ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?.

షుగర్ ఉందని ఇష్టమైనవన్నీ తినడం మానేసి, రోజువారీ చప్పటి ఆహారం తింటూ బాధపడేవారు చాలా మందే ఉన్నారు. వాస్తవానికి మధుమేహం ఉన్నవారు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ తినకూడదని ఎక్కడా లేదు. బ్రేక్ ఫాస్ట్ అనేది రోజు మొత్తంలో మనం తీసుకునే అతి ముఖ్యమైన భోజనం.

Breakfast ideas protein rich and fiber food for diabetes patients expert suggestions

మేకింగ్ ఇండియా విన్ ఓవర్ డయాబెటిస్ అనేది సన్ ఫార్మా సంస్థ.. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సహకారంతో చేపట్టిన ఒక అవగాహన కార్యక్రమం. వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో కూడిన సరైన సమాచారాన్ని అందిస్తూ... భారతీయులు డయాబెటిస్ గురించి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, దాన్ని రాకుండా నివారించడానికి, ఒకవేళ వచ్చినా దానిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

సరైన ఆహారాన్ని ఎంచుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడమే కాకుండా ఉదయం పూట ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. మరి షుగర్ ఉన్నవారికి ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ అత్యుత్తమమో,నిపుణులు ఏం సూచిస్తున్నారో ఇక్కడ చూడండి.

ఇడ్లీ - కారప్పొడి లేదా సాంబార్

దక్షిణాది ప్రజల ఆల్ టైమ్ ఫేవరెట్ అల్పాహారం ఇడ్లీ. దీనిని ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి ఇందులో ఫ్యాట్ (కొవ్వు) శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో తేలికైన ఆహారం, త్వరగా అరిగిపోతుంది. మధుమేహం ఉన్నవారు ఇడ్లీని కారప్పొడితో కానీ, సాంబార్ తో కానీ కలిపి తినడం చాలా మంచిది. కారప్పొడిలో క్యాలరీలు, షుగర్ లెవల్స్ పెంచే గుణాలు తక్కువగా ఉంటాయి. ఇక సాంబార్ విషయానికొస్తే.. ఇందులో కందిపప్పు, మునక్కాయలు, క్యారెట్, టమాటా వంటి రకరకాల కూరగాయలు ఉంటాయి. దీనివల్ల శరీరానికి కావాల్సినంత ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.

ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం, జీర్ణక్రియను నెమ్మదింపజేయడం, కార్బోహైడ్రేట్లు గ్రహించబడే వేగాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ ని నిలకడగా ఉంచడంలో సహాయపడుతుంది.ఓట్స్, తృణధాన్యాలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, పప్పుధాన్యాలు, తాజా పండ్లు వంటి ఆహారాలను తగినంత ప్రోటీన్‌తో కలిపి తీసుకున్నప్పుడు అవి చాలా బెస్ట్ ఛాయిస్ గా ఉంటాయి. అయినప్పటికీ, మనం తీసుకునే ఆహారం పరిమాణం, అందులో ఉండే మొత్తం కార్బోహైడ్రేట్ల శాతం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి వ్యక్తి తమ గ్లూకోజ్ (చక్కెర) లెవల్స్, వాడుతున్న మెడిసిన్, పోషక అవసరాలకు అనుగుణంగా తమ బ్రేక్ ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి. - Dr Yelamanchili Prashanthi, MBBS , F.diab , CCGDM Dr Mohans Diabetes Specialities Centre , Vijayawada

Breakfast ideas protein rich and fiber food for diabetes patients expert suggestions

వెజిటేబుల్ ఉప్మా

రెగ్యులర్ గా తినే ఉప్మా అంటే బోర్ అనుకునే వారు దాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఉప్మా చేసేటప్పుడు అందులో క్యారెట్, బీన్స్, బఠానీలు, టమాటా, ఉల్లిపాయలు వంటి కూరగాయల ముక్కలను ఎక్కువగా వేసి వండుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ తో చేసిన ఉప్మా తినడం వల్ల శరీరానికి మంచి ఫైబర్ (పీచు పదార్థం) అందుతుంది. ఇది త్వరగా ఆకలి వేయనివ్వదు, కడుపు నిండిన భావన కలిగిస్తుంది. షుగర్ పేషెంట్లకు ఉదయం పూట ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

పెసరట్టు

పెసరట్టు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. పెసల్లో ప్రోటీన్, ఫైబర్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ (షుగర్) స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. పైగా ఇది తింటే ఎక్కువ సేపు కడుపు ఫుల్ గా ఉండి శక్తినిస్తుంది. దీనివల్ల మధ్యమధ్యలో అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి వేసి చేసిన పెసరట్టు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఉడకబెట్టిన కోడిగుడ్లు, మొలకలు

ఉదయం పూట శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కండరాలు దృఢంగా ఉండటానికి, రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి ఉడకబెట్టిన కోడిగుడ్డు, మొలకలు (స్ప్రౌట్స్) తీసుకోవచ్చు. పెసలు, శనగలు వంటి వాటితో చేసిన మొలకల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.

చిరుధాన్యాల (మిల్లెట్స్) దోశ, ఉప్మా

ఈ రోజుల్లో అందరూ ఆరోగ్య ప్రదాయినులైన మిల్లెట్స్ (చిరుధాన్యాలు) వైపు మొగ్గుచూపుతున్నారు. కొర్రలు, అరికెలు, సామలు వంటి వాటితో చేసిన దోశ లేదా ఉప్మా తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిది. సాధారణ బియ్యం కంటే ఈ మిల్లెట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి, షుగర్ ను ఒకేసారి కాకుండా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది.

మూంగ్ దాల్ - ఓట్స్ పొంగల్

ఓట్స్ లో కరిగే ఫైబర్ విశేషంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.పెసరపప్పుతో (మూంగ్ దాల్) కలిపి ఓట్స్ పొంగల్ చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ కాంబినేషన్ లో ప్రోటీన్, ఫైబర్ కలయిక వల్ల ఉదయం పూట పర్ఫెక్ట్ డైట్ గా పనికొస్తుంది.

షుగర్ ఉన్నవారు ఉదయం పూట ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి?

డీప్ ఫ్రై ఐటమ్స్ వద్దు: పూరీ, వడ, బోండా, బజ్జీ వంటి నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలను అస్సలు తినకూడదు. ఇవి బరువు పెరగడానికి, చెడు కొలెస్ట్రాల్, షుగర్ పెరగడానికి కారణమవుతాయి.

చక్కెర వద్దు: ఉదయం లేవగానే తాగే టీ, కాఫీలలో పంచదార (చక్కెర) వేసుకోవడం పూర్తిగా మానేయాలి.

బ్రెడ్ కు దూరం: మైదాతో చేసిన బేకరీ బ్రెడ్ కు దూరంగా ఉండాలి. ఇది తిన్న వెంటనే బ్లడ్ షుగర్ అమాంతం పెరిగిపోతుంది.

పండ్ల రసాలు (ఫ్రూట్ జ్యూస్ లు) వద్దు: మధుమేహం ఉన్నవారు పండ్లను ముక్కలుగా కోసుకుని నేరుగా తినవచ్చు, దీనివల్ల ఫైబర్ అందుతుంది. కానీ వాటిని జ్యూస్ లాగా చేసుకుని అస్సలు తాగకూడదు. జ్యూస్ చేసినప్పుడు అందులో ఫైబర్ అంతా పోయి, కేవలం ఫ్రక్టోజ్ (న్యాచురల్ షుగర్) మాత్రమే మిగులుతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

Disclaimer: ఈ సమాచారం కేవలం రోగుల అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఏ రకంగానూ డాక్టర్ లేదా ఇతర ఆరోగ్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ డాక్టర్‌ను సంప్రదించండి: మీరు మీ ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ మీ సొంత డాక్టర్ సలహాలను మాత్రమే తీసుకోవాలి, వాటిపైనే ఆధారపడాలి. 'సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్' (SPLL) ఈ సమాచారాన్ని ఖచ్చితంగా, సరైన సమయానికి అందించడానికి ప్రయత్నిస్తుంది, కానీ దీనికి ఎలాంటి హామీ ఇవ్వదు. సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ (SPLL) ముందస్తు అనుమతి లేకుండా ఈ సమాచారంలోని ఏ భాగాన్ని కూడా ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో (మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో) కానీ కాపీ చేయడం, ఇతరులకు పంపడం లేదా భద్రపరచడం చేయకూడదు.

SPI-IN-CVD-ZT---07-20260104

Desktop Bottom Promotion