జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

Posted By:

ఉరుకుల పరుగుల జీవితం, కాలుష్యం, పోషకాహార లోపం.. వెరసి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడం, పెరుగుదల మందగించడం, చుండ్రు వంటి సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడే ముందు మీ ఆహారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

మన జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే పైపూతల కంటే లోపలి నుండి పోషణ చాలా అవసరం. అందుకు అద్భుతంగా సహాయపడేదే ఈ సీడ్ లడ్డూ. ఎంతో రుచికరంగా ఉండే ఈ లడ్డూలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇక్కడ చూడండి.

How to Make Seed Laddoo Recipe for Hair Growth in Telugu

సీడ్ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు

నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నల్ల నువ్వులు - అర కప్పు
అవిసె గింజలు - అర కప్పు
వాల్‌నట్స్ - అర కప్పు
గుమ్మడి గింజలు- మూడో వంతు (1/3) కప్పు
ఖర్జూరాలు (గింజలు తీసేసినవి) - 12

రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..

సీడ్ లడ్డు తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న కడాయిని పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తక్కువ మంటపై వేడి చేయండి. నెయ్యి కరిగాక నల్ల నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు,వాల్‌నట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. సుమారు 5 నిమిషాల పాటు సన్నని మంటపై వేయిస్తే, గింజల నుండి కమ్మటి సువాసన వస్తుంది. గింజలు మాడిపోకుండా, రంగు ముదురుగా మారకుండా జాగ్రత్త పడాలి.

-గింజలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌ లో వేసి, ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాలను కూడా అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరీ మెత్తని పేస్ట్‌ లా కాకుండా, కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.

-ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా గట్టిగా ఒత్తుతూ చుట్టుకోవాలి. ఒకవేళ మిశ్రమం పొడిపొడిగా అనిపించి లడ్డూలు చుట్టడానికి రాకపోతే, మరో చెంచా గోరువెచ్చని నెయ్యి కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను వెంటనే డబ్బాలో పెట్టకుండా ఒక 10-15 నిమిషాల పాటు గాలికి వదిలేస్తే చక్కగా గట్టిపడతాయి. ఆ తర్వాత ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే, ఇవి 10 రోజుల వరకు తాజాగా, ఎంతో రుచిగా ఉంటాయి.

సీడ్ లడ్డూ ప్రయోజనాలు

ఈ లడ్డూల తయారీకి ఉపయోగించిన నల్ల నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వాల్‌ నట్స్ అన్నీ పోషకాల గనులే. వీటిలో శరీరానికి, జుట్టుకి అవసరమైన ప్రొటీన్లు, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లను లోపలి నుండి దృఢంగా మార్చి, జుట్టు రాలడాన్ని అరికట్టి, ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

[ of 5 - Users]
Story first published: Thursday, October 15, 2026, 16:48 [IST]
Desktop Bottom Promotion