టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా

Posted By:

ఉదయం పూట హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం పిల్లల లంచ్ బాక్స్ కోసం ఏం వండాలా అని ఆలోచిస్తున్నారా? తక్కువ సమయంలో వంట పూర్తి కావాలి, అదే సమయంలో ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకుని తినాలి... ఇలాంటి మ్యాజిక్ జరగాలంటే మీ వంటగదిలో కొద్దిగా పుదీనా, బాస్మతి బియ్యం ఉంటే చాలు. ఇల్లంతా ఘుమఘుమలాడే పుదీనా పులావ్ ఇట్టే తయారు చేయవచ్చు.

Perfect Lunch Box Recipe How to Make Mint Pulao at Home in Telugu

ఇది కేవలం ఒకే పాత్రలో సులభంగా చేసుకోగలిగే (వన్ పాట్ మీల్) వంటకం. కాబట్టి ఆఫీసుకు వెళ్లేవారికైనా, పిల్లల లంచ్ బాక్స్‌కైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ పుదీనా పులావ్ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. చికెన్ బిర్యానీ కూడా దీని ముందు దిగదుడుపే అనడంలో ఆశ్చర్యం లేదు. కూరగాయలు తినమంటే మారం చేసే పిల్లలు కూడా ఈ పులావ్‌లో వేసిన కూరగాయలను అమితంగా ఇష్టపడి తింటారు.

పుదీనా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం - 1 కప్పు
పెద్ద ఉల్లిపాయ - 1
బంగాళదుంప - 1
పచ్చి బఠానీలు - పావు కప్పు
గరం మసాలా - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10-15
ఉప్పు - రుచికి సరిపడా
పుదీనా ఆకులు - అర కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం - 1 అంగుళం ముక్క
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
యాలకులు - 1
లవంగం - 1
దాల్చిన చెక్క - చిన్న ముక్క
బిర్యానీ ఆకు - 1

Perfect Lunch Box Recipe How to Make Mint Pulao at Home in Telugu

పుదీనా పులావ్ తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, వేడి నీటిలో అయితే 10 నిమిషాలు, లేదా సాధారణ నీటిలో అయితే అరగంట పాటు నానబెట్టుకోవాలి.

-ఇప్పుడు మిక్సీ జార్‌ లో పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, నిమ్మరసం వేసి, కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పుదీనా రంగు మారకుండా పచ్చగా ఉంటుంది.

-స్టవ్ ఆన్ చేసి, ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో నూనె వేడి చేసి లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి.

-ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, ముందుగా రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేగాక, పసుపు, గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.

-ఇప్పుడు అందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి నిదానంగా కలపాలి. ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, రుచి చూసుకుని అవసరమైతే మరికాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద సరిగ్గా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

-కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత నిదానంగా మూత తీయాలి. చివరగా నెయ్యిలో దోరగా వేయించిన జీడిపప్పులను పులావ్ పైన చల్లుకుని, అన్నం విరగకుండా సున్నితంగా కలుపుకోవాలి.

-అంతే నోరూరించే, ఎంతో రుచికరమైన పుదీనా పులావ్ రెడీ. దీనిని పెరుగు రైతాతో తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Friday, June 26, 2026, 12:08 [IST]
Desktop Bottom Promotion