మిగిలిపోయిన అన్నంతో కర్ణాటక స్పెషల్ కూర్గీ రోటీ.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు

Posted By:

మన ఇళ్లలో భోజనం తర్వాత అప్పుడప్పుడు అన్నం మిగిలిపోవడం సహజమే. కానీ మరుసటి రోజు ఆ చల్లారిన అన్నాన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగని దాన్ని పారేయడానికి మనసు ఒప్పదు. మరి ఆ మిగిలిన అన్నంతో ఏదైనా కొత్తగా, రుచికరంగా కర్ణాటక స్పెషల్ కూర్గీ రోటీ ట్రై చేయండి. కేవలం ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోనే నిమిషాల్లో ఈ అద్భుతమైన రోటీలను సిద్ధం చేసుకోవచ్చు.

దీనిని పెనంపై సగం కాల్చి, తర్వాత నేరుగా గ్యాస్ మంటపై కాల్చడం వల్ల పూరీలా చక్కగా పొంగుతుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా రాత్రి డిన్నర్‌ లోకి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. కర్ణాటక స్పెషల్ కూర్గీ రోటీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Don t Throw Away Leftover Rice Make Soft Puffy Coorgi Roti at Home Recipe in Telugu

కావలసిన పదార్థాలు

మిగిలిపోయిన లేదా వండిన అన్నం: 3/4 కప్పు
బియ్యపు పిండి: 1 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: అవసరమైనంత
నెయ్యి: కొద్దిగా

విటమిన్ B, విటమిన్ C పుష్కలం..చలికాలంలో సాయంత్రం పూట తప్పక తాగాల్సిన సూప్ ఇదే..ఎలా చేయాలంటే..

తయారు చేసే విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో వండిన లేదా మిగిలిపోయిన అన్నాన్ని వేయండి. కొద్దిగా నీళ్లు పోసి, మెత్తని వెన్నలాంటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అన్నం గింజలు లేకుండా నునుపుగా ఉండాలి.

-ఇప్పుడు ఈ అన్నం పేస్ట్‌ ను ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. అందులో బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, మరీ జారుగా కాకుండా చపాతీ పిండిలా కాస్త గట్టి ముద్దలా కలపండి.

-ఇలా సిద్ధం చేసుకున్న పిండి ముద్దపై మూత పెట్టి, సుమారు 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.

-15 నిమిషాల తర్వాత పిండిని మరోసారి చేతితో బాగా కలిపి, 8 సమానమైన చిన్న ఉండలుగా విభజించుకోండి. ఇప్పుడు చపాతీ పీటపై పొడి బియ్యపు పిండిని చల్లుకుంటూ, ఒక్కో ఉండను గుండ్రంగా, మరీ పల్చగా కాకుండా సమంగా ఒత్తుకోండి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న చపాతీని వేసి కాల్చండి. రోటీ పైభాగంలో చిన్న చిన్న బుడగలు రావడం కనిపించినప్పుడు, వెంటనే మరోవైపుకు తిప్పి కొన్ని సెకన్ల పాటు కాల్చండి.

-ఆ తర్వాత రోటీని పెనం నుండి తీసి, తక్కువ మంటపై ఉన్న గ్యాస్ స్టవ్ మీద నేరుగా ఉంచండి. చక్కగా పొంగుతూ, రెండు వైపులా లేత గోధుమ రంగు మచ్చలు కనిపించే వరకు జాగ్రత్తగా కాల్చుకోండి.

-అంతే, ఎంతో మృదువుగా, కమ్మగా ఉండే వేడివేడి కూర్గీ రోటీలు రెడీ. వీటిపై కమ్మని నెయ్యిని రాసి, మీకు ఇష్టమైన కూరగాయల కూర, పప్పు లేదా చట్నీతో తింటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Saturday, November 28, 2026, 20:20 [IST]
Desktop Bottom Promotion