ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి!

Posted By:

బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అందులో ఉండే చికెన్ లేదా మటన్ ముక్కలు. కానీ ఎలాంటి ముక్కలు లేకుండా, అచ్చం రెస్టారెంట్ స్టైల్ లో కమ్మటి రుచితో, మల్లెపూవుల్లా పొడిపొడిగా, ఇల్లంతా గుమగుమలాడే ప్లెయిన్ కుష్కా తింటే ఆ మజాయే వేరు.

సెలవు రోజు మధ్యాహ్నం వేడివేడి కుష్కాను సాల్నా, కుర్మా లేదా చల్లటి రైతాతో కలిపి తింటే భోజనం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే చాలా సులభంగా, పక్కా కొలతలతో ఏ మాత్రం రుచి తగ్గకుండా రెస్టారెంట్ స్థాయి కుష్కా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Easy Quick and Delicious Restaurant Style Plain Kushka Recipe in Telugu

కుష్కా తయారీకి కావలసిన పదార్థాలు

నూనె - 100 మి.లీ
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 4
లవంగాలు - 4
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 150 గ్రాములు
అల్లం పేస్ట్ - 50 గ్రాములు
వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రాములు
కారం - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
పుదీనా ఆకులు - అర కట్ట
టమాటా ముక్కలు - 150 గ్రాములు
పెరుగు - 100 మి.లీ
కొత్తిమీర - పావు కట్ట
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 1 లీటరు
జీరక సాంబ బియ్యం - 500 గ్రాములు
నెయ్యి - 50 మి.లీ
నిమ్మరసం - సగం చెక్క

నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్!

కుష్కా తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బిర్యానీ గిన్నెను పెట్టుకుని అందులో నూనె వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసి కమ్మని సువాసన వచ్చే వరకు వేయించాలి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి గోధుమ రంగులోకి మారేంత వరకు ఓపికగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు గరిటెతో తిప్పుతూ వేయించాలి.

-ఇప్పుడు మంటను కాస్త తగ్గించి కారం, గరం మసాలా పొడి, పుదీనా ఆకులు, టమాటా ముక్కలు, పెరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమంలో కచ్చితంగా 1 లీటరు నీళ్లు పోసి మరగనివ్వాలి.

-నీళ్లు తెర్లుతూ బాగా మరుగుతున్నప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న జీరక సాంబ బియ్యాన్ని నీళ్లు వంపేసి అందులో వేసి నెమ్మదిగా కలపాలి.

-బియ్యం సుమారు 90 శాతం ఉడికి, నీరంతా ఇగిరిపోతున్న సమయంలో పైనుంచి కరిగించిన కమ్మటి నెయ్యి వేయాలి. అలాగే నిమ్మరసం పిండి, కొద్దిగా పుదీనా ఆకులు చల్లుకోవాలి.

-ఇప్పుడు ఒక పాత దోశ పెనం స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఆ వేడి పెనం మీద ఈ కుష్కా గిన్నెను ఉంచి, ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి, మంటను పూర్తిగా సిమ్ లో ఉంచాలి. ఇలా 20 నిమిషాల పాటు దమ్ చేయాలి.

-తర్వాత మూత తీసి చూస్తే రెస్టారెంట్ స్టైల్ కుష్కా రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, August 9, 2026, 13:06 [IST]
Desktop Bottom Promotion