పేరెంట్స్ రిచ్‌ అయితే జెన్‌ జెడ్‌ చెడుదారులు పడుతుందా.. వైరల్‌ పోస్ట్‌పై చర్చ.!

ఇప్పుడు ట్రెండ్‌ అంతా జెన్‌ జెడ్‌దే. టెక్నాలజీ పరంగా, ట్రెండింగ్‌ పరంగా, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, కొత్త డిక్షనరీలు, పదాలు ఇలా అన్నిటిలోనూ వాళ్లదే హవా నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌ కావడంతో పాటు కొత్త చర్చకి దారితీసింది. మనదేశంలో ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆ పోస్ట్ ఆరోపిస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముంది.. ఎవరు పోస్ట్‌ చేశారు.. ఇందులో నిజమెంత? చూద్దాం..

Do Gen Z kids go astray if their parents are wealthy sparks over a viral post

జెన్‌ జెడ్‌ పిల్లలున్న తల్లిదండ్రులు బాగా సంపాదిస్తూ ఉండటం, లేదా వ్యాపారంలో స్థిరపడి ఆర్థికంగా ఉన్నతంగా ఉంటే చాలా వరకు వారి పిల్లలు నిర్లక్ష్యంగా, సోమరులుగా మారుతున్నారని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ప్రేమ్‌ సోని అనే సోషల్‌ మీడియా యూజర్‌ తన పోస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చకి దారితీశాయి. "ధనవంతులైన భారతీయ తల్లిదండ్రులు తమ నిష్క్రియాత్మక ఆదాయాన్ని తమ పిల్లలతో పంచుకుంటున్నారు. దీంతో వారి భవిష్యత్తు నాశనం అవుతోంది. తాము తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేస్తున్నామని వారు అనుకుంటారు.. కానీ నిజానికి పూర్తిగా సోమరులు, నిర్లక్ష్యంగా ఉండే తరాన్ని సృష్టిస్తున్నారు. ఈ రోజు ఏ టైర్-1 లేదా టైర్-2 నగరానికి వెళ్ళినా, ఈ ఆర్థిక ఉచ్చులో చిక్కుకున్న చాలా మంది 25 ఏళ్ల యువకులను మీరు కనుగొంటారు." అని ప్రేమ్ సోని తన పోస్ట్‌లో రాశారు.

జెన్‌ జెడ్‌ తరంపై అత్యధికంగా చూపిస్తున్న ప్రభావాలు

ప్రతిష్ఠ వేస్తున్న ఉచ్చు

ధనవంతుల పిల్లలు సమాజంలో తమ ప్రతిష్ఠ, హోదా కారణంగా కొందరు చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. అదేవిధంగా చిన్నతనంగా భావించి సేల్స్‌, మార్కెటింగ్‌ వంటి ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు.

జీవనశైలి ప్రభావం

ధనవంతుల పిల్లలు గడిపే ఖరీదైన, విలాసవంతమైన జీవితం గురించి తెలియనిది కాదు. అయితే వారు ఉద్యోగం చేయడం ప్రారంభించినట్లయితే కంపెనీలు ఇచ్చే ప్రారంభ జీతంతో వారు తమ లైఫ్‌స్టైల్‌ను గడపలేరు. అందుకే తక్కువ జీతం ఉన్న ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు.

Do Gen Z kids go astray if their parents are wealthy sparks over a viral post

హక్కు, అధికారం..

ఒక కుటుంబం తరతరాలుగా వ్యాపారాన్ని స్థిరంగా నిర్వహిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లయితే కొందరు జెన్‌ జెడ్‌ తరం.. ఆ సంపాదనని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ.. ఆ వ్యాపారాన్ని నిర్వహించడానికి కానీ, ముందుకు తీసుకువెళ్లడానికి గానీ ఆసక్తి చూపించడం లేదు.

మరి ఈ తరం చేసే పనులేంటి..

చాలా వరకు జెన్‌ జెడ్‌ తరం.. ఉదయం 11 గంటలకు నిద్ర లేచి తమ రోజును ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల సంపాదనతో బతుకుతారు. కొందరు తల్లిదండ్రులు దీనికి అడ్డుచెప్పరు. తాము పడిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తమ పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. దీంతో అసలు ఉద్దేశం వదిలి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. 55 ఏళ్ల తండ్రి ఇంకా రోజుకు 10 గంటలు పనిచేస్తుండగా, అతని 25 ఏళ్ల కొడుకు మాత్రం హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తుండటం ఆలోచించాల్సిన విషయం.

సోషల్ మీడియాలో ప్రేమ్ సోనీ అభిప్రాయంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అందరినీ ఒకే కొలమానంతో అంచనా వేయకూడదని కొందరు యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఈ తరానికి పని, జీవితంపై పూర్తిగా భిన్నమైన దృక్పథం ఉందని మరికొందరు అంటున్నారు. వారసత్వంగా వచ్చిన సంపద మంచిదే, కానీ దానిని నిలబెట్టుకోవడానికి కష్టపడాలని కొందరు కామెంట్స్‌ చేశారు.

Story first published: Monday, August 31, 2026, 16:38 [IST]
Desktop Bottom Promotion