నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

నవరాత్రుల పవిత్ర సమయంలో ఉపవాస ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఆకలి వేస్తుంటుంది. ఆ సమయంలో కడుపు నింపేలా, అదే సమయంలో నోటికి రుచిగా ఏం తినాలో అర్థం కాక సతమతమవుతున్నారా? ఉపవాసంలో తినగలిగే వంటకాల గురించి ఆలోచించినప్పుడు ముందుగా గుర్తొచ్చేది సగ్గుబియ్యం వడ.

కానీ అప్పటికప్పుడు వడలు చేయాలంటే సగ్గుబియ్యాన్ని గంటల తరబడి నానబెట్టాలనే ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాం. అయితే సగ్గుబియ్యాన్ని అస్సలు నానబెట్టాల్సిన పనే లేకుండా, కేవలం నిమిషాల్లో కరకరలాడే ఇన్‌ స్టంట్ సగ్గుబియ్యం వడ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Navratri Special Instant Sabudana Vada Recipe Without Soaking

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం - 1 కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - 1 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు - 3
జీలకర్ర - 1 టీస్పూన్
రాతి ఉప్పు - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 2
అల్లం - 2 అంగుళాల ముక్క
కరివేపాకు - కొద్దిగా రెమ్మలు
నిమ్మరసం - 1 టీస్పూన్
పంచదార - అర టీస్పూన్
కొత్తిమీర - ఒక గుప్పెడు
నూనె - వేయించడానికి సరిపడా

నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని, అందులో సగ్గుబియ్యాన్ని తక్కువ మంటపై దోరగా వేయించండి. అవి కాస్త రంగు మారాక పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. అదే బాండీలో వేరుశెనగలను కూడా మంచి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.

-సగ్గుబియ్యం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి కాస్త బరకగా రుబ్బుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అలాగే వేరుశెనగలను కూడా బరకగా పొడి చేసి ఆ గిన్నెలోనే కలపండి.

-ఇప్పుడు ఆ పొడి మిశ్రమంలో జీలకర్ర, రాతి ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, కొద్దిగా పంచదార, నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. చివరగా ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళదుంపల ముద్దను ఇందులో వేసి, చేతితో బాగా మర్దన చేస్తూ పిండిలా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే, నాలుగైదు చుక్కల నీళ్లు చల్లి ముద్దలా చేసుకోండి.

-కలిపిన పిండిపై ఒక తడి వస్త్రాన్ని కప్పి 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల పిండి చక్కగా సెట్ అవుతుంది. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, అరచేతిలో పెట్టుకుని గుండ్రంగా, చదునుగా వడల ఆకృతిలో ఒత్తుకోండి. వడలను మరీ మందంగా ఒత్తకూడదు.

-ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేయండి. నూనె వేడెక్కాక, మంటను మీడియంలో ఉంచి.. సిద్ధం చేసుకున్న వడలను నూనెలో వేయండి. రెండు వైపులా తిప్పుతూ, మంచి బంగారు గోధుమ రంగులోకి వచ్చి కరకరలాడేలా వేయించండి.

-అంతే నోరూరించే, కరకరలాడే సగ్గుబియ్యం వడలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 13, 2026, 20:41 [IST]
Desktop Bottom Promotion