ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం!

Posted By:

ఉసిరికాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది కేవలం పండు మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటి సూపర్ ఫుడ్. ఈ ఉసిరిని కొందరు మురబ్బాగా తింటే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. కానీ మన తెలుగు వారికి ఏ కాయ కనిపించినా పచ్చడి చేయాలనిపించడం సహజం. అందులోనూ ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.

పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే.. ఆ మజానే వేరు. మీ రెగ్యులర్ భోజనానికి అదనపు రుచిని జోడించాలనుకుంటే, ఇంట్లోనే చాలా సులభంగా, అప్పటికప్పుడు చేసుకోగలిగే ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Authentic Andhra Style Usirikaya Nilva Pachadi Traditional Amla Pickle Recipe in Telugu

కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు: 500 గ్రాములు
నువ్వుల నూనె: అర కప్పు,వేయించడానికి మరో 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 2 టేబుల్ స్పూన్లు
మెంతులు: 1 టేబుల్ స్పూన్
కారం: పావు కప్పు
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: అర టీస్పూన్
నిమ్మకాయలు: 2
తాలింపు కోసం:
ఆవాలు, జీలకర్ర: చెరో అర టీస్పూన్
ఎండు మిరపకాయ: 1
ఇంగువ: చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు: కొన్ని

గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టాలి. ఒక మందపాటి బాండీలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేడి చేసి, అందులో ఉసిరికాయలను వేయాలి. మీడియం మంటపై 8 నుంచి 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. కాయలు కొద్దిగా మెత్తబడగానే మంట ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కాయల్లోని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

-ఒక పొడి బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించాలి. కమ్మటి సువాసన రాగానే దించేసి, చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తటి పొడిలా పట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక శుభ్రమైన, తడి లేని గిన్నెను తీసుకుని.. అందులో కారం, ఉప్పు, పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న ఆవ-మెంతి పొడి వేసి బాగా కలపాలి. ఇందులో చల్లారిన ఉసిరి ముక్కలు వేసి, ప్రతి ముక్కకు ఉప్పు, కారం పట్టేలా బాగా మిక్స్ చేయాలి.

-మిగిలిన నువ్వుల నూనెను వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేయాలి. ఆవాలు చిటపటలాడాక చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. ఈ తాలింపు నూనెను పూర్తిగా చల్లారనిచ్చి, ఉసిరి మిశ్రమంలో కలుపుకోవాలి.

-చివరగా పచ్చడిలో ఇంకొంచెం పులుపు ఇష్టపడేవారు నిమ్మరసం కలుపుకోవచ్చు.

-తయారైన ఈ నోరూరించే ఉసిరికాయ పచ్చడిని, తడి లేని పొడి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. తయారు చేసిన వెంటనే కాకుండా, ఒక రెండు రోజుల పాటు మూతపెట్టి పక్కన ఉంచితే.. ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 14, 2026, 16:07 [IST]
Desktop Bottom Promotion