ఎందుకు కట్ చేశావ్? అహ్మదాబాద్ విమాన ప్రమాదం రిపోర్ట్ లో సంచలనం రేపిన పైలట్ల సంభాషణ

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈ ఏడాది జూన్ 12 జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇంకా భారతీయుల కళ్ల ముందే కనబడుతుంది. విమానం ఎక్కాలంటేనే ప్రయాణికుల వణికిపోయే పరిస్థితి నెలకొంది. కొందరు అయితే విమానంలో జర్నీనా మేము రాము బాబాయ్ అంటూ భయపడుతున్నారు. జూన్ 12,2025న అహ్మదాాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు బయల్దేరిన ఎయిరిండియా డ్రీమ్ లైనర్ విమానం కొన్ని క్షణాల్లోనే అగ్నిగోళంగా మారి అహ్మదాబాద్ నగరంపై మృత్యుశకలాలను వెదజల్లింది. రన్ వే మీద నుంచి గాల్లోకి ఎగిరిన సెకన్ల వ్యవధిలోనే దూసుకుంటూ వెళ్లి ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓ మెడికల్ కాలేజీ మెస్ లోకి దూసుకెళ్లి బ్లాస్ట్ అయ్యింది.

మూడు దశాబ్దాల భారత విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఈ ప్రమాదం 260 మందిని బలిగొని దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విమానంలో 11వ నెంబర్ సీటులో కూర్చొన్న రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్టల్ మెస్ లో అన్నం తింటున్న మెడికల్ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలిచివేసింది.

Ahmedabad Flight Crash Why Did You Cut Pilot s Chilling Dialogue Surfaces in Preliminary Report

అయితే విమాన ప్రమాదానికి గత కారణాలపై నిపుణుల బృందం దర్యాప్తు చేపట్టగా.. నెల రోజుల తర్వాత వెలువడిన ప్రాథమిక నివేదిక ప్రమాదానికి కారణంపై ఒక షాకింగ్ నిజాన్ని వెలుగులోకి తెచ్చింది..కానీ అదే సమయంలో వందల ప్రశ్నలను లేవనెత్తింది. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన భారత ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలోని వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రమాదానికి మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే చర్చకు దారితీశాయి.

కాక్‌ పిట్‌ లో ఆఖరి క్షణాలు
దర్యాప్తు బృందానికి లభించిన కాక్‌ పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఈ మిస్టరీకి కేంద్ర బిందువుగా మారాయి. నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కాక్ పిట్ ‌లోని రెండు ఇంజిన్ల ఆయిల్ సప్లై స్విచ్‌ లు కట్-ఆఫ్ స్థానానికి మారాయి. ఈ స్విచ్‌ లను ఆఫ్ చేస్తే..ఇంజిన్‌ లకు ఆయిల్ సప్లై ఆగిపోయి అవి తక్షణమే పనిచేయడం మానేస్తాయి. కాక్‌ పిట్ వాయిస్ రికార్డర్‌లో నమోదైన సంభాషణ గుండెల్ని పిండేసేలా ఉంది. ఒక పైలట్ మరొకరిని ఎందుకు కట్ చేశావ్? అని అడగడం స్పష్టంగా వినిపించింది. దానికి రెండో పైలట్ నేను చేయలేదు అని సమాధానమిచ్చాడు. ఈ సంభాషణ జరిగిన సెకన్ల వ్యవధిలోనే విమానం వేగంగా ఎత్తును కోల్పోవడం ప్రారంభించింది. కాక్‌ పిట్ నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ కు మేడే, మేడే, మేడే అనే అత్యవసర సందేశం అందింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.

నివేదిక ప్రకారం..ఒకదాని తర్వాత ఒకటి కేవలం సెకను తేడాలో రెండు స్విచ్‌ లు ఆఫ్ అయ్యాయి. పైలట్లు వెంటనే తేరుకున, వాటిని తిరిగి ఆన్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ఇంజిన్ పునఃప్రారంభమైనప్పటికీ అప్పటికే విమానం నియంత్రణ కోల్పోయింది. వేగాన్ని అందుకోలేక విమానాశ్రయ పరిధి దాటి నేలమీద కుప్పకూలింది.

వీడని చిక్కుముడులు.. నిపుణుల సందేహాలు

స్విచ్‌ లు ఎలా ఆఫ్ అయ్యాయి? ఈ ఆయిల్ స్విచ్‌ లకు ప్రమాదవశాత్తు కదలకుండా ప్రత్యేకమైన లాకింగ్ మెకానిజం ఉంటుంది. సాధారణంగా గేటు దగ్గర ఇంజిన్లు ఆపడానికి లేదా ఇంజిన్‌ లో మంటలు చెలరేగినప్పుడు మాత్రమే పైలట్లు ఉద్దేశపూర్వకంగా వీటిని ఉపయోగిస్తారు. అలాంటి అత్యవసర పరిస్థితి ఏదీ ఉన్నట్లు నివేదికలో లేదు. వాటిని అనుకోకుండా తాకడం అసాధ్యం. ఎవరో ఉద్దేశపూర్వకంగానే వాటిని కదిలించి ఉండాలి అని విమానయాన భద్రతా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ahmedabad Flight Crash Why Did You Cut Pilot s Chilling Dialogue Surfaces in Preliminary Report

పైలట్లు ఎందుకు అలా చేస్తారు?

విమాన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (56) అత్యంత అనుభవజ్ఞుడు. ఆయనకు 15,638 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉంది..ఆయన ఎయిర్ ఇండియాలో బోధకుడు కూడా. సహ పైలట్ క్లైవ్ కుందర్ (32)కు 3403 గంటల అనుభవం ఉంది. ఇంతటి నైపుణ్యం ఉన్న పైలట్లు..టేకాఫ్ సమయంలో ఇంజిన్ స్విచ్‌ లను ఎందుకు ఆఫ్ చేస్తారు? ఒకవేళ పైలట్లే వాటిని కదిలిస్తే అసలు ఎందుకు? అని మరో నిపుణులు ప్రశ్నలు లేవనుత్తుతున్నారు.

మృత్యువును జయించిన ఒక్కడు
ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి బ్రిటిష్ జాతీయుడైన రమేష్ బిశ్వాస్ (40). అహ్మదాబాద్ హాస్పిటల్ బెడ్‌ పై నుంచి ఆయన చెప్పిన మాటలు ప్రమాద తీవ్రతను కళ్లకు కట్టాయి. "టేకాఫ్ అయిన కాసేపటికే విమానం గాలిలో చిక్కుకున్నట్లు అనిపించింది. లైట్లు మిణుకుమిణుకుమన్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ఓ భవనాన్ని ఢీకొట్టి పేలిపోయింది. నేను ఎలా బ్రతికానో నమ్మలేకపోతున్నాను. నా కళ్ల ముందే ఎయిర్ హోస్టెస్‌ లు, తోటి ప్రయాణికులు చనిపోవడం చూశాను. విమానం శకలాల్లో ఏర్పడిన రంధ్రం గుండా నా కాలుతో నెట్టి బయటకు వచ్చాను అని ఆయన ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు.

మంత్రి రామ్ మోహన్ నాయడు ఏం చెప్పారంటే

AAIB ప్రాథమిక నివేదికపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే.. మంత్రిత్వ శాఖలో మేము దీనిని విశ్లేషిస్తున్నాము. AIBBకి అవసరమైన ఏదైనా సపోర్ట్ కోసం మేము వారితో సమన్వయం చేసుకుంటున్నాము. తుది నివేదికలు త్వరలో వస్తాయని ఆశిస్తున్నాము తద్వారా మేము కొంత నిర్ణయానికి రాగలం. పైలట్ల పరంగా మనకు అత్యంత అద్భుతమైన శ్రామిక శక్తి ఉందని నేను నిజంగా నమ్ముతున్నాను. మొత్తం ప్రపంచంలోనే పైలట్లు, సిబ్బంది విమానయాన పరిశ్రమకు వెన్నెముక అని అన్నారు.

ముగింపు ఎప్పుడు
ప్రస్తుతానికి విమాన తయారీదారు అయిన బోయింగ్ కంపెనీ లేదా ఇంజిన్ల తయారీ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ పై ఎలాంటి చర్యలకు రిపోర్ట్ సిఫార్సు చేయలేదు. ఎయిర్ ఇండియా అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తేలడానికి, తుది నివేదిక రావడానికి ఇంకా చాలా నెలలు పట్టవచ్చు. అప్పటివరకు ఆ కాక్‌పిట్‌లో ఆ చివరి క్షణాల్లో ఏం జరిగిందన్నది ఒక రహస్యమే. ఆ రెండు స్విచ్‌లు ఎందుకు ఆఫ్ అయ్యాయి? పైలట్ల మధ్య జరిగిన ఆ చిన్న సంభాషణ వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు AI171 విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా, ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోతుంది.

Story first published: Saturday, July 12, 2025, 15:27 [IST]
Desktop Bottom Promotion