సాల్మన్ టమోటో ఫిష్ కర్రీ-స్పెషల్ కర్రీ

మాంసాహార ప్రియులకు చేపలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ఉండే వారు చేపలతో వివిధ రకాలుగా వెరైటీ వెరైటీ ఫిష్ వంటకాలను తయారు చేస్తుంటారు. చేపలు ఏవిధంగా వండినీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపలను కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కట్ లెట్, ఫిష్ స్నాక్స్ మొ... మీ ఆరోగ్యం కోసం ఏరకమైన చేపలైనా సరే ఎంపిక చేసుకోండి. ఎందుకంటే చేపలు ఏరకమైనా వాటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చుతాయి.

వివిధ రకాల చేపల్లో సాల్మన్ చాలా ఆరోగ్యకరమైనది. మాంసాహారులకు ఒక కొత్త రుచి, చిరు పులుపును కలిగించే సాల్మన్ ఫిష్-టమోటో కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా సులభమే. మరి మీరు కూడా ఒక సారి ప్రయత్నించి, రుచి చూడండి...

కావల్సిన పదార్థాలు:

సాల్మన్ ఫిష్ ఫిల్లెట్: 250 gms(మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2 (సన్నగా కట్ చేసుకోవాలి లేదా పేస్ట్ కూడా చేసుకోవచ్చు)
టమోటో: 2 (సన్నగా కట్ చేసుకోవాలి. లేదా పేస్ట్ చేసుకోవచ్చు)
పచ్చిమిర్చి: 4-5 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తొక్కుగా దంచుకోవాలి)
వెల్లుల్లి పాయలు: 4-5 (పేస్ట్ చేసుకోవాలి)
ధనియాల పొడి: 1tsp
కారం: 1tsp
పసుపు: 1tsp
ఫిష్ స్టాక్: 1 cup
పెప్పర్ పౌడర్: 1tsp
నిమ్మరసం: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

Salmon Tomato Fish Curry

తయారు చేయు విధానం:
1. ముందుగా సాల్మన్ ఫిష్ ఫిల్లెట్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించాలి.
3. ఇప్పుడు పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. ఒక నిముషం తర్వాత టమోటో పేస్ట్ కూడా వేసి మరో మూడు నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో ఫిష్ స్టాక్ పోసి, బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడుకుతుండగా అందులో నిమ్మరసం మరియు ఫిష్ ఫిల్లెట్ ముక్కలను కూడా వేయాలి.
5. ఇప్పుడు స్టౌ మంటను మీడియంలో ఉంచి మరో 5-10నిముషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. అంతే సాల్మన్ టమోటో ఫిష్ కర్రీ రెడీ.

Story first published: Monday, April 8, 2013, 13:10 [IST]
Desktop Bottom Promotion