రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

గుడ్డుతో ఎప్పుడూ చేసే ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, లేదా ఎగ్ కర్రీలు తిని బోర్ కొట్టిందా? కాస్త వెరైటీగా, అచ్చం రెస్టారెంట్ స్టైల్ లో ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుందా? అయితే మీకు క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ బెస్ట్ ఛాయిస్ గా ఉంటుంది. కరకరలాడే గుడ్డు ముక్కలు, కాస్త కారంగా-తీయగా తగిలే సాస్‌ ల రుచి, మధ్యమధ్యలో తగిలే క్రిస్పీ క్యాప్సికమ్ తింటే ఆహా ఓహో అనాల్సిందే. ఇంట్లో చిన్నచిన్న పార్టీలు ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులతో కలిసి టీ టైమ్‌ లో ఆస్వాదించడానికి ఇది బెస్ట్ స్టార్టర్.

Spicy Crispy Starter Recipe in Telugu Make Restaurant Style Capsicum Egg Chilli at Home

క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ తయారీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన గుడ్లు - 4
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
వెల్లుల్లి తరుగు - 1 చెంచా
అల్లం తరుగు - 1 చెంచా
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్ - 1
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - చిటికెడు
కారం - 2 చెంచాలు
మిరియాల పొడి - 1 చెంచా
మైదా పిండి - అర కప్పు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - అర కప్పు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
టమాటో కెచప్ - 3 చెంచాలు
సోయా సాస్ - 1 చెంచా
వెనిగర్ - ఒకటిన్నర చెంచా
గ్రీన్ చిల్లీ సాస్ - 2 చెంచాలు

Spicy Crispy Starter Recipe in Telugu Make Restaurant Style Capsicum Egg Chilli at Home
క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ తయారీ విధానం

-ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో టమాటో కెచప్, సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఈ సాస్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, బజ్జీల పిండిలా కాస్త చిక్కటి పేస్ట్‌ లా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి.

-ఉడికించిన గుడ్లను నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కాక, కట్ చేసిన గుడ్డు ముక్కలను పిండిలో ముంచి, నూనెలో నెమ్మదిగా వేయాలి. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కరకరలాడేలా వేయించి, ఒక ప్లేట్‌ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టి అందులో ఒక చెంచా నూనె వేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.

-ఉల్లిపాయలు రంగు మారాక అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్‌ మీద కలుపుతూ వేయించాలి. క్యాప్సికమ్ మరీ మెత్తబడకూడదు, కాస్త క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సాస్‌ ల మిశ్రమాన్ని ఇందులో పోయాలి. అలాగే కారం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు చక్కెర వేసి బాగా కలపాలి. ఈ గ్రేవీ కాస్త చిక్కబడే వరకు ఉడికించాలి.

-గ్రేవీ చిక్కబడ్డాక, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను ఇందులో వేసి, సాస్ అంతా గుడ్డు ముక్కలకు పట్టేలా నెమ్మదిగా టాస్ చేయాలి.

-అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ రెడీ. పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని, వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఆ మజాయే వేరు. ఫ్రైడ్ రైస్, నూడుల్స్ లోకి సైడ్ డిష్‌ గా లేదా నేరుగా స్టార్టర్‌ గా లాగించేయొచ్చు

[ of 5 - Users]
Story first published: Monday, May 11, 2026, 14:20 [IST]
Desktop Bottom Promotion