గోవా కొబ్బరి చట్నీ..టిఫిన్స్‌ కే కాదు శాండ్‌విచ్, ఫిష్ ఫ్రైకి కూడా అదిరిపోతుంది

Posted By:

సాధారణంగా మన తెలుగు ఇళ్లలో ఉదయం టిఫిన్ అనగానే ఇడ్లీ, దోశ, వడ లేదా బోండాలు గుర్తొస్తాయి. వీటితో పాటు ప్లేట్‌ లో తప్పనిసరిగా ఉండేది కొబ్బరి చట్నీ. అయితే, రోజూ ఒకే రకమైన తెల్లని కొబ్బరి చట్నీ తిని మీకు బోర్ కొట్టిందా? ఎప్పుడూ ఒకే రుచి కాకుండా ఏదైనా కొత్తగా, ఘాటుగా, రుచికరంగా తినాలనిపిస్తోందా?

అయితే ఈసారి మీ బ్రేక్‌ ఫాస్ట్‌ ను మరింత రుచికరంగా మార్చుకోవడానికి గోవా స్టైల్ కొబ్బరి చట్నీని ప్రయత్నించండి. గోవా అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన బీచ్‌ లు, చల్లని గాలులే కాదు.. అక్కడి అద్భుతమైన వంటకాలు కూడా. అటువంటి రుచికరమైన గోవా వంటకాలలో ఈ పచ్చడి ఒకటి. చూడటానికి సాధారణ చట్నీలాగే ఉన్నా, ఇందులో వాడే పదార్థాలు దీని రుచిని పూర్తిగా మార్చేస్తాయి. తియ్యగా, పుల్లగా, కారంగా ఉంటూ ఇడ్లీ, దోశల రుచిని రెట్టింపు చేసే ఈ చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Goa Style Coconut Chutney A Perfect Side Dish for Idli Dosa and Sandwiches Recipe in Telugu

కావలసిన పదార్థాలు
తాజా కొబ్బరి తురుము: 1 కప్పు
కొత్తిమీర: 1 కప్పు
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 3
వెల్లుల్లి రెబ్బలు: 5
జీలకర్ర: 1 టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
చక్కెర: 2 టీస్పూన్లు
నిమ్మరసం లేదా చింతపండు రసం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: 2 టీస్పూన్లు
నూనె: 1 టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
ఎండుమిర్చి: 1
కరివేపాకు: 1 రెమ్మ
పసుపు: చిటికెడు

తయారీ విధానం

-ముందుగా కొత్తిమీరను నీటిలో బాగా కడగాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, చక్కెర, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు వేసి వీటిని మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కొబ్బరి తురుము, 2 చెంచాల నీరు మాత్రమే పోసి మళ్ళీ రుబ్బుకోవాలి. గోవా స్టైల్ చట్నీ కాస్త గట్టిగా, మందంగా ఉంటేనే రుచి బాగుంటుంది కాబట్టి నీరు ఎక్కువ పోయకండి.

-ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించిఈ పోపును సిద్ధం చేసుకున్న చట్నీలో కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన గోవా చట్నీ రెడీ.

-ఇందులో అన్ని పదార్థాలను పచ్చిగానే వాడతాం కాబట్టి ఇది చాలా ఫ్రెష్‌ గా ఉంటుంది. ఫ్రిజ్‌ లో ఉంచితే దాదాపు 5 రోజుల వరకు చెడిపోదు.

-ఇది కేవలం ఇడ్లీ, దోశలకే కాదు.. బ్రెడ్ శాండ్‌ విచ్‌ లకు స్ప్రెడ్‌ గా రాసుకోవచ్చు. అలాగే అన్నంలో కలుపుకుని తినడానికి లేదా చేపల వేపుడు చేసేటప్పుడు చేపలకు మసాలాగా పట్టించడానికి కూడా ఇది అద్భుతంగా పనికొస్తుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 26, 2025, 13:55 [IST]
Desktop Bottom Promotion