శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

వర్షపు జల్లులతో పాటు పండుగల సందడిని తీసుకొచ్చే అద్భుతమైన మాసం శ్రావణ మాసం. రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పండుగలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఇల్లంతా ఆనందాన్ని నింపుతాయి. పండుగ అంటేనే ముందుగా గుర్తొచ్చేవి తీపి వంటకాలు. అయితే ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే స్వీట్లలో రంగులు, రసాయనాలు కలిపి కల్తీ ఎక్కువగా చేస్తున్నారు.

అనారోగ్యకరమైన స్వీట్లకు బదులుగా, ఈ రక్షాబంధన్‌ కి మీ చేతులతో స్వయంగా ఆరోగ్యకరమైన, కమ్మని స్వీట్ తయారు చేయాలనుకుంటున్నారా? అయితే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే మెత్తటి పెసరపప్పు లడ్డూ మీకు బెస్ట్ ఆప్షన్. దీని ప్రత్యేకత ఏంటంటే.. పప్పును గంటల తరబడి నానబెట్టాల్సిన అవసరం లేదు, కోవా అక్కర్లేదు, అలాగే పాకం పట్టే శ్రమ అస్సలు లేదు.

Sravana Masam Special No Soaking No Sugar Syrup Healthy Moong Dal Ladoo Recipe In Telugu

పెసరపప్పు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

శుభ్రం చేసిన పెసరపప్పు - 1 కప్పు
బెల్లం - 3/4 కప్పు
నెయ్యి - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
జీడిపప్పు, బాదం, పిస్తా - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు

ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

పెసరపప్పు లడ్డు తయారీ విధానం

-ముందుగా పెసరపప్పును నీటితో శుభ్రంగా కడిగి, అందులో తేమ ఏమాత్రం లేకుండా ఒక కాటన్ గుడ్డతో బాగా పొడిగా తుడవండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బాణలి పెట్టి, అందులో నెయ్యి వేయకుండానే పెసరపప్పును వేయండి. సన్నని మంటపై సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు లేత బంగారు రంగులోకి మారి, కమ్మని సువాసన వచ్చే వరకు దోరగా వేయించండి.

-బాగా వేగిన పెసరపప్పును ఒక ప్లేట్‌ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి, రవ్వలాగా (కొద్దిగా బరకగా) ఉండేలా పొడి చేసుకోండి.

-మళ్లీ స్టవ్ మీద బాణలి పెట్టి ఒక టీస్పూన్ నెయ్యి వేడి చేయండి. అందులో తరిగిన బాదం, జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నెయ్యి వేసి, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పొడిని వేయండి. మరో రెండు, మూడు స్పూన్ల నెయ్యి జతచేసి సన్నని మంటపై రెండు మూడు నిమిషాల పాటు వేయించండి.

-ఇప్పుడు వేడిగా ఉన్న పెసరపప్పు పొడిని, తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కలిపి మళ్లీ మిక్సీ జార్‌ లో వేయండి. పల్స్ మోడ్‌ లో (ఆపుతూ ఆన్ చేస్తూ) ఒక్కసారి మాత్రమే బ్లెండ్ చేయండి. వేడికి బెల్లం కరిగి పప్పు పొడిలో అద్భుతంగా కలిసిపోతుంది. దీనివల్ల మనం విడిగా పాకం పట్టే పనే ఉండదు.

-ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. అందులో యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన నట్స్ వేసి బాగా కలపండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని గుండ్రటి లడ్డూల్లా ఒత్తుకోండి. ఒకవేళ మిశ్రమం పొడిగా అనిపిస్తే మరో స్పూన్ కరిగించిన నెయ్యి కలుపుకోవచ్చు.

-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు బెల్లం లడ్డూలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, August 12, 2026, 22:34 [IST]
Desktop Bottom Promotion