పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన్ఇండియా...!

By B N Sharma

ప్రస్తుత ప్రపంచంలో అటవీ సంపద అతి వేగంగా అదృశ్యమైపోతోంది. మానవుడు తనకుగల వివిధ అవసరాలకుగాను అధిక సంఖ్యలో అడవులను నరికి తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. అయినప్పటికి మరోవైపు భవిష్యత్ అవసరాలను పరిరక్షించటానికిగాను నడుం కట్టే పర్యావరణ ప్రేమికులు మొక్కలు నాటి, చెట్లను పెంచి తమవంతు కృషిగా పరిసరాల పచ్చదనం కాపాడుతూనే వున్నారు. పచ్చని అటవీ సంపద పెంపకం, గ్రామీణులు, అటవీ వాసులు తమసాంప్రదాయ జీవన వృత్తులను కాపాడుకునేందుకు మరియు తరతరాలుగా వస్తున్న వారి సాస్కృతిక సంపదలను పరిరక్షించుకునేందుకు ఎంతో తోడ్పడుతుంది. నదులనుండి వరదలు రాకుండా అడవులు కాపాడుతున్నాయి. అటువంటి అడవుల పెంపకాలను మనం నిర్లక్ష్య పరచటమే కాదు, వాటికి నష్టపరుస్తున్నాం.

భూమి నానాటికి వేడెక్కిపోతోంది. అన్ని దేశాలవారూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పై దృష్టి పెట్టి తమవంతు కృషి చేస్తూనేవున్నారు. అడవులను నరకటం, వాతావరణ మార్పులు రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానించబడినవే. భౌగోళికంగా, అడవుల నరికివేత సంవత్సరానికి షుమారుగా2 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను గాలిలోకి వదులుతోంది. అంటే మానవ ప్రేరిత కార్బన్ డయాక్సైడ్ కాలుష్య వెల్లువలో ఇది షుమారుగా 25 శాతం వరకు వుంటుంది. ప్రపంచ అడవులను నాశనం చేయటం వాటిపై ఆధారపడిన అటవీ వృత్తుల గిరిజనులను మాత్రమే నష్టపరచటం కాదు, ప్రపంచ మానవాళికి సైతం గొడ్డలి పెట్టేనని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

అటవీ సంపదను నష్టపరచటంలో ఎప్పటికపుడు ఏవేవో కారణాలు చెపుతారు. పరిశ్రమల అభివృధ్ధి, ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు వంటివిగా ఈ కారణాలు ప్రదేశం నుండి ప్రదేశానికి మారుతూనే వుంటాయి. కాని క్షేత్రస్ధాయి వాస్తవాలను పరిశీలిస్తే, అడవులలో వుండే జనులకు వీటి అవసరం ఎంతో వుంది. వారి సాంప్రదాయ మరియు వ్యవసాయ వృత్తులు కొనసాగవలసిన అవసరం ఎంతో వుంది.

వ్యవసాయ సంబంధిత అడవులు పెంచాలి. వ్యవసాయం, చెట్లు, స్ధానిక ప్రజలు, ఆయా అడవులలోని జంతు సంపద అన్నీపర్యావరణ సంరక్షణకు అవసరమే. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత అడవుల పెంపకం వేలాది సంవత్సరాలనుండి వివిధ రకాలుగా ఆచరించబడుతోంది. అభివృధ్ధి చెందుతున్న దేశాలలో తక్కువ భూములతో అధికఫలసాయాలు పొందే మార్గంలో ఎన్నో రకాల ప్రణాళికలు ఆచరించబడుతున్నాయి.

గ్రామాలు, పట్టణాల ప్రజలు తమవంతు కృషిగా మొక్కల పెంపకం, సంరక్షణ వంటివి చేపట్టి భవిష్యత్ తరాలను కాలుష్య సంక్షోభం నుండి కాపాడాలి. మొక్కల పెంపకం వలన వచ్చే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. మొక్కలు లేదా చెట్లు మానవుడి జీవనాధారం. మానవాళి మనుగడకు అవి తప్పక జీవించాలి. మానవుడి ఆహార అవసరాలు ప్రధానంగా వృక్షాల వలననే తీరుతున్నాయి. నేటి మానవుడు అనుభవించే జంతువులు సైతం వృక్షాలపైనే ఆధారపడి వున్నాయనటంలో అతిశయోక్తిలేదు. ఇంత ప్రాధాన్యతగల వృక్ష సంపద ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి వాటి పెంపకంలో భాధ్యత వహించాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. అపుడే మానవాళి మనుగడ కొనసాగగలదు.

పర్యావరణ పరిరక్షణ కృషిలో భాగంగా నగర నడిబొడ్డున పచ్చని జయనగర్ పరిసరాలలో వున్న వన్ ఇండియా నెం.1 లాంగ్వేజస్ పోర్టల్ నేడు తన సిబ్బంది షుమారు నూరుమందితో కలసి ‘హసిరు బెళసి నాడె ఉళిసి’ అనే నినాదంతో ఒక ప్రదర్శన నిర్వహించింది. బావి పార్కు లో నగర ప్రాంతీయ ప్రముఖుల సహాయ సహకారాలతో సంస్ధ వ్యవస్ధాపకులు బి.జి. మహేష్, సంస్ధ సి.ఇ.ఒ. శ్రీరామ్ హెబ్బర్ తదితరులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆచరించారు.

Story first published: Tuesday, June 5, 2012, 16:16 [IST]
Desktop Bottom Promotion