రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!

Posted By:

జామకాయ పేరు వినగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. దోరగా ఉన్న జామకాయను కోసి, దానికి కాస్త ఉప్పు, కారం అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు. మార్కెట్లో ఏడాది పొడవునా అతి తక్కువ ధరకు దొరికే ఈ జామకాయలతో మనం సాధారణంగా చట్నీ చేస్తాం లేదా పచ్చిగా తింటాం. కానీ ఎప్పుడైనా నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా తగిలే జామకాయ పచ్చడి రుచి చూశారా?

వినడానికి కొత్తగా ఉన్నా, ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. పైగా జామకాయల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేడి వేడి అన్నంలోకి లేదా కరకరలాడే పరాటాల్లోకి ఈ పచ్చడి అద్భుతమైన కాంబినేషన్. ఆవనూనె ఘాటు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో ఈ పచ్చడిని కేవలం పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

instant guava pickle recipe how to make jamakaya pachadi in telugu

కావలసిన పదార్థాలు

గట్టి,దోర జామకాయలు: 500 గ్రాములు
ఆవ నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
సోంపు గింజలు: 1 టీస్పూన్
మెంతులు: అర టీస్పూన్
కలోంజి (నల్ల జీలకర్ర): అర టీస్పూన్
ఇంగువ: పావు టీస్పూన్
పసుపు: 1 టీస్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం: 1 టేబుల్ స్పూన్
ఆమ్చూర్ పొడి: 1 టీస్పూన్ (లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం)
బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా

జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

తయారీ విధానం

-ముందుగా జామకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న చతురస్రాకారపు ముక్కలుగా కత్తిరించుకోండి. ఇక్కడొక చిన్న చిట్కా.. ముక్కలు కోసేటప్పుడు మధ్యలో ఉండే గింజలను తీసేయండి. ఇలా చేయడం వల్ల పచ్చడి తినేటప్పుడు గింజలు పంటికి తగలకుండా, పచ్చడి కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో సోంపు గింజలు, మెంతులు, ఆవాలు వేసి సన్నపు మంట మీద ఒక నిమిషం పాటు దోరగా వేయించండి. అవి చల్లారాక మిక్సీలో వేసి బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోండి.

-ఒక బాండీలో ఆవ నూనె పోసి, పొగలు వచ్చే వరకు వేడి చేయండి.ఆవనూనె పచ్చివాసన పోవడానికి ఇలా చేయాలి. తర్వాత స్టవ్ ఆపేసి, నూనెను కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఆరనివ్వండి.

-ఆ వేడి నూనెలో ఇంగువ, నల్ల జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, నల్ల ఉప్పు మరియు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలపండి. చివరగా మనం కోసి పెట్టుకున్న జామకాయ ముక్కలు, నిమ్మరసం లేదా ఆమ్చూర్ పొడి వేసి మసాలా అంతా ప్రతి ముక్కకూ పట్టేలా బాగా కలపండి.

-అంతే నోరూరించే ఇన్‌స్టంట్ జామకాయ పచ్చడి రెడీ. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, శుభ్రమైన, గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోండి. దీన్ని ఊరనివ్వాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే ఆరగించేయవచ్చు.

[ of 5 - Users]
Story first published: Thursday, October 15, 2026, 21:16 [IST]
Desktop Bottom Promotion