైతన్యానికీ స్వాగతం పలుకుతారు.



Click it and Unblock the Notifications











